ప్రైవేటు పెట్టుబడులు... గ్రామీణ డిమాండ్ కీలకం
భారత్ వృద్ధిపై ఏడీబీ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కీలక అంశాలని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబీ) విశ్లేషించింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో వృద్ధికి ఈ అంశాలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై ఈ మేరకు మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు...
♦ వృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు, పట్టణ వినియోగం (డిమాండ్) కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి పటిష్టతకు ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కూడా పటిష్ట పడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో- దేశీయ డిమాండ్ అన్ని స్థాయిల్లో పటిష్ట పడాలి.
♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధిరేటు అంచనా 7.4 శాతం. బలహీన గ్లోబల్ డిమాండ్, ఎగుమతులు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గడానికి కారణం.
♦ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెరుగుదల వల్ల పట్టణ వినియోగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో గ్రామీణ వినియోగ డిమాండ్ పటిష్టతపై సందేహాలు నెలకొన్నాయి.