♦ ఆంక్షలు సడలించాలని అభ్యర్థన
♦ రాజకీయాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్
♦ టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ఎత్తుగడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవ సంరక్షణమండలి(జీఓ 111) రాజకీయాస్త్రంగా మరోసారి తెరమీదకు వస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంక్షలను సడలించాలని కోరుతూ న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వస్తే 111 జీఓను ఎత్తివేస్తామని ప్రకటన చేసిన టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఈ అంశంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతోంది. జంట జలాశయాల ఉనికికి ప్రమా దం ఏర్పడకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. తద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 86 గ్రామాల పరిధిలో పరిశ్రమలు, నిర్మాణాలపై అంక్షలు విధించింది. కేవలం ఎగువ ప్రాంతంలోనేగాకుండా జలాశయాలకు దిగువన 10 కి.మీ. పరిధిలోను ఈ అంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
దీంతో పరివాహాక ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తూరు మండలం ఈ జీఓ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో అభివద్ధి దాదాపుగా కుంటుపడింది. నగరీకరణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో భూముల విలువలు ఆకాశన్నంటుతున్నా.. తమ ప్రాంతంలో మాత్రం అంక్షల కారణంగా భూములను కొనలేని/అమ్మలేని పరిస్థితి ఏర్పడినందున జీవోను సడలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీలు గుప్పించాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కితే 111 జీఓను రద్దు చేస్తామని ప్రకటించారు. అందులోభాగంగా జీఓ ఎత్తివేతపై ప్రాథమిక స్థా యిలో అధికారులతో చర్చలు కూడా జరిపారు. జీఓపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం, ఏ నిర్ణయమైనా వాటికి లోబడి నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని స్పష్టం చేయడంతో ఫైలును పక్కనపెట్టారు.
ఇరుకున పెట్టేందుకు...
తనను గెలిపిస్తే 111 జీఓను ఎత్తివేయిస్తానని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించారు. దాదాపు రెండున్నరేళ్లయినా ఈ హామీని నెరవేర్చకపోగా.. కనీసం ప్రస్తావించకపోవడాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కార్తీక్‌రెడ్డి.. 111 జీఓపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీవ సంరక్షణ మండలి నిర్ధేశించడంలో శాస్త్రీయత పాటించలేదనే అంశాన్ని కోర్టు దష్టికి తేవాలని నిర్ణయించారు.