సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఇంట్లో చనిపోయినా పరిహారం దక్కుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి విదితమే. ఈ మేరకు ప్రాథమిక మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందాయి. కొందరు కోవిడ్‌తో ఆసుపత్రుల్లో కాకుండా ఇంట్లో చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే, బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందుతుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
కరోనా మృతుల కుటుంబసభ్యులు అధికారిక డాక్యుమెంట్ కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆర్‌టీపీసీఆర్ లేదా యాంటిజెన్ టెస్టులు, ఆసుపత్రుల్లో కోవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ ఉంటే ఆయా కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వొచ్చని పొందుపరిచారు. విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను కోవిడ్ మరణాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు.
95 శాతం మరణాలు 25 రోజుల్లోనే...
కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు కేంద్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో పరిహారమిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కరోనాతో ఇప్పటివరకు 3,911 మంది మృతి చెందారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాని కరోనా మరణాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి, ఈ లెక్కల ప్రకారమే కాకుండా బాధిత కుటుంబ సభ్యులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు.
అందువల్ల మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశముందని అంటున్నారు. సాధారణంగా కోవిడ్ మరణాల్లో 95 శాతం 25 రోజుల్లోనే సంభవిస్తాయి. దాన్ని మరింత విస్తృతపరిచి వైరస్ నిర్ధారణ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు మరణాలు సంభవించినా వాటిని కూడా కరోనా మరణాలుగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నప్పుడు, అది కూడా 30 రోజుల తర్వాత మరణం సంభవించినా దాన్ని కూడా కరోనా మరణంగా పరిగణిస్తారు.
ఆయా మరణాలను ధ్రువీకరించేందుకు జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అడిషనల్ కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఒక వైద్య నిపుణుడు కరోనా మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అయితే ఎప్పటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారన్న విషయంపై వైద్య శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. త్వరలో అన్ని అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment