సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆదివారం జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ –1 లో మెయిన్ పైపులైన్ తరలింపు నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
ఇదీ పరిస్థితి..
దక్షిణ మధ్య రైల్వే శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపులైన్ ఉంది. రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం అక్కడ ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్‌కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్ష¯న్ పనుల చేపడుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాస్తవంగా పనుల పూర్తికి 66 గంటలు సమయం పడుతుందని ముందుగా భావించినప్పటిఈ వాటిని 48 గంటల్లో పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు.
పూర్తి అంతరాయం కలిగే ప్రాంతాలివే..
నగర శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, డిఫెన్స్ కాలనీ. నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్ మెయిన్–3 లైన్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్‌పూర్ (మేడ్చల్/శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.
పాక్షికంగా ..
బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్‌బీ, మలేసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు. లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్ బాచుపల్లి.
ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎం తదితర ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలని, అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకుని, నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు.
చదవండి: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment