తొలిసారి స్థానిక వ్యక్తికి కోవిడ్‌ | First Person From Telanagana Effected With Coronavirus | Sakshi
Sakshi News home page

తొలిసారి స్థానిక వ్యక్తికి కోవిడ్‌

Published Sun, Mar 22 2020 12:59 AM | Last Updated on Sun, Mar 22 2020 4:41 AM

First Person From Telanagana Effected With Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో తొలిసారిగా స్థానిక వ్యక్తికి కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌ వ్యాపారి ద్వారా ఆయన కుమారుడి (35 ఏళ్లు)కి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్‌ రావడం.. స్థానికంగా ఎవరికీ సోకకపోవడంతో డాక్టర్లు ధీమాతో ఉన్నారు. అయితే తొలిసారిగా స్థానికుడికి కూడా సోకడంతో ఇప్పుడు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికాలో క్రూజ్‌ ల్యాన్సర్‌లో పనిచేస్తున్న 33 ఏళ్ల వ్యక్తి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చాడు. అతడికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 21కి చేరాయి.

కాగా, స్థానిక వ్యక్తికి కోవిడ్‌ అంటించిన వ్యాపారి ఈ నెల 14న దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌కు చెందిన ఆ వ్యాపారికి 17న కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. 19న కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్‌ సోకిన వ్యాపారి కుమారుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, అతడు నివసించిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో 50 బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్‌పై ఆరా తీయనున్నాయి. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారు. ఒకవేళ లక్షణాలు లేకపోయినా కూడా వారిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించనున్నారు. అలాగే ఇండొనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చి కోవిడ్‌ సోకిన వారితో కాంటాక్టు అయిన 35 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే వారందరినీ కూడా ఛాతీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. (జనతా కర్ఫ్యూ : సకలం బంద్‌)

రెండో దశకు చేరుకున్న కోవిడ్‌..
ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి 86 మందితో కలసినా.. అతడు తన తండ్రితో కలసి ఒకే మంచంలో పడుకున్నా.. ఎవరికీ కోవిడ్‌ పాజిటివ్‌ రాలేదు. ఆ తర్వాత వచ్చిన 13 పాజిటివ్‌ కేసుల వరకు కూడా వారితో కాంటాక్ట్‌ అయిన వారికి కూడా కోవిడ్‌ నమోదు కాలేదు. ఇప్పటివరకు నమోదైన 21 కేసుల్లో 10 మంది ఇండోనేసియన్లకు, ఒక ప్రవాస భారతీయుడికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన వారంతా కూడా విదేశాల నుంచి మన రాష్ట్రానికి చెందిన వారికి వైరస్‌ సోకింది. కాగా, రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న నమోదైంది. ఇప్పటివరకు స్థానికులకు ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. కానీ శనివారం విదేశీ చరిత్రలేని స్థానికుడికి వ్యాప్తి చెందడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంటే వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా భావించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

వాస్తవంగా తొలి కేసులో 86 మందితో కాంటాక్టు అయినా ఒక్కరికీ రాలేదు. స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన మూడో బాధితుడితో 69 మంది కాంటాక్ట్‌ అయ్యారు. వారిలోనూ ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు. కోవిడ్‌ సోకిన 10 మంది ఇండోనేసియన్లతో కలసి ఉన్న స్థానికులెవరికీ రాలేదు. దీంతో మన దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులకు కోవిడ్‌ రెండో దశకు రాదన్న ధీమా కనిపించింది. కానీ శనివారం స్థానిక వ్యక్తికి వైరస్‌ రావడంతో పరిస్థితి తారుమారైంది. స్థానికంగా వైరస్‌ మరింత విస్తరించకుండా ఆపగలిగితేనే ఉపద్రవం నుంచి బయట పడగలుగుతాం. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండో దశకు చేరిన వైరస్‌ను ఆపగలగడమే ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్‌. స్థానికంగా పెరగకుండా ఆపడం అంటే అంత ఈజీ కాదు. రోగితో కాంటాక్టు అయిన వారిని గుర్తించడం అంత సులువు కాదు. వారిని గుర్తించకపోతే మరొకరికి, ఇలా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 

సీఎం కఠిన నిర్ణయాలు..
కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పరిస్థితి చేజారకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అవసరమైతే అన్నీ షట్‌డౌన్‌ చేస్తామని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూయడంతో పాటు అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ బంద్‌ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మహారాష్ట్రలో కేసులు మరింత పెరగడంతో పక్కనే ఉన్న మన రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావం పడనుంది. అవసరమైతే వీధుల్లోకి ఎవర్నీ రానీయకుండా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన దాదాపు 9 వేల మందిని గుర్తించి వారి ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు శనివారం జరిగిన సమీక్షలో సీఎస్‌ తెలిపారు. వారందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

బార్కాస్‌లో కలకలం..
సౌదీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలున్నాయన్న విషయం చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో కలకలం రేపింది. బార్కాస్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 9న సౌదీ నుంచి వచ్చాడు. 15 రోజుల నుంచి దగ్గు, జ్వరంతో బాధ పడుతుండగా, గమనించిన స్థానికులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు గాంధీకి వెళ్లాలని సూచించారు. దీంతో గాంధీకి తీసుకెళ్లగా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement