రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని | PM Modi goes on cleanliness drive in Varanasi, rules out privatisation of Railways | Sakshi
Sakshi News home page

రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని

Published Fri, Dec 26 2014 12:33 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని - Sakshi

రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని

* రైల్వే రంగంలో విదేశీ పెట్టుబడులపై అపోహలొద్దని హితవు
* ప్రపంచానికి నిపుణులైన టీచర్ల అవసరం ఉందని వ్యాఖ్య


రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు.  రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో నిపుణులైన ఉద్యోగుల కోసం 4 రైల్వే యూనివర్సిటీలను ప్రారంభించనున్నామన్నారు.
 
సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని.. ప్రపంచ దేశాల అవసరాలు తీరేలా నిపుణులైన ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వేశ్వరాలయం పక్కనున్న ఇరుకైన వీధిని శుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ‘స్వచ్ఛభారత్’కు మరికొందరిని నామినేట్ చేశారు.


వారణాసి: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించాలనే కోరిక కానీ, ఆ ఆలోచన కానీ తమ ప్రభుత్వానికి లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఆ విషయంలో అనవసర భయాలేమీ పెట్టుకోవద్దని సూచించారు. దేశంలో, విదేశాల్లో ఉన్న వ్యాపార సంస్థల వద్ద భారీ ఎత్తున ఉన్న పెట్టుబడులను రైల్వేల ఆధునీకరణకు ఉపయోగించడంపై అర్థం లేని అపోహలు పెట్టుకోవద్దన్నారు. సాధారణ ప్రయాణికులపై మరింత భారం వేయకుండా, వారికి మెరుగైన సేవలందించేందుకు, మౌలిక వసతుల కల్పనకు ఆ పెట్టుబడులను వినియోగిస్తామన్నారు.

ఆ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడతాయన్నారు. కొన్ని విభాగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల అంతిమంగా మన దేశమే లబ్ధి పొందుతుందన్నారు. రైల్వేల్లో సాంకేతికాభివృద్ధి, మానవవనరుల సమర్థ నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 4 రైల్వే విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వారణాసి శివార్లలో ఉన్న డీజిల్ లోకోమోటివ్ వర్క్స్(డీఎల్‌డబ్ల్యూ) కర్మాగార విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు.  అలాగే, అక్కడి 4500 హెచ్‌పీ ఏసీ ప్యాసెంజర్ రైలింజన్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లో తాను టీ అమ్మిననాటి రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘రైల్వేలతో ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకునేదానికన్నా ఎక్కువ అనుబంధం నాకుంది.

రైల్వేలను ప్రైవేటీకరించబోతున్నారని ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. మేం ఆ దిశగా వెళ్లడం లేదు. రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదు. కార్మికులు భయపడొద్దు’ అని విస్పష్టంగా ప్రకటించారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా, 100% దేశీయ యంత్రాల రూపకల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో రైల్వేలను అనుసంధానించే ప్రణాళిక గురించి మోదీ వివరించారు.
 
మళ్లీ చీపురు పట్టారు...: వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న అస్సి ఘాట్‌కు వెళ్లి అక్కడి పరిశుభ్రతపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వయంగా చీపురు పట్టి విశ్వేశ్వరాలయం పక్కనున్న విశ్వనాథ్ వీధిని శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ, మాజీ క్రికెటర్ గంగూలీ, స్టార్ కమెడియన్ కపిల్‌శర్మ, నృత్యకారిణి సొనాల్ మాన్‌సింగ్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఇండియాటుడే గ్రూప్‌కు చెందిన అరుణ్ పూరీ తదితరులను స్వచ్ఛభారత్‌కు నామినేట్ చేశారు. ఢిల్లీ వెళ్లే ముందు గుజరాత్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్, ఇతరులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
 
నిపుణులైన ఉపాధ్యాయులు రావాలి

నిపుణులైన ఉపాధ్యాయుల కోసం ప్రపంచ దేశాలన్నీ భారీ అంచనాలతో భారత్ వైపు చూస్తున్నాయని మోదీ అన్నారు. గురువారం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో ఆయన సుపరిపాలన ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత.. బోధనపై ఆసక్తి ఉన్న వారికోసం ఐదేళ్ల కాలపరిమితితో ఉపాధ్యాయ శిక్షణ కోర్సును ప్రారంభించాలని మోదీ సూచించారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన ఉన్న అత్యున్నత నైపుణ్యం కలిగిన టీచర్లను లక్షల సంఖ్యలో ప్రపంచానికి అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. వేరే రంగాల్లో ఉద్యోగావకాశం రానివారే బోధన రంగంలోకి వస్తున్నారని, ఆ ధోరణి మారాలన్నా రు. భ్రూణ హత్యలను మించిన మహాపాపం మరోటి లేదని, దీన్ని అరికట్టేలా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు సాంస్కృతిక, కళా రంగాలకు చెందినవారు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ వ్యవస్థాపకుడు, భారతరత్న పురస్కార గ్రహీత మదన్‌మోహన్ మాలవీయ పేరుతో ఒక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement