రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి | In final report, Bibek Debroy panel goes slow on Railway unbundling | Sakshi
Sakshi News home page

రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి

Published Sat, Jun 13 2015 6:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి

రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి

ప్రభుత్వానికి వివేక్ దేబ్రాయ్ కమిటీ తుది నివేదిక
♦  స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
♦  ఆర్థికాంశాలను ఈ అథారిటీయే పర్యవేక్షించాలి
♦  స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి
♦  ఈ సిఫారసులు అమలు చేస్తే రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అక్కర్లేదు

న్యూఢిల్లీ: రైల్వే రంగంలోకి ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

రైల్వేలో ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ(రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-రాయ్) ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణ నుంచి రైల్వే విభాగం తప్పుకోవాలని పేర్కొంది. నష్టాల నివారణకు అధికారాల వికేంద్రీకరణే మార్గమని స్పష్టంచేసింది. వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం రైల్వే బోర్డుకు ఈ మేరకు 300 పేజీలతో కూడిన తుది నివేదికను సమర్పించింది. గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. మార్చిలో మధ్యంతర నివేదిక సమర్పించిన ఈ కమిటీ తాజాగా తుది నివేదికను అందజేసింది. తమ సిఫారసులను అమలు చేస్తే ఐదేళ్లలో రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉండదని ఆ నివేదికలో పేర్కొన్నారు.

‘‘వాటాలు ఎక్కడికక్కడ విక్రయించి రైల్వే శాఖను ప్రైవేటీకరించాలని మేం చెప్పడం లేదు. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ద్వారా ప్రైవేటు సంస్థలకు కూడా రైల్వేలోకి ప్రవేశం కల్పించాలని సూచిస్తున్నాం. రోడ్లు, పౌర విమానయానం, టెలికం రంగాలతో పోల్చుకుంటే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం తక్కువగా ఉంది. విధానపర నిర్ణయాలు, నిర్వహణ, నియంత్రణ తదితరాలన్నీ రైల్వే పరిధిలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం’’ అని కమిటీ పేర్కొంది.

ఇతర సంస్థల భాగస్వామ్యం కూడా పెంచేందుకు ట్రాక్‌ల నిర్మాణం, రైళ్ల నిర్వహణ, రైళ్ల విడిభాగాల తయారీ యూనిట్లను విడదీయాలని సూచించింది. ‘‘రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలన్నది ప్రభుత్వ విధానపర నిర్ణయం. మేం దాన్ని ఆమోదించాం. అంతే తప్ప ఇది కొత్త సిఫారసు కాదు. తుది నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. ఈయన నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.
 
కమిటీ సిఫారసులు ఇవీ..
 ⇒  ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించేందుకు వీలుగా భారత రైల్వే నియంత్రణ అథారిటీ (ఆర్‌ఆర్‌ఏఐ-రాయ్) ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉండాలి. ప్రత్యేక బడ్జెట్ ఉండాలి.
 ⇒  ఆర్థిక అంశాలు, చార్జీల పెరుగుదల, రైల్వేల భద్రత, సేవల నాణ్యత, లెసైన్సులు, పరిహారం పెంపు, వివాదాల పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిని తదితరాలను రాయ్ పర్యవేక్షించాలి
 ⇒ నష్టాలను నివారించాలంటే అధికారాలను తక్షణమే వికేంద్రీకరించాలి. ప్రస్తుతం ఈ అధికారాల వికేంద్రీకరణ పాక్షికంగానే ఉంది. ఇది పూర్తిస్థాయిలో జరగాలి
 ⇒ రైల్వేను ఆర్థికంగా పరిపుష్టంగా మార్చేందుకు అంతర్గత వనరులతోపాటు ఇతర మార్గాలను అన్వేషించాలి
 ⇒ రైళ్లను నడపడం వరకే రైల్వే విభాగం పరిమితం కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి. కేటరింగ్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, లోకోమోటివ్ బోగీలు, వ్యాగన్ల తయారీ వంటివాటిని దేనికదే స్వతంత్ర విభాగాలుగా చేయాలి.
 ⇒ రైల్వే భద్రతా దళాన్ని(జీఆర్‌పీ) రైల్వే నుంచి పూర్తిగా విడదీసి రాష్ట్రాల చేతుల్లో పెట్టాలి. జీఆర్‌పీ నిధుల భారాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి. రైళ్లలో భద్రత కోసం ఆర్‌పీఎఫ్ లేదా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను ఎంచుకునే స్వేచ్ఛను జనరల్ మేనేజర్లకు కట్టబెట్టాలి.
 ⇒ తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చేందుకు వీలుగా రైల్వే సిబ్బందికి సబ్సిడీ అందించాలి. అలాగే రైల్వే ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలి
 ⇒ కమిటీ సిఫారసులను ఐదేళ్లపాటు తు.చ. తప్పకుండా అమలు చేస్తే రైల్వేకు ఇక ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు.
 
మన రైల్వే..
4
భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. తొలి మూడు స్థానాల్లో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి
 
 7
ప్రపంచంలో పెద్ద సంఖ్య (దాదాపు 15 లక్షల మంది)లో ఉద్యోగులున్న సంస్థల్లో మన రైల్వేది ఏడో స్థానం
 
1,14,500 కి.మీ.
దేశంలోని రైల్వే మార్గాల పొడవు
 
2.1 కోట్లు
రైల్వేల ద్వారా దేశంలో ప్రతిరోజూ ప్రయాణించేవారి సంఖ్య
 
8 వేలు
దేశంలోని రైల్వే స్టేషన్ల సంఖ్య (సుమారుగా)
 
11 వేలు
రోజూ రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య
 
ఎటువైపు ఈ అడుగులు?
 
2014, ఆగస్టు 6
 రైల్వే మౌలిక వసతుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ ట్రెయిన్ల వంటి భారీ ప్రాజెక్టుల్లో  విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని, రైల్వేశాఖ ఆధునిక పట్టాలెక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైల్వే సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి.
 
2014, నవంబర్ 29
‘మన దేశంలో రైల్వే స్టేషన్లు వందేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరిస్తేనే వీటి పరిస్థితి మారుతుంది. అదనంగా ఒక కోచ్ తగిలించో, ఒక స్టేషన్‌ను ఆధునీకరించో చేతులు దులుపుకోం. రైల్వేలను పూర్తిగా అభివృద్ధి పట్టాలెక్కిస్తాం’’
 - మేఘాలయలో మెందీపత్తర్- గువాహటి ప్యాసింజర్ రైలు ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
 
2014, డిసెంబర్ 25
‘రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. అయితే దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊపు ఇచ్చే విధంగా రైల్వేలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఇతోధికంగా పెంచుతాం’
 - వారణాసిలో డీజిల్ లోకోమోటివ్ పనుల విస్తరణ కార్యక్రమంలో మోదీ
 
2015, జూన్ 12
రైల్వేలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని, ఒక  స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దేబ్రాయ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇన్నాళ్లుగా  రైల్వే సిబ్బందికి చేదోడువాదోడుగా నిలుస్తున్న రైల్వే ఆసుపత్రులు, స్కూళ్లను వదిలించుకోవాలని సూచించింది.
 
రైల్వే సంఘాల మండిపాటు.. 30న బ్లాక్‌డే
దేబ్రాయ్ కమిటీ నివేదికపై రైల్వే సంఘాలు మండిపడ్డాయి.  సిఫారసులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తామన్నాయి. కమిటీ ప్రైవేటీకరణకు దారులు పరిచింది. ప్రభుత్వం కమిటీ నివేదికను అంగీకరించదని భావిస్తున్నాం. నివేదిక దేశంలో జనరల్, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే 95 శాతం రైలు ప్రయాణికులకు  వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తాం’’అని అఖిల భారత రైల్వే సమాఖ్య  నేత  శివ గోపాల్ మిశ్రా తెలిపారు. కాగా,  ముందుగా రైల్వేశాఖ ఆ నివేదికను పరిశీలిస్తుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement