మోడి పైనే ఇన్‌ఫ్రా ఆశలు | infra structure sector financial sector issues | Sakshi
Sakshi News home page

మోడి పైనే ఇన్‌ఫ్రా ఆశలు

Published Wed, May 21 2014 12:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడి పైనే ఇన్‌ఫ్రా ఆశలు - Sakshi

మోడి పైనే ఇన్‌ఫ్రా ఆశలు

* ఇంకా సమస్యల సుడిగుండంలోనే ఇన్‌ఫ్రా రంగం

* ఆగిపోయిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల విలువ రూ.6.26 లక్షల కోట్లు
కాగ్ నివేదిక ప్రకారం కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1.40 లక్షల కోట్లు
ఐదవ పంచవర్ష ప్రణాళికలో రూ.45 లక్షల కోట్లు అవసరం
ప్రత్యేక ఇన్‌ఫ్రా మంత్రి, ఉద్దీపన ప్యాకేజీలు కావాలి: పరిశ్రమ  మోడీపై ఆశతో షేర్ల పరుగులు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న దేశీయ మౌలికరంగం నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారీ ఆశలే పెట్టుకుంది. ఆర్థికమందగమనానికి తోడు, పర్యావరణం, భూ సేకరణ వంటి అనేక అంశాలతో భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2013-14లో దేశంలో ఆగిపోయిన మౌలిక ప్రాజెక్టుల విలువ రూ. 6.26 లక్షల కోట్లకు చేరినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేసింది.

ఆగిపోయిన ప్రాజెక్టులకు తోడు పెరిగిన వడ్డీరేట్లు ఇన్‌ఫ్రా కంపెనీలకు గోరుచుట్టుపై రోకలిపోటులా తయారయ్యింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు పునర్ వ్యవస్థీకరించిన రుణాల్లో 21 శాతం (విలువలో రూ.50,239 కోట్లు) వాటా ఇన్‌ఫ్రా రంగానిదే. కేంద్రంలో మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇలా ఆగిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయన్న నమ్మకాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది.
 
ఇంకా గడ్డు పరిస్థితే..
ఇప్పటికీ ఇన్‌ఫ్రా రంగం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోందని, మరో 6 నెలలు గడిస్తేనే కాని కోలుకునే అవకాశం ఉందా లేదా చెప్పలేమని ఐవీఆర్‌సీఎల్ సీఎండీ ఈ.సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కాగ్ తాజా అంచనాల ప్రకారమే పూర్తి చేసిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.1.49 లక్షల కోట్లుగా ఉందని, వీటిని తీర్చకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధు లు ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. తాము పూర్తి చేసిన ప్రా జెక్టులకు సుమారు రూ.2,000 కోట్లు, అలాగే క్లెయిమ్‌ల రూపంలో రూ.5,000 కోట్లు రావల్సి ఉందన్నారు. అభివృద్ధి నినాదంతో వచ్చిన మోడీ ఇన్‌ఫ్రా రంగానికి ఊపిరులూదగలరన్న ధీమాను ఎన్‌సీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వై.డి.మూర్తి వ్యక్తం చేశారు.
 
 డిమాండ్స్ ఇవీ...
 దేశ ఆర్థిక వృద్ధిరేటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనేక మందికి ఉపాధి కల్పించే ఇన్‌ఫ్రా రంగంపై ప్రభుత్వం తక్షణం దృష్టిపెట్టాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టులు ఆగిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరటనిచ్చే విధంగా ఉద్దీపన ప్యాకేజీలను కోరుతోంది. ముఖ్యంగా సర్వీస్ ట్యాక్స్ భారం నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు,  వడ్డీపై ఇచ్చే ఏటీఐఏ ప్రయోజనాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టేటపుడు ప్రభుత్వం వద్ద ఇన్‌ఫ్రా కంపెనీ వుంచే డిపాజిట్‌పై లభించే ఈ వడ్డీ ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి చిదంబరం కొద్దికాలం క్రితం తొలగించారు.
 
ఇన్‌ఫ్రా రంగంలో కీలకమైన రోడ్డు రవాణా, రేవులు, పౌర విమానయానం, మైనింగ్ వంటి వివిధ శాఖలకు సమర్థులైన వారికి మంత్రి వర్గ బాధ్యతలను అప్పగించడమే కాకుండా, మౌలికరంగ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతుల జాప్యం కారణంగా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతే జరిగే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు. మౌలికరంగ పనులు వేగంగా అమలయ్యే విధంగా ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ రంగానికి అవసరమైన దిగుమతి చేసుకునే యంత్రసామగ్రిపై సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని పరిశ్రమ కోరుతోంది.
 
 45 లక్షల కోట్లు కావాలి..
 ఆగిపోయిన ప్రాజెక్టులతో పాటు 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక ప్రాజెక్టుల అమలుకు సుమారు రూ.45 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది దీపక్ పరేఖ్ కమిటీ అంచనా. మౌలిక ప్రాజెక్టులు అమలుకు సంబంధించి 2012లో హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయగా, అది తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక (బ్లూ ప్రింట్)ను త్వరలోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అందచేయనుంది.

ఈ కమిటీ అంచనాల ప్రకారం 11వ పంచవర్ష ప్రణాళిక(2007-2012)లో రూ.19 లక్షల కోట్లు వ్యయం కాగా అదిప్పుడు రూ.45 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో సగం ప్రైవేటు పెట్టుబడుల రూపంలో వస్తుందని అంచనా వేసినా మిగిలిన మొత్తం ప్రభుత్వం సమకూర్చడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా ప్రాజెక్టులు మొదలవుతున్నాయనే ప్రచారం కోసం కాంట్రాక్టులు పిలవడం కాకుండా, సరైన నగదు ఉంటేనే ఈపీసీ కాంట్రాక్టులను పిలవాలని సుధీర్ రెడ్డి అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement