సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ‘చాపకింద నీరులా’ఒమిక్రాన్ విస్తరిస్తోందన్న అనుమానాల నేపథ్యంలో అప్రమత్తమైంది. మొదటి, రెండో కాంటాక్టులకూ వ్యాప్తి చెందుతుండటంతో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు విరివిగా చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చినవారికి సాధారణ కరోనా సోకితే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపిస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ నమోదైన కేసుల్లో తీవ్రత ఉన్న వాటన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతోపాటు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకూ ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.
ముప్పున్న దేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు
విదేశాల నుంచి ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 1.25 లక్షలమంది వచ్చారు. వారిలో ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి దాదాపు 12 వేలమంది రాగా, మిగిలిన వారంతా ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారే.
ముప్పున్న దేశాల నుంచి వచ్చినవారిలో కేవలం నలుగురికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ముప్పున్న దేశాల నుంచి వచ్చేవారందరికీ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తుండగా, ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారిలో కేవలం రెండు శాతమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ ఉందో ఎవరికీ తెలియదు.
సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువుంటే...
రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ వ్య క్తుల్లో సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువ ఉన్నవారికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తద్వారా ఒమి క్రాన్ తీవ్రతను గుర్తించాలని భావిస్తున్నారు. సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువ ఉండటం అంటే తీవ్రత ఎక్కువ ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు 150 నుంచి 190 మధ్య నమోదవుతున్నాయి. వీటిల్లో తీవ్రత ఉండేవి దాదాపు 70 శాతం వరకు ఉంటాయని అంచనా. అంటే, రోజుకు వంద వరకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సీసీఎంబీ, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబోరేటరీలుసహా గాంధీ ఆసుపత్రిలోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment