సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారు వెలుగుమట్లలోని ఎస్‌ఆర్ గార్డెన్ వివాదంలో మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు 20 గుంటల భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
సర్వే చేపట్టాలని నోటీసులు...
ఎస్‌ఆర్ గార్డెన్‌లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన భూమి ఉందని...సర్వే చేపట్టాలని శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి ఈ నెల 14న అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ప్రసాద్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారుల నిర్ణయం ఉందని, సహజ న్యాయసూత్రాలను కూడా ఉల్లంఘించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
తమకు సంబంధించిన భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, నోటీసులను కొట్టివేయాలని కోరారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టి స్టేటస్ కో ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేయడంతోపాటు ఆ విచారణ నాటికి సర్వే నివేదికను అందజేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment