Private investment
-
రియల్టీలోకి తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రాక మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తక్కువగా 1.18 బిలియన్ డాలర్ల (రూ.9,086 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్టు రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 2021 మొదటి మూడు నెలల్లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు రూ.3.08 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. కార్యాలయం విభాగంలో పీఈ పెట్టుబడులు 732 మిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కార్యాలయ విభాగంలోకి 2,148 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస విభాగంలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 234 మిలియన్ డాలర్ల నుంచి 73 మిలియన్ డాలర్లకు తగ్గాయి. రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 484 మిలియన్ డాలర్ల నుంచి 253 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. 2021 పూర్తి ఏడాదికి రియల్టీలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 6,199 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. -
ఇన్ఫ్రా కంపెనీలకు ప్రధాని మోదీ జోష్
మౌలిక సదుపాయాల కల్పనా రంగ కంపెనీలకు ప్రధాని మోదీ ప్రసంగం తాజాగా జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోదీ.. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల రంగానికి భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ.. ఉపాధికి ఊతమిస్తూ.. రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇందుకు విభిన్న రంగాలలో 7,000 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లాభాల తీరు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధ పలు కంపెనీల కౌంటర్లు ప్రస్తుతం వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ 6 శాతం జంప్‌చేసి రూ. 53ను తాకగా.. అశోకా బిల్డ్‌కాన్ 4 శాతం ఎగసి రూ. 74కు చేరింది. ఈ బాటలో కేఎన్ఆర్ 5.2 శాతం పురోగమించి రూ. 226 వద్ద, ఎన్సీసీ 3 శాతం లాభంతో రూ. 33 వద్ద, ఎల్అండ్టీ 2 శాతం బలపడి రూ. 1002 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో దిలీప్ బిల్డ్‌కాన్, హెచ్‌జీ ఇన్ఫ్రా, యాక్షన్ కన్స్ట్రక్షన్, అదానీ పోర్ట్స్, అహ్లువాలియా, గాయత్రి ప్రాజెక్ట్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. -
ప్రైవేటు పెట్టుబడులు... గ్రామీణ డిమాండ్ కీలకం
భారత్ వృద్ధిపై ఏడీబీ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కీలక అంశాలని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడిబీ) విశ్లేషించింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో వృద్ధికి ఈ అంశాలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై ఈ మేరకు మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు... ♦ వృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు, పట్టణ వినియోగం (డిమాండ్) కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి పటిష్టతకు ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కూడా పటిష్ట పడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో- దేశీయ డిమాండ్ అన్ని స్థాయిల్లో పటిష్ట పడాలి. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధిరేటు అంచనా 7.4 శాతం. బలహీన గ్లోబల్ డిమాండ్, ఎగుమతులు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గడానికి కారణం. ♦ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెరుగుదల వల్ల పట్టణ వినియోగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో గ్రామీణ వినియోగ డిమాండ్ పటిష్టతపై సందేహాలు నెలకొన్నాయి. -
ప్రైవేట్ పెట్టుబడులపై దృష్టి
♦ వృద్ధి చోదకాలపై కసరత్త్తు ♦ డబ్ల్యూఈఎఫ్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ♦ ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం దావోస్: అధిక వృద్ధి సాధించే దిశగా ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణపై భారత్ దృష్టి పెట్టిందని, వృద్ధి సాధనకు తోడ్పడే బహుళ చోదకాలపై కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాజ్యసభలో గణాంకాలు త్వరలో మారగలవని, చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) వంటి సంస్కరణలు అమల్లోకి రాగలవని ఆయన తెలిపారు. అనేకానేక భిన్నాభిప్రాయాలుండే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్కరణ బిల్లు కూడా ఇంతకాలం ఆగిపోలేదని, జీఎస్టీ మొదలైనవి త్వరలో పార్లమెంటు ఆమోదం పొందగలవని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ‘ప్రపంచ వృద్ధికి తదుపరి చోదక శక్తిగా భారత్’ అనే అంశంపై పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ బీసీజీ నిర్వహించిన అల్పాహార విందు సెషన్లో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు వివరించారు. ఎకానమీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. దేశ వృద్ధి సాధనకు మరిన్ని చోదక శక్తులు అవసరమని గుర్తించి.. ఇన్ఫ్రా తదితర రంగాలపై దృష్టి పెడుతున్నామని, దేశ చరిత్రలోనే తొలిసారిగా సబ్సిడీలను క్రమబద్ధీకరించామని ఆయన వివరించారు. భార త మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. మరింత వృద్ధి సత్తా ఉంది .. ప్రస్తుతం 7-7.5 శాతం వృద్ధి రేటు కన్నా అదనంగా 1-1.5 శాతం వృద్ధి సాధించగలిగే సామర్థ్యం భారత్‌కి ఉందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. దీన్ని సాధించే దిశగా రైల్వే ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతించామని, అటు డిఫెన్స్ రంగంలోనూ విదేశీ పెట్టుబడులకు ఆస్కారం కల్పించామని ఆయన చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసేలా దేశీ సంస్థలను ప్రోత్సహించేలా భారత్ ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోందని జైట్లీ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సరళతరం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల సమస్య పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. పన్నుల విధానాలు సరళం చేస్తున్నాం.. పన్నుల విధానాలు అర్ధంతరంగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా చూసేందుకు పలు సంస్కరణలను ప్రవేశపెట్టామని ట్యాక్సేషన్ చట్టాలపై సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకి పంపిన వీడియో సందేశంలో జైట్లీ చెప్పారు. దీంతో వీటిపరమైన వివాదాలేమీ ప్రస్తుతం లేవని పేర్కొన్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్ సభ్యదేశాలుగా ఏషియన్ బిజినెస్ లా ఇనిస్టిట్యూట్ (ఏబీఎల్ఐ) ఏర్పాటు కావడాన్ని ఆయన స్వాగతించారు. మొబైల్ బ్యాంకింగ్ హవా: కొచర్ కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్న అతి తక్కువ రంగాల్లో ఆర్థిక రంగం కూడా ఒకటని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తెలిపారు. తమ బ్యాంకు విషయానికొస్తే.. ఈసారి శాఖల్లో జరిగిన లావాదేవీలకన్నా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిగినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా రూ. 80,000 కోట్లు విలువ చేసే లావాదేవీల నిర్వహణను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి చూస్తే మొబైల్ బ్యాంకింగ్ విభాగంలో 29 శాతం వాటాతో తమ బ్యాంకు ముందు వరుసలో ఉందని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొచర్ తెలిపారు. మరోవైపు తయారీ రంగం, నవకల్పనలు, నైపుణ్యాల అభివృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరగగలదని దక్షిణాసియా రూపాంతరం అంశంపై జరిగిన సదస్సులో కొచర్ చెప్పారు. దాదాపు 70 శాతం జనాభా 30 ఏళ్ల లోపు ఉన్న తమ దేశంలోనూ నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. అటు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా తమ దేశంలో ఉద్యోగాల కల్పనకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హాంకాంగ్: ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశంగా పేర్కొన్నారు. ‘‘వృద్ధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం పెట్టుబడులు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల సంగతీ అంతే’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మౌలిక రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహాన్ని అందిస్తున్న అంశాలుగా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం బ్రిటన్‌లో మాట్లాడుతూ, దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగాయని, ప్రపంచానికి భారత్ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతం అందించే క్రమంలో సెప్టెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు రెపో 6.75 శాతానికి తగ్గింది. -
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని
* రైల్వే రంగంలో విదేశీ పెట్టుబడులపై అపోహలొద్దని హితవు * ప్రపంచానికి నిపుణులైన టీచర్ల అవసరం ఉందని వ్యాఖ్య రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో నిపుణులైన ఉద్యోగుల కోసం 4 రైల్వే యూనివర్సిటీలను ప్రారంభించనున్నామన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని.. ప్రపంచ దేశాల అవసరాలు తీరేలా నిపుణులైన ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వేశ్వరాలయం పక్కనున్న ఇరుకైన వీధిని శుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ‘స్వచ్ఛభారత్’కు మరికొందరిని నామినేట్ చేశారు. వారణాసి: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించాలనే కోరిక కానీ, ఆ ఆలోచన కానీ తమ ప్రభుత్వానికి లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఆ విషయంలో అనవసర భయాలేమీ పెట్టుకోవద్దని సూచించారు. దేశంలో, విదేశాల్లో ఉన్న వ్యాపార సంస్థల వద్ద భారీ ఎత్తున ఉన్న పెట్టుబడులను రైల్వేల ఆధునీకరణకు ఉపయోగించడంపై అర్థం లేని అపోహలు పెట్టుకోవద్దన్నారు. సాధారణ ప్రయాణికులపై మరింత భారం వేయకుండా, వారికి మెరుగైన సేవలందించేందుకు, మౌలిక వసతుల కల్పనకు ఆ పెట్టుబడులను వినియోగిస్తామన్నారు. ఆ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడతాయన్నారు. కొన్ని విభాగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల అంతిమంగా మన దేశమే లబ్ధి పొందుతుందన్నారు. రైల్వేల్లో సాంకేతికాభివృద్ధి, మానవవనరుల సమర్థ నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 4 రైల్వే విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారణాసి శివార్లలో ఉన్న డీజిల్ లోకోమోటివ్ వర్క్స్(డీఎల్‌డబ్ల్యూ) కర్మాగార విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే, అక్కడి 4500 హెచ్‌పీ ఏసీ ప్యాసెంజర్ రైలింజన్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లో తాను టీ అమ్మిననాటి రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘రైల్వేలతో ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకునేదానికన్నా ఎక్కువ అనుబంధం నాకుంది. రైల్వేలను ప్రైవేటీకరించబోతున్నారని ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. మేం ఆ దిశగా వెళ్లడం లేదు. రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదు. కార్మికులు భయపడొద్దు’ అని విస్పష్టంగా ప్రకటించారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా, 100% దేశీయ యంత్రాల రూపకల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో రైల్వేలను అనుసంధానించే ప్రణాళిక గురించి మోదీ వివరించారు. మళ్లీ చీపురు పట్టారు...: వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న అస్సి ఘాట్‌కు వెళ్లి అక్కడి పరిశుభ్రతపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వయంగా చీపురు పట్టి విశ్వేశ్వరాలయం పక్కనున్న విశ్వనాథ్ వీధిని శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ, మాజీ క్రికెటర్ గంగూలీ, స్టార్ కమెడియన్ కపిల్‌శర్మ, నృత్యకారిణి సొనాల్ మాన్సింగ్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఇండియాటుడే గ్రూప్‌కు చెందిన అరుణ్ పూరీ తదితరులను స్వచ్ఛభారత్‌కు నామినేట్ చేశారు. ఢిల్లీ వెళ్లే ముందు గుజరాత్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్, ఇతరులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. నిపుణులైన ఉపాధ్యాయులు రావాలి నిపుణులైన ఉపాధ్యాయుల కోసం ప్రపంచ దేశాలన్నీ భారీ అంచనాలతో భారత్ వైపు చూస్తున్నాయని మోదీ అన్నారు. గురువారం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో ఆయన సుపరిపాలన ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత.. బోధనపై ఆసక్తి ఉన్న వారికోసం ఐదేళ్ల కాలపరిమితితో ఉపాధ్యాయ శిక్షణ కోర్సును ప్రారంభించాలని మోదీ సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన ఉన్న అత్యున్నత నైపుణ్యం కలిగిన టీచర్లను లక్షల సంఖ్యలో ప్రపంచానికి అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. వేరే రంగాల్లో ఉద్యోగావకాశం రానివారే బోధన రంగంలోకి వస్తున్నారని, ఆ ధోరణి మారాలన్నా రు. భ్రూణ హత్యలను మించిన మహాపాపం మరోటి లేదని, దీన్ని అరికట్టేలా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు సాంస్కృతిక, కళా రంగాలకు చెందినవారు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ వ్యవస్థాపకుడు, భారతరత్న పురస్కార గ్రహీత మదన్మోహన్ మాలవీయ పేరుతో ఒక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. -
ఇక ప్రైవేటు రంగంలో విమానాల తయారీ
రవాణా విమానాల ప్రాజెక్టుకు మోడీ సర్కారు గ్రీన్‌సిగ్నల్ దేశీయ ప్రైవేట్ రంగ కంపెనీలకు మాత్రమే అనుమతి రూ. 21 వేల కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్టులకూ ఆమోదం న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగానికి సంబంధించిన రూ. 21 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కీలకమైన రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీన్ని చేపట్టేందుకు దేశీయ ప్రైవేటు రంగ కంపెనీలను మాత్రమే అనుమతించింది. ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్భాగస్వామ్యం లేకుండా ప్రైవేటురంగంలో విమానాల తయారీకి ప్రభుత్వం ఆమోదం తెలపడం ఇదే తొలిసారి. శనివారం రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏసీ ఆమోదం తెలిపిన కీలక ప్రతిపాదనల్లో ఎక్కువ శాతం.. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలకే అనుమతులు ఇవ్వడం గమనార్హం. రక్షణ పరికరాల తయారీలో స్వదేశీ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది. 56 రవాణా విమానాల తయారీకి ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్లు పిలవాలన్న వాయుసేన(ఐఏఎఫ్) ప్రతిపాదనలకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు రంగంలోని కంపెనీలకు మాత్రమే ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పించడం వల్ల వాటి సామర్థ్యాన్ని పెంపొందించేలా చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. దేశంలో రక్షణ రంగానికి చెందిన ప్రైవేటు కంపెనీలైన టాటా, మహీంద్రా తదితర సంస్థలు టెండర్లు వేసి విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో విమాన్చాజీ తయారు చేయొచ్చు. రూ. 20 వేల కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కింద 16 రవాణా విమానాలను విదేశీ భాగస్వామ్యంతో.. 40 విమానాలను భారత్‌లో తయారు చేయాలి. నౌకాదళం కోసం రూ. 9 వేల కోట్ల విలువైన 5 విమానవాహక నౌకలను అందించడానికి టెండర్లను పిలిచేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బందికి రూ. 7 వేల కోట్ల వ్యయంతో 32 అత్యాధునిక తేలికపాటి ధ్రువ్ హెలికాఫ్టర్లను అందించే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఇందులో 16 హెలికాఫ్టర్లను హెచ్ఏఎల్ సప్లై చేస్తుంది. రూ. 2,360 కోట్ల వ్యయంతో ఐదు గస్తీ నౌకలులు, తీర ప్రాంత గస్తీ నౌకలను కోస్ట్ గార్డ్‌కు అందించే ప్రతిపాదనకు ఆమోదించింది. త్రివిధ దళాలకు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ల పరికరాల కొనుగోలుకు ఉద్దేశించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టుకూ గ్రీన్‌సిగ్నల్ లభించింది. స్కార్పీన్ సబ్మెరైన్ల డెలివరీకి సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.