సాక్షి, హైదరాబాద్/ఏజీ వర్సిటీ: రాష్ట్ర హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, సకల హంగులతో నిర్మిస్తామని ఆర్ అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో హైకోర్టు భవనానికి కేటాయించిన వంద ఎకరాల స్థలాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్‌రెడ్డితో కలసి ఆయన శనివారం పరిశీలించారు.
సంబంధిత అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు సత్వరన్యాయం అందించడానికి అవసరమైన మౌలికవసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇది తీరని ఇబ్బందులు కలిగించిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయ సౌకర్యాల కల్పనలో రాజీపడకుండా కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా, సకల సౌకర్యాలతో హైకోర్టును నిర్మిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీరాజ్ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరితోపాటు ఇతర న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీలో భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తీర్మానించారు. వర్సిటీ భూములు రైతులకు విజ్ఞానాన్ని అందించడానికే తప్ప, ఇతర నిర్మాణాలకు కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment