గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి, మంచినీటి సరఫరా కోసం ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇలా నిధులివ్వడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులిచ్చారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకు 95శాతం పరిష్కారం చూపాం.
మిషన్ భగీరథ ప్రాజెక్టుతో రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సగటు రోజుకు 1,650 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నా యి. అందుకే జీహెచ్‌ఎంసీలో 100% మురుగునీటి శుద్ధి చేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో నాలాలు, చెరువులను బాగు చేయాలంటే మొదట మురుగునీటి శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం.
సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడున్న అవసరంతోపాటు రాబోయే పదేళ్ల అవసరాలకు ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేశాం. ప్రస్తుతమున్న 772 ఎంఎల్‌డీల శుద్ధి సామర్థ్యానికి అదనంగా మరో 1,260 ఎంఎల్‌డీల శుద్ధి సామర్థ్యమున్న ఎస్‌టీపీలను నిర్మించడానికి ప్రభుత్వం రూ.3,866.20 కోట్లను గురువారం మంజూరు చేసింది..’’అని కేటీఆర్ తెలిపారు. నగరంలోని 31 ప్రాంతాల్లో ఎస్టీపీలను నిర్మిస్తామని.. అవి పూర్తయితే సిటీ పరిధిలోని, శివారు ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు బాగుపడతాయని చెప్పారు.
నాలాలను పునరుద్ధరిస్తాం..
ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు) తరహాలో ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు)ని ప్రభుత్వం చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. ‘‘భారీ వర్షాలు, వరదలతో ఒక్క కుటుంబం కూడా ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తలపెట్టాం. నాలాల పరిధిలో ఉన్న ఇళ్లు, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక తయారు చేశాం. ఇళ్లు కూడా నిర్మించి సిద్ధం చేశాం. ఒక్కో ఇంటిని రూ.9 లక్షలతో చేపట్టాం. బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.40–50 లక్షల వరకు ఉంటుంది..’’అని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ అనుమతితోపాటు ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న రిజర్వాయర్లను నిర్మించనున్నాం.
దాదాపు 2,100 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు ఏర్పాటు చేసి.. కొత్తగా 2లక్షల మంచినీటి కనెక్షన్లు ఇస్తాం. అదనంగా దాదాపు 20 లక్షల జనాభాకు శుద్ధమైన తాగునీరు అందుతుంది. రానున్న రెండేళ్లలోనే ఎస్టీపీలు, రిజర్వాయర్ల నిర్మణ పనులు పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం..’’అని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరం కేవలం జీహెచ్‌ఎంసీ మాత్రమే అవుతుందని.. విశ్వనగర కల సాకారం దిశగా ఇదో గొప్ప పరిణామమని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా పనులను పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఏర్పాటు చేస్తామని.. ఎస్టీపీల నిర్వహణను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపడతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment