railway sector
-
రైల్ షేర్ల పరుగు– మార్కెట్ ఫ్లాట్
ముంబై: గత వారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 76,457 వద్ద నిలవగా.. 6 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 23,265 వద్ద స్థిరపడింది. అయితే ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగసి 76,861కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు బలపడి 23,389ను అధిగమించింది.ఒక దశలో సెన్సెక్స్ 76,297, నిఫ్టీ 23,207 పాయింట్ల దిగువన కనిష్టాలను తాకాయి. ఎన్ఎస్ఈలో మీడియా, ఆయిల్, రియల్టీ 2–1 శాతం మధ్య వృద్ధి చూపగా.. హెల్త్‌కేర్ 0.5 శాతం తగ్గింది. బ్లూచిప్స్‌లో ఓఎన్జీసీ 5.7 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, మారుతీ, అల్ట్రాటెక్ 2–1 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క కొటక్ బ్యాంక్, దివీస్, ఐటీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1.3–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. చిన్న షేర్లు అప్ అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా కొనసాగనుండటంతో రైల్వే రంగ కౌంటర్లు స్పీడందుకున్నాయి. ఎన్ఎస్ఈలో రైల్‌టెల్ 9%, ఇర్కాన్ 8%, టెక్స్మాకో 7 శాతం, జూపిటర్ వేగన్స్ 6%, ఐఆర్సీటీసీ, ఆర్వీఎన్ఎల్ 4 శాతం, ఐఆర్ఎఫ్సీ 2 శాతం చొప్పున ఎగశాయి. అయితే కెర్నెక్స్ మైక్రో 4.2 శాతం పతనమైంది. కాగా. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం బలపడ్డాయి. కొత్త కనిష్టానికి రూపాయి @ 83.59దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నీరసించి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు జారింది. అక్కడే స్థిరపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటానికితోడు.. చమురు ధరలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది. -
రైల్ షేర్ల పరుగు కొనసాగేనా?
ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రైల్వే స్టాక్స్‌లో కొనసాగుతున్న బుల్ రన్‌కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్ షేర్లలో సంస్థాగత ఇ న్వెస్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్ వెలువడిన తదుపరి రైల్ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు. లాభాల పరుగు రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, రైట్స్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ, టిటాగఢ్ వేగన్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్ ఈల్డ్ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్ రంగ స్టాక్స్‌లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు. 38 శాతంతో జోష్ గత బడ్జెట్(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి. -
రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి
ప్రభుత్వానికి వివేక్ దేబ్రాయ్ కమిటీ తుది నివేదిక ♦ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి ♦ ఆర్థికాంశాలను ఈ అథారిటీయే పర్యవేక్షించాలి ♦ స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి ♦ ఈ సిఫారసులు అమలు చేస్తే రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అక్కర్లేదు న్యూఢిల్లీ: రైల్వే రంగంలోకి ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైల్వేలో ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ(రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-రాయ్) ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణ నుంచి రైల్వే విభాగం తప్పుకోవాలని పేర్కొంది. నష్టాల నివారణకు అధికారాల వికేంద్రీకరణే మార్గమని స్పష్టంచేసింది. వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం రైల్వే బోర్డుకు ఈ మేరకు 300 పేజీలతో కూడిన తుది నివేదికను సమర్పించింది. గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. మార్చిలో మధ్యంతర నివేదిక సమర్పించిన ఈ కమిటీ తాజాగా తుది నివేదికను అందజేసింది. తమ సిఫారసులను అమలు చేస్తే ఐదేళ్లలో రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉండదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘‘వాటాలు ఎక్కడికక్కడ విక్రయించి రైల్వే శాఖను ప్రైవేటీకరించాలని మేం చెప్పడం లేదు. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ద్వారా ప్రైవేటు సంస్థలకు కూడా రైల్వేలోకి ప్రవేశం కల్పించాలని సూచిస్తున్నాం. రోడ్లు, పౌర విమానయానం, టెలికం రంగాలతో పోల్చుకుంటే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం తక్కువగా ఉంది. విధానపర నిర్ణయాలు, నిర్వహణ, నియంత్రణ తదితరాలన్నీ రైల్వే పరిధిలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం’’ అని కమిటీ పేర్కొంది. ఇతర సంస్థల భాగస్వామ్యం కూడా పెంచేందుకు ట్రాక్‌ల నిర్మాణం, రైళ్ల నిర్వహణ, రైళ్ల విడిభాగాల తయారీ యూనిట్లను విడదీయాలని సూచించింది. ‘‘రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలన్నది ప్రభుత్వ విధానపర నిర్ణయం. మేం దాన్ని ఆమోదించాం. అంతే తప్ప ఇది కొత్త సిఫారసు కాదు. తుది నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. ఈయన నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కమిటీ సిఫారసులు ఇవీ.. ⇒ ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించేందుకు వీలుగా భారత రైల్వే నియంత్రణ అథారిటీ (ఆర్ఆర్ఏఐ-రాయ్) ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉండాలి. ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. ⇒ ఆర్థిక అంశాలు, చార్జీల పెరుగుదల, రైల్వేల భద్రత, సేవల నాణ్యత, లెసైన్సులు, పరిహారం పెంపు, వివాదాల పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిని తదితరాలను రాయ్ పర్యవేక్షించాలి ⇒ నష్టాలను నివారించాలంటే అధికారాలను తక్షణమే వికేంద్రీకరించాలి. ప్రస్తుతం ఈ అధికారాల వికేంద్రీకరణ పాక్షికంగానే ఉంది. ఇది పూర్తిస్థాయిలో జరగాలి ⇒ రైల్వేను ఆర్థికంగా పరిపుష్టంగా మార్చేందుకు అంతర్గత వనరులతోపాటు ఇతర మార్గాలను అన్వేషించాలి ⇒ రైళ్లను నడపడం వరకే రైల్వే విభాగం పరిమితం కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి. కేటరింగ్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, లోకోమోటివ్ బోగీలు, వ్యాగన్ల తయారీ వంటివాటిని దేనికదే స్వతంత్ర విభాగాలుగా చేయాలి. ⇒ రైల్వే భద్రతా దళాన్ని(జీఆర్పీ) రైల్వే నుంచి పూర్తిగా విడదీసి రాష్ట్రాల చేతుల్లో పెట్టాలి. జీఆర్పీ నిధుల భారాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి. రైళ్లలో భద్రత కోసం ఆర్పీఎఫ్ లేదా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను ఎంచుకునే స్వేచ్ఛను జనరల్ మేనేజర్లకు కట్టబెట్టాలి. ⇒ తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చేందుకు వీలుగా రైల్వే సిబ్బందికి సబ్సిడీ అందించాలి. అలాగే రైల్వే ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలి ⇒ కమిటీ సిఫారసులను ఐదేళ్లపాటు తు.చ. తప్పకుండా అమలు చేస్తే రైల్వేకు ఇక ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. మన రైల్వే.. 4 భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. తొలి మూడు స్థానాల్లో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి 7 ప్రపంచంలో పెద్ద సంఖ్య (దాదాపు 15 లక్షల మంది)లో ఉద్యోగులున్న సంస్థల్లో మన రైల్వేది ఏడో స్థానం 1,14,500 కి.మీ. దేశంలోని రైల్వే మార్గాల పొడవు 2.1 కోట్లు రైల్వేల ద్వారా దేశంలో ప్రతిరోజూ ప్రయాణించేవారి సంఖ్య 8 వేలు దేశంలోని రైల్వే స్టేషన్ల సంఖ్య (సుమారుగా) 11 వేలు రోజూ రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య ఎటువైపు ఈ అడుగులు? 2014, ఆగస్టు 6 రైల్వే మౌలిక వసతుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ ట్రెయిన్ల వంటి భారీ ప్రాజెక్టుల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని, రైల్వేశాఖ ఆధునిక పట్టాలెక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైల్వే సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. 2014, నవంబర్ 29 ‘మన దేశంలో రైల్వే స్టేషన్లు వందేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరిస్తేనే వీటి పరిస్థితి మారుతుంది. అదనంగా ఒక కోచ్ తగిలించో, ఒక స్టేషన్‌ను ఆధునీకరించో చేతులు దులుపుకోం. రైల్వేలను పూర్తిగా అభివృద్ధి పట్టాలెక్కిస్తాం’’ - మేఘాలయలో మెందీపత్తర్- గువాహటి ప్యాసింజర్ రైలు ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 2014, డిసెంబర్ 25 ‘రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. అయితే దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊపు ఇచ్చే విధంగా రైల్వేలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఇతోధికంగా పెంచుతాం’ - వారణాసిలో డీజిల్ లోకోమోటివ్ పనుల విస్తరణ కార్యక్రమంలో మోదీ 2015, జూన్ 12 రైల్వేలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని, ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దేబ్రాయ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇన్నాళ్లుగా రైల్వే సిబ్బందికి చేదోడువాదోడుగా నిలుస్తున్న రైల్వే ఆసుపత్రులు, స్కూళ్లను వదిలించుకోవాలని సూచించింది. రైల్వే సంఘాల మండిపాటు.. 30న బ్లాక్‌డే దేబ్రాయ్ కమిటీ నివేదికపై రైల్వే సంఘాలు మండిపడ్డాయి. సిఫారసులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తామన్నాయి. కమిటీ ప్రైవేటీకరణకు దారులు పరిచింది. ప్రభుత్వం కమిటీ నివేదికను అంగీకరించదని భావిస్తున్నాం. నివేదిక దేశంలో జనరల్, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే 95 శాతం రైలు ప్రయాణికులకు వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తాం’’అని అఖిల భారత రైల్వే సమాఖ్య నేత శివ గోపాల్ మిశ్రా తెలిపారు. కాగా, ముందుగా రైల్వేశాఖ ఆ నివేదికను పరిశీలిస్తుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని
* రైల్వే రంగంలో విదేశీ పెట్టుబడులపై అపోహలొద్దని హితవు * ప్రపంచానికి నిపుణులైన టీచర్ల అవసరం ఉందని వ్యాఖ్య రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో నిపుణులైన ఉద్యోగుల కోసం 4 రైల్వే యూనివర్సిటీలను ప్రారంభించనున్నామన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని.. ప్రపంచ దేశాల అవసరాలు తీరేలా నిపుణులైన ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వేశ్వరాలయం పక్కనున్న ఇరుకైన వీధిని శుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ‘స్వచ్ఛభారత్’కు మరికొందరిని నామినేట్ చేశారు. వారణాసి: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించాలనే కోరిక కానీ, ఆ ఆలోచన కానీ తమ ప్రభుత్వానికి లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఆ విషయంలో అనవసర భయాలేమీ పెట్టుకోవద్దని సూచించారు. దేశంలో, విదేశాల్లో ఉన్న వ్యాపార సంస్థల వద్ద భారీ ఎత్తున ఉన్న పెట్టుబడులను రైల్వేల ఆధునీకరణకు ఉపయోగించడంపై అర్థం లేని అపోహలు పెట్టుకోవద్దన్నారు. సాధారణ ప్రయాణికులపై మరింత భారం వేయకుండా, వారికి మెరుగైన సేవలందించేందుకు, మౌలిక వసతుల కల్పనకు ఆ పెట్టుబడులను వినియోగిస్తామన్నారు. ఆ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడతాయన్నారు. కొన్ని విభాగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల అంతిమంగా మన దేశమే లబ్ధి పొందుతుందన్నారు. రైల్వేల్లో సాంకేతికాభివృద్ధి, మానవవనరుల సమర్థ నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 4 రైల్వే విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారణాసి శివార్లలో ఉన్న డీజిల్ లోకోమోటివ్ వర్క్స్(డీఎల్‌డబ్ల్యూ) కర్మాగార విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే, అక్కడి 4500 హెచ్‌పీ ఏసీ ప్యాసెంజర్ రైలింజన్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లో తాను టీ అమ్మిననాటి రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘రైల్వేలతో ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకునేదానికన్నా ఎక్కువ అనుబంధం నాకుంది. రైల్వేలను ప్రైవేటీకరించబోతున్నారని ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. మేం ఆ దిశగా వెళ్లడం లేదు. రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదు. కార్మికులు భయపడొద్దు’ అని విస్పష్టంగా ప్రకటించారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా, 100% దేశీయ యంత్రాల రూపకల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో రైల్వేలను అనుసంధానించే ప్రణాళిక గురించి మోదీ వివరించారు. మళ్లీ చీపురు పట్టారు...: వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న అస్సి ఘాట్‌కు వెళ్లి అక్కడి పరిశుభ్రతపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వయంగా చీపురు పట్టి విశ్వేశ్వరాలయం పక్కనున్న విశ్వనాథ్ వీధిని శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ, మాజీ క్రికెటర్ గంగూలీ, స్టార్ కమెడియన్ కపిల్‌శర్మ, నృత్యకారిణి సొనాల్ మాన్సింగ్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఇండియాటుడే గ్రూప్‌కు చెందిన అరుణ్ పూరీ తదితరులను స్వచ్ఛభారత్‌కు నామినేట్ చేశారు. ఢిల్లీ వెళ్లే ముందు గుజరాత్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్, ఇతరులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. నిపుణులైన ఉపాధ్యాయులు రావాలి నిపుణులైన ఉపాధ్యాయుల కోసం ప్రపంచ దేశాలన్నీ భారీ అంచనాలతో భారత్ వైపు చూస్తున్నాయని మోదీ అన్నారు. గురువారం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో ఆయన సుపరిపాలన ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత.. బోధనపై ఆసక్తి ఉన్న వారికోసం ఐదేళ్ల కాలపరిమితితో ఉపాధ్యాయ శిక్షణ కోర్సును ప్రారంభించాలని మోదీ సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన ఉన్న అత్యున్నత నైపుణ్యం కలిగిన టీచర్లను లక్షల సంఖ్యలో ప్రపంచానికి అందించాలనే లక్ష్యం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. వేరే రంగాల్లో ఉద్యోగావకాశం రానివారే బోధన రంగంలోకి వస్తున్నారని, ఆ ధోరణి మారాలన్నా రు. భ్రూణ హత్యలను మించిన మహాపాపం మరోటి లేదని, దీన్ని అరికట్టేలా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు సాంస్కృతిక, కళా రంగాలకు చెందినవారు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ వ్యవస్థాపకుడు, భారతరత్న పురస్కార గ్రహీత మదన్మోహన్ మాలవీయ పేరుతో ఒక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.