సెన్సెక్స్ 33 పాయింట్లు డౌన్
నిఫ్టీ 6 పాయింట్లు ప్లస్
76,457– 23,265 వద్ద ముగింపు
ముంబై: గత వారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 76,457 వద్ద నిలవగా.. 6 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 23,265 వద్ద స్థిరపడింది. అయితే ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగసి 76,861కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు బలపడి 23,389ను అధిగమించింది.
ఒక దశలో సెన్సెక్స్ 76,297, నిఫ్టీ 23,207 పాయింట్ల దిగువన కనిష్టాలను తాకాయి. ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఆయిల్, రియల్టీ 2–1 శాతం మధ్య వృద్ధి చూపగా.. హెల్త్‌కేర్ 0.5 శాతం తగ్గింది. బ్లూచిప్స్‌లో ఓఎన్‌జీసీ 5.7 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, మారుతీ, అల్ట్రాటెక్ 2–1 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క కొటక్ బ్యాంక్, దివీస్, ఐటీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1.3–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి.
చిన్న షేర్లు అప్
అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా కొనసాగనుండటంతో రైల్వే రంగ కౌంటర్లు స్పీడందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రైల్‌టెల్ 9%, ఇర్కాన్ 8%, టెక్స్‌మాకో 7 శాతం, జూపిటర్ వేగన్స్ 6%, ఐఆర్‌సీటీసీ, ఆర్‌వీఎన్‌ఎల్ 4 శాతం, ఐఆర్‌ఎఫ్‌సీ 2 శాతం చొప్పున ఎగశాయి. అయితే కెర్నెక్స్ మైక్రో 4.2 శాతం పతనమైంది. కాగా. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం బలపడ్డాయి.
కొత్త కనిష్టానికి రూపాయి @ 83.59
దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నీరసించి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు జారింది. అక్కడే స్థిరపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటానికితోడు.. చమురు ధరలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment