Infra projects
-
ఆలస్యం వల్ల రూ. 4.80 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది. 2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి. -
పట్టణాలకు అభివృద్ధి కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. 142 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో దేశంలోనే 46.8 శాతం పట్టణీకరణతో మూడోస్థానంలో ఉన్న తెలంగాణ మరో మూడేళ్లలో మొదటిస్థానానికి ఎగబాకబోతోందని ఇటీవల నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ‘తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు వరద కాలువల అభివృద్ధి, మురుగునీటి శుద్ధికేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.3,809 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ రూపొందించిన ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఇప్పటివరకు 117 పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,219 కోట్లు కేటాయించింది. అందులో రూ.72.68 కోట్లతో చేపట్టిన సిద్దిపేట భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.75.76 కోట్ల సిరిసిల్ల తాగునీటి సరఫరా ప్రాజెక్టు, రూ.160.05 కోట్ల నిజామాబాద్ మురుగునీటి సరఫరా పనులు, రూ.81.41 కోట్లతో చేపట్టిన సూర్యాపేట డ్రైనేజ్ పథకం పనులు 71 శాతం పూర్తయ్యాయి. 12 నగరాల్లో రూ.1,616 కోట్ల ప్రణాళికలు జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్ రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, సిద్దిపేటలో 2015 నుంచి 2020 వరకు రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికల అమలుకు రూ.1,616 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటిలో నీటి సరఫరాకు సంబంధించి రూ.1,441 కోట్లతో 27 పనులు, రూ.40 కోట్లతో 35 పార్కు పనులు, 2 పట్టణాల్లో మురుగునీటి పారుదలకు సంబంధించి రూ.184 కోట్లతో 4 పనులు చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. -
యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు. -
హైదరాబాద్‌కు ఒక్కరోజే ... 5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి, మంచినీటి సరఫరా కోసం ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇలా నిధులివ్వడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులిచ్చారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకు 95శాతం పరిష్కారం చూపాం. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. జీహెచ్ఎంసీ పరిధిలో సగటు రోజుకు 1,650 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నా యి. అందుకే జీహెచ్ఎంసీలో 100% మురుగునీటి శుద్ధి చేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో నాలాలు, చెరువులను బాగు చేయాలంటే మొదట మురుగునీటి శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడున్న అవసరంతోపాటు రాబోయే పదేళ్ల అవసరాలకు ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేశాం. ప్రస్తుతమున్న 772 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యానికి అదనంగా మరో 1,260 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యమున్న ఎస్టీపీలను నిర్మించడానికి ప్రభుత్వం రూ.3,866.20 కోట్లను గురువారం మంజూరు చేసింది..’’అని కేటీఆర్ తెలిపారు. నగరంలోని 31 ప్రాంతాల్లో ఎస్టీపీలను నిర్మిస్తామని.. అవి పూర్తయితే సిటీ పరిధిలోని, శివారు ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు బాగుపడతాయని చెప్పారు. నాలాలను పునరుద్ధరిస్తాం.. ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు) తరహాలో ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు)ని ప్రభుత్వం చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. ‘‘భారీ వర్షాలు, వరదలతో ఒక్క కుటుంబం కూడా ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తలపెట్టాం. నాలాల పరిధిలో ఉన్న ఇళ్లు, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక తయారు చేశాం. ఇళ్లు కూడా నిర్మించి సిద్ధం చేశాం. ఒక్కో ఇంటిని రూ.9 లక్షలతో చేపట్టాం. బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.40–50 లక్షల వరకు ఉంటుంది..’’అని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ అనుమతితోపాటు ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న రిజర్వాయర్లను నిర్మించనున్నాం. దాదాపు 2,100 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు ఏర్పాటు చేసి.. కొత్తగా 2లక్షల మంచినీటి కనెక్షన్లు ఇస్తాం. అదనంగా దాదాపు 20 లక్షల జనాభాకు శుద్ధమైన తాగునీరు అందుతుంది. రానున్న రెండేళ్లలోనే ఎస్టీపీలు, రిజర్వాయర్ల నిర్మణ పనులు పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం..’’అని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరం కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే అవుతుందని.. విశ్వనగర కల సాకారం దిశగా ఇదో గొప్ప పరిణామమని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా పనులను పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఏర్పాటు చేస్తామని.. ఎస్టీపీల నిర్వహణను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపడతామని వివరించారు. -
ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఆంద్రప్రధేశ్లోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక కారిడార్ వంటి భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇన్‌క్యాప్ రూపొందించిన సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలో విమానాశ్రయ నిర్మాణ దిశగా అడుగులు పడనున్నాయి. అలాగే రాష్ట్రంలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ), నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టులకు నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఇన్‌క్యాప్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సేవలకు బిడ్లు.. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు, వాటి అమలును పర్యవేక్షించడానికి కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పవన మూర్తి సాక్షికి తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఆగస్టు 25లోగా బిడ్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ లీడర్, ఫైనాన్స్, టెక్నికల్ అంశాల విషయంలో కన్సల్టెన్సీ సేవలు అందించాలి. ‘పైలెట్ శిక్షణ’కూ బిడ్లు కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సాంకేతిక నివేదికను తయారు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి ఇన్‌క్యాప్ బిడ్లను ఆహ్వానించింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును దృష్టిలో పెట్టుకొని కర్నూలు చుట్టుపక్కల ఏపీఐఐసీ పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో పైలెట్ శిక్షణతో పాటు ఇతర అవకాశాలను పరిశీలించి టెక్నో ఫీజబిలిటీ స్టడీ రిపోర్ట్ (టీఎఫ్ఆర్)ను ఇన్‌క్యాప్ తయారు చేస్తోంది. దేశీయ విమానయాన రగంలో వస్తున్న మార్పులు, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు, ఈ శిక్షణ కేంద్రం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలతో నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 18లోగా ఈ మెయిల్ ద్వారా బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఇన్‌క్యాప్ కోరింది. -
తక్కువ వ్యవధిలో ఫలితం ఇచ్చే ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలను అందించే మౌలిక రంగం ప్రాజెక్టులపై తదుపరి దఫా ఉద్దీపనా చర్యలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వివిధ ఆర్థిక వ్యవస్థలు అంచనావేసిన తీవ్ర స్థాయిలో (10 నుంచి 15 శాతం వరకూ క్షీణ అంచనాలు) భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణత ఉండదని భావిస్తున్నాను. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ద్రవ్యపరమైన ప్రత్యక్ష మద్దతు సాధ్యంకాదు. ప్రభుత్వం అందించే పలు ఉద్దీపన చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి సత్వర సాధనకు దోహదపడతాయి. కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను రక్షించడానికి మార్చిలో కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేపీ) పథకాన్ని ప్రకటించింది. తరువాత మేలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది. వారం క్రితం మూడవ ప్యాకేజీ ప్రకటించింది. దీనిప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజ్ విలువ దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. మరో దఫా ఉద్దీపన ప్యాకేజ్ సంకేతాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇస్తున్నారు. మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ వ్యయాల ద్వారా వృద్ధికి తోడ్పాటును అందించవచ్చని పలు వర్గాలు కేంద్రానికి సలహాలను ఇస్తున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇన్ఫ్రా కంపెనీలకు ప్రధాని మోదీ జోష్
మౌలిక సదుపాయాల కల్పనా రంగ కంపెనీలకు ప్రధాని మోదీ ప్రసంగం తాజాగా జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోదీ.. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల రంగానికి భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ.. ఉపాధికి ఊతమిస్తూ.. రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇందుకు విభిన్న రంగాలలో 7,000 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లాభాల తీరు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధ పలు కంపెనీల కౌంటర్లు ప్రస్తుతం వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ 6 శాతం జంప్‌చేసి రూ. 53ను తాకగా.. అశోకా బిల్డ్‌కాన్ 4 శాతం ఎగసి రూ. 74కు చేరింది. ఈ బాటలో కేఎన్ఆర్ 5.2 శాతం పురోగమించి రూ. 226 వద్ద, ఎన్సీసీ 3 శాతం లాభంతో రూ. 33 వద్ద, ఎల్అండ్టీ 2 శాతం బలపడి రూ. 1002 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో దిలీప్ బిల్డ్‌కాన్, హెచ్‌జీ ఇన్ఫ్రా, యాక్షన్ కన్స్ట్రక్షన్, అదానీ పోర్ట్స్, అహ్లువాలియా, గాయత్రి ప్రాజెక్ట్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. -
348 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై అధిక వ్యయాల భారం
న్యూఢిల్లీ: దేశంలో మౌలికరంగ ప్రాజెక్టులు పెరిగిన వ్యయాల భారంతో నత్తనడనక నడుస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయంతో కూడిన 348 ప్రాజెక్టులు ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల మేర అధిక వ్యయాలతో జాప్యం అవుతున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక తెలియజేస్తోంది. ‘‘1,351 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం 15,72,066 కోట్లు. అయితే, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం 18,72,201 కోట్లు. అంటే మొత్తం మీద పెరుగుతున్న వ్యయాల భారం రూ.3,00,135 కోట్లు (వాస్తవ వ్యయంపై 19% ఎక్కువ)’’ అని పేర్కొంది. -
పీఎన్సీ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ
ప్రైస్ బ్రాండ్ ధర రూ. 355-378 ⇒ ఈనెల 8-12 వరకూ ఆఫర్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోడ్లు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణ సంస్థ అయిన పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్.. రూ.488 కోట్ల మేర నిధులు సమీకరించడానికి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ఈ నెల 8న ప్రారంభమై 12న ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.355-378 ప్రైస్‌బ్యాండ్‌లో కంపెనీ విక్రయానికి పెట్టింది. ప్రస్తుతం పీఎన్సీ సంస్థ చేతిలో దేశవ్యాప్తంగా 42 ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లున్నాయి. 2013-14లో కంపెనీ రూ. 6,085 కోట్ల విలువైన కాంట్రాక్టులను చేజిక్కించుకోగా... 2014-15 కంపెనీ ఆర్డర్‌బుక్ 7,849 కోట్ల రూపాయలకు చేరింది. వచ్చే రెండేళ్లలో నిర్మాణ రంగం 22 శాతం వృద్ధి రేటుతో రూ.12.86 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇన్ఫ్రా కంపెనీలకు అద్భుతమైన అవకాశాలున్నాయని కంపెనీ ఈ సందర్భంగా తెలియజేసింది. -
ఇన్ఫ్రా ప్రాజెక్టుల అమలుకు సమన్వయ వ్యవస్థ: కేంద్రం
ముంబై: భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు సంబంధిత వర్గాలు సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. మరిన్ని ప్రాజెక్టులు సమస్యల వలయంలో చిక్కుకోకుండా ఈ చర్యలు అవసరమని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఇన్ఫ్రా రంగ పరిస్థితులపై అధియా సారథ్యంలో ఆర్బీఐ, బ్యాంకింగ్, పరిశ్రమ వర్గాలు మంగళవారం సమావేశమయ్యాయి. విద్యుత్, ఉక్కు తదితర రంగాలకు చెందిన 85 భారీ ప్రాజెక్టులు ఎదురవుతున్న సమస్యలను ఇందులో చర్చించారు. వీటి విలువ సుమారు 3.51 లక్షల కోట్లు ఉంటుందని, ఇందులో 4 శాతం ప్రాజెక్టులు మాత్రమే నిరర్థక ఆస్తులుగా మారాయని అధియా తెలిపారు. ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, ఐబీఏ చీఫ్ టీఎం భాసిన్, ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ రాజేంద్రన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మోడి పైనే ఇన్ఫ్రా ఆశలు
* ఇంకా సమస్యల సుడిగుండంలోనే ఇన్ఫ్రా రంగం * ఆగిపోయిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల విలువ రూ.6.26 లక్షల కోట్లు * కాగ్ నివేదిక ప్రకారం కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1.40 లక్షల కోట్లు * ఐదవ పంచవర్ష ప్రణాళికలో రూ.45 లక్షల కోట్లు అవసరం * ప్రత్యేక ఇన్ఫ్రా మంత్రి, ఉద్దీపన ప్యాకేజీలు కావాలి: పరిశ్రమ మోడీపై ఆశతో షేర్ల పరుగులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న దేశీయ మౌలికరంగం నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారీ ఆశలే పెట్టుకుంది. ఆర్థికమందగమనానికి తోడు, పర్యావరణం, భూ సేకరణ వంటి అనేక అంశాలతో భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2013-14లో దేశంలో ఆగిపోయిన మౌలిక ప్రాజెక్టుల విలువ రూ. 6.26 లక్షల కోట్లకు చేరినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేసింది. ఆగిపోయిన ప్రాజెక్టులకు తోడు పెరిగిన వడ్డీరేట్లు ఇన్ఫ్రా కంపెనీలకు గోరుచుట్టుపై రోకలిపోటులా తయారయ్యింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు పునర్ వ్యవస్థీకరించిన రుణాల్లో 21 శాతం (విలువలో రూ.50,239 కోట్లు) వాటా ఇన్ఫ్రా రంగానిదే. కేంద్రంలో మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇలా ఆగిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయన్న నమ్మకాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ఇంకా గడ్డు పరిస్థితే.. ఇప్పటికీ ఇన్ఫ్రా రంగం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోందని, మరో 6 నెలలు గడిస్తేనే కాని కోలుకునే అవకాశం ఉందా లేదా చెప్పలేమని ఐవీఆర్సీఎల్ సీఎండీ ఈ.సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కాగ్ తాజా అంచనాల ప్రకారమే పూర్తి చేసిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.1.49 లక్షల కోట్లుగా ఉందని, వీటిని తీర్చకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధు లు ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. తాము పూర్తి చేసిన ప్రా జెక్టులకు సుమారు రూ.2,000 కోట్లు, అలాగే క్లెయిమ్‌ల రూపంలో రూ.5,000 కోట్లు రావల్సి ఉందన్నారు. అభివృద్ధి నినాదంతో వచ్చిన మోడీ ఇన్ఫ్రా రంగానికి ఊపిరులూదగలరన్న ధీమాను ఎన్సీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వై.డి.మూర్తి వ్యక్తం చేశారు. డిమాండ్స్ ఇవీ... దేశ ఆర్థిక వృద్ధిరేటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనేక మందికి ఉపాధి కల్పించే ఇన్ఫ్రా రంగంపై ప్రభుత్వం తక్షణం దృష్టిపెట్టాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టులు ఆగిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరటనిచ్చే విధంగా ఉద్దీపన ప్యాకేజీలను కోరుతోంది. ముఖ్యంగా సర్వీస్ ట్యాక్స్ భారం నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు, వడ్డీపై ఇచ్చే ఏటీఐఏ ప్రయోజనాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టేటపుడు ప్రభుత్వం వద్ద ఇన్ఫ్రా కంపెనీ వుంచే డిపాజిట్‌పై లభించే ఈ వడ్డీ ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి చిదంబరం కొద్దికాలం క్రితం తొలగించారు. ఇన్ఫ్రా రంగంలో కీలకమైన రోడ్డు రవాణా, రేవులు, పౌర విమానయానం, మైనింగ్ వంటి వివిధ శాఖలకు సమర్థులైన వారికి మంత్రి వర్గ బాధ్యతలను అప్పగించడమే కాకుండా, మౌలికరంగ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతుల జాప్యం కారణంగా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతే జరిగే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు. మౌలికరంగ పనులు వేగంగా అమలయ్యే విధంగా ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ రంగానికి అవసరమైన దిగుమతి చేసుకునే యంత్రసామగ్రిపై సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని పరిశ్రమ కోరుతోంది. 45 లక్షల కోట్లు కావాలి.. ఆగిపోయిన ప్రాజెక్టులతో పాటు 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక ప్రాజెక్టుల అమలుకు సుమారు రూ.45 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది దీపక్ పరేఖ్ కమిటీ అంచనా. మౌలిక ప్రాజెక్టులు అమలుకు సంబంధించి 2012లో హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయగా, అది తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక (బ్లూ ప్రింట్)ను త్వరలోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ కమిటీ అంచనాల ప్రకారం 11వ పంచవర్ష ప్రణాళిక(2007-2012)లో రూ.19 లక్షల కోట్లు వ్యయం కాగా అదిప్పుడు రూ.45 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో సగం ప్రైవేటు పెట్టుబడుల రూపంలో వస్తుందని అంచనా వేసినా మిగిలిన మొత్తం ప్రభుత్వం సమకూర్చడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా ప్రాజెక్టులు మొదలవుతున్నాయనే ప్రచారం కోసం కాంట్రాక్టులు పిలవడం కాకుండా, సరైన నగదు ఉంటేనే ఈపీసీ కాంట్రాక్టులను పిలవాలని సుధీర్ రెడ్డి అన్నారు.