Telangana: రోజుకు 3 లక్షల టీకాలు | CM KCR Says To Speed Up Corona Vaccination Drive In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: రోజుకు 3 లక్షల టీకాలు

Published Sun, Sep 12 2021 10:07 PM | Last Updated on Mon, Sep 13 2021 8:35 AM

CM KCR Says To Speed Up Corona Vaccination Drive In Telangana - Sakshi

విద్య, వైద్యానికి ప్రాధాన్యం 
ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు,వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇకపై వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. మెడికల్‌ కాలేజీలు, మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సత్వర నిర్మాణంపై అధికారులు శ్రద్ధ వహించాలి.

టీకా, జాగ్రత్త.. రెండూ అవసరం 
కోవిడ్‌ టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలి. కరోనా వేవ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉన్నవారు త్వరగా కోలుకున్నారని, నిర్లక్ష్యం చేసినవారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెప్తున్నాయి. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం లక్షణాలున్నా.. ఆరోగ్య కేంద్రాల్లో చూపించుకోవాలి. మాస్కులు, కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. 

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి విస్తృతంగా వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని.. రోజుకు 3 లక్షల మందికి టీకాలు వేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్లు సరఫరా కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నా.. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ముందుజాగ్రత్తగా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని స్పష్టం చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి, సీఎస్‌ సోమేశ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ తదితరులు 

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వైద్యారోగ్యశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభమయ్యాయని.. ఎక్కడా కరోనా ప్రభావంపెద్దగా లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

అనంతరం అధికారులకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్‌ దవాఖానా పరిధిలో మరో రెండు పెద్ద భవనాలు (టవర్స్‌) నిర్మించి సేవలను మరింత విస్తృత పరచాలని ఆదేశించారు. శుభ్రత, ఇతర సేవల విషయంలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

అందరి సహకారంతో స్పెషల్‌ డ్రైవ్‌ 
రోజుకు మూడు లక్షల మందికి కోవిడ్‌ టీకాలు వేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం అయ్యేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవో, ఇతర అధికారులు వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలన్నారు.

కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు గ్రామాల్లో లాక్‌డౌన్లు పెట్టుకోవడం, కోవిడ్‌ సోకినవారి కోసం స్కూళ్లలో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా.. సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోనూ భాగస్వాములు కావాలని కోరారు. స్పెషల్‌ డ్రైవ్‌పై కలెక్టర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు వంటి ప్రభుత్వ/ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని.. అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. 

సిద్ధంగా ఉండండి 
భవిష్యత్‌లో కరోనా, సీజనల్‌ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైన మేరకు బెడ్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోటీ 42 లక్షల మందికి వ్యాక్సిన్లు.. 
రాష్ట్రంలో 18 ఏళ్లపైన వయసు ఉండి, కోవిడ్‌ టీకాకు అర్హత ఉన్నవారు 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోటీ 42 లక్షల మందికి మొదటి డోసు వేశామని.. అందులో 53 లక్షల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయన్నారు. కోటీ 38 లక్షల మందికి తొలి డోసు వేయాల్సి ఉందని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement