మౌలిక సదుపాయాల కల్పనా రంగ కంపెనీలకు ప్రధాని మోదీ ప్రసంగం తాజాగా జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోదీ.. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల రంగానికి భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ.. ఉపాధికి ఊతమిస్తూ.. రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇందుకు విభిన్న రంగాలలో 7,000 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
లాభాల తీరు..
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధ పలు కంపెనీల కౌంటర్లు ప్రస్తుతం వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ 6 శాతం జంప్‌చేసి రూ. 53ను తాకగా.. అశోకా బిల్డ్‌కాన్ 4 శాతం ఎగసి రూ. 74కు చేరింది. ఈ బాటలో కేఎన్‌ఆర్ 5.2 శాతం పురోగమించి రూ. 226 వద్ద, ఎన్‌సీసీ 3 శాతం లాభంతో రూ. 33 వద్ద, ఎల్‌అండ్‌టీ 2 శాతం బలపడి రూ. 1002 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో దిలీప్ బిల్డ్‌కాన్, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, యాక్షన్ కన్‌స్ట్రక్షన్, అదానీ పోర్ట్స్, అహ్లువాలియా, గాయత్రి ప్రాజెక్ట్స్ 2 శాతం చొప్పున ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment