Indias growth
-
భారత్ వృద్ధి తీరు బాగుంటుంది..!
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు బాగుందని ప్రపంచబ్యాంక్ అంచనావేస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్ తన ద్వైవార్షిక పబ్లికేషన్‌లో పేర్కొన్న కీలక అంచనాలను చూస్తే... వచే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్–2018 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుంది. 2019–20లో ఈ రేటు 7.5 శాతం. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్ 8 శాతం వృద్ధి నమోదుచేయడానికి మరిన్ని చర్యలు అవసరం. సంస్కరణల కొనసాగింపు, వాటి విస్తృతి ఇక్కడ కీలకం. అలాగే రుణం, పెట్టుబడుల సంబంధ సమస్యలు పరిష్కారం కావాలి. అలాగే భారత్ ఆర్థిక వ్యవస్థ మొత్తం క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. డీమోనిటైజేషన్, వస్తు, సేవల పన్ను ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది. దీనితో వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.4 శాతం!
యొకోహమా (జపాన్): భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ –2018 మార్చి) 7.4 శాతం వృద్ధి చెందుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) బుధవారం పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు 7.6 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), దివాలా పన్ను దేశంలో వ్యాపార సానుకూల వాతావరణ సృష్టికి దోహదపడతాయని విశ్లేషించింది. ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరవుతున్న ఏడీబీ 50వ వార్షిక సమావేశం (మే 4 నుంచి 7వ తేదీ వరకూ) నేపథ్యంలో– సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సావదా మాట్లాడుతూ, భారత్‌లో సంస్కరణల అమలు తీరును ప్రశంసించారు. యసుయుకి అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... నా వంటి ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను పరిశీలనలోకి తీసుకుంటే భారత్ 7%పైగా వృద్ధి సాధిస్తోంది. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగే వీలుంది. భారత్ వాణిజ్యం మెరుగుపడ్డం ఇక్కడ మరో ముఖ్యాంశం. డీమోనిటైజేషన్ కారణంగా నగదు ఆధారిత లావాదేవీలు, వినియోగదారుని సెంటిమెంట్ దెబ్బతింది. అయితే అటు తర్వాత ఇప్పటివరకూ పరిస్థితిని గమనిస్తే, డీమోనిటైజేషన్ ప్రతికూలత స్వల్పకాలికమేనని తేలిపోయింది. అయితే నల్లధనంపై డీమోనిటైజేషన్ ప్రభావం ఎంతుందన్నది మాత్రం అధ్యయనం చేయలేదు. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం కావడం వల్ల– వాణిజ్య సంబంధ అంశాల్లో భారత్ అంతర్జాతీయంగా పోటీ తత్వాన్ని కోల్పోతుందని మీరు భావిస్తున్నారు. కేవలం రూపాయి బలోపేతమే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపదు. ఎగుమతి ధర, ఇతర దేశాలకు సంబంధించి ఆ ధరలో సామీప్యత వంటి ఎన్నో అంశాలు ఇక్కడ ఇమిడి ఉంటాయి. భారత్ ఎగుమతులు ఇప్పుడు సానుకూల ఫలితాలనే నమోదుచేస్తుండడం గమనార్హం (అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ జనవరి నుంచి 5 శాతం ఎగబాకింది). ఏడీబీ సమావేశాలకు జైట్లీ పర్యటన రద్దు! ఇదిలావుండగా, ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకూ ఇక్కడ జరుగనున్న ఏడీబీ వార్షిక సమావేశాలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హాజరుకావడం లేదు. జైట్లీ బదులుగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ హాజరుకానున్నారు. రక్షణ మంత్రిత్వశాఖకు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ పర్యటన రద్దయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందుకు కారణాలను మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదు. భారత్–పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే తాజా పరిణామానికి కారణమన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. కాగా జపాన్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ వారాంతంలో జరగనున్న జైట్లీ టోక్యో పర్యటన షెడ్యూల్లో ఎటువంటి మార్పులేదు. మే 6న ఆయన టోక్యోకు విచ్చేస్తారు. జపాన్ నాయకులతోపాటు ఆ దేశ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. -
2017లో వృద్ధి 7.2 శాతమే!
♦ అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్ ♦ ఇంతక్రితం 7.6 శాతం ♦ డీమోనిటైజేషన్ కారణమని ప్రకటన వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తగ్గించింది. ఇంతక్రితం 7.6 శాతంగా ఉన్న అంచనాలను 7.2 శాతానికి కుదించింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులు ఇందుకు కారణమని వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగ విభాగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. పలు రంగాల విషయంలో నగదు కొరత, మార్పిడి విషయాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని తన తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక విశ్లేషణ (డబ్ల్యఈఓ)లో పేర్కొంది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక వేసవికాల సమావేశం ప్రారంభానికి ముందు ఈ ఔట్లుక్ విడుదలైంది. విశ్లేషణా అంశాలను మరిన్ని చూస్తే... మధ్యంతర కాలానికి సంబంధించి చూస్తే– వృద్ధి అంచనాలు బాగున్నాయి. వృద్ధి ఎనిమిది శాతానికి పెరగవచ్చు. కీలక సంస్కరణల అమలు, సరఫరాల వైపు సమస్యల పరిష్కారం, తగిన ద్రవ్య, పరపతి విధానాలు దీనికి దోహదం చేసే అంశాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18 ఏప్రిల్–మార్చి) దేశ జీడీపీ వృద్ధి రేటును కేంద్రం 7.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పలు సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి పటిష్ట స్థితిలో ఉండడానికి కారణాలు చూస్తే– కీలక వ్యవస్థాగత సంస్కరణల అమలు, అంతర్జాతీయ వాణిజ్య సానుకూలత, విదేశీ మారక ద్రవ్య అంశాలకు సంబంధించి తక్కువస్థాయిలోనే ఒడిదుడుకులు కొనసాగుతుండడం కీలకమైనవి. డీమోనిటైజేషన్ వల్ల ఎదురయిన సమస్యలు సర్దుమణగిన అనంతరం తక్షణం భారత్ ఆర్థిక వ్యవస్థ దృష్టి సారించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. కార్మిక చట్టాల సంస్కరణలు, తయారీ బేస్ విస్తరణ, వ్యాపారానికి సానుకూల అవకాశాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, వ్యవసాయ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం, వాటికి తగిన మూలధన కల్పన, సబ్సిడీల హేతుబద్ధీకరణ, పన్ను సంస్కరణలు, జీఎస్టీ అమలు వంటివి వృద్ధికి బాటలువేస్తాయి. ప్రపంచ వృద్ధి రేటు 3.5% ఇదిలావుండగా, 2016లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2017లో 3.5 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2018లో 3.6 శాతానికి చేరుతుందనీ అంచనావేసింది. ఇక చైనా వృద్ధి రేటు 2017లో 6.6 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్, ఇది 2018లో 6.2 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు, సరఫరాలపై ఒపెక్ దేశాల అంగీకృత నియంత్రణలు వెరసి చమురు ధరలు 2016 మొదట్లోకన్నా ప్రస్తుతం మెరుగుపడ్డానికి కారణాలని ఐఎంఎఫ్ వివరించింది. ఇక అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ– వేగవంతంగా వడ్డీరేటు పెంచితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కఠినమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఆర్థికవృద్ధి పుంజుకుంటోందని, భవిష్యత్ డిమాండ్‌పై విశ్వాసం మరింత పెంపొందుతోందని నివేదిక తెలిపింది. బ్రిటన్‌లోనే దాదాపు ఇదే సానుకూలత ఉందని పేర్కొంది. -
భారత వృద్ధి అవకాశాలు పటిష్టం
⇒ అధిక వ్యాల్యుయేషన్స్‌తో స్వల్పకాలిక ఇన్వెస్టర్లకే సమస్య.. ⇒ దీర్ఘకాలిక ప్రాతిపదికన అంతగా పట్టించుకోనక్కర్లేదు ⇒ అబర్డీన్ అసెట్ మేనేజ్మెంట్ ఆసియా ఎండీ హ్యూ యంగ్ భారత మార్కెట్ వ్యాల్యుయేషన్స్ ఆసియాలోనే అత్యంత ఖరీదైనవిగా ఉండటం స్వల్పకాలిక ఇన్వెస్టర్లకు కాస్త ఆందోళన కలిగించేదే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రాతిపదికన దీన్ని అంతగా పట్టించుకోనక్కర్లేదని అబర్డీన్ అసెట్ మేనేజ్మెంట్ ఆసియా ఎండీ హ్యూ యంగ్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం చాలా ఖరీదైన స్టాక్స్‌గా కనిపిస్తున్నవి.. 5–10 ఏళ్ల తర్వాత సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు అనిపించవచ్చని తెలిపారు. అందుకే తమ సంస్థ వంటి ఫండమెంటల్‌గా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వీటి గురించి పెద్దగా పట్టించుకోకుండా భారత్‌లో పుష్కలంగా ఉన్న మంచి కంపెనీల షేర్లను సాధ్యమైనంత తక్కువ రేటులో దక్కించుకునేందుకు ప్రాధాన్యమిస్తారని ఆయన పేర్కొన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్య వివరాలు.... బలహీనంగా ఐసీఐసీఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్, ఐసీఐసీఐ బ్యాంకు... ఈ మూడూ తమ ఫండ్స్ మెచ్చిన షేర్లే అయినప్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల నుంచి కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం జరిగి ఉండొచ్చని యంగ్ చెప్పారు. ‘మిగతా రెండింటితో పోలిస్తే ఐసీఐసీఐ కాస్త బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. ఇక అమెరికాలో ఇమిగ్రేషన్ బిల్లుపరమైన అంశాల కారణంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ సంస్థలకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని, అయితే దీని గురించి మరీ అంతగా ఆందోళన చెందడం లేదని యంగ్ చెప్పారు. అందుకే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి స్టాక్స్‌లో తమ హోల్డింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవని తెలిపారు. కానీ పరిశ్రమ స్వరూపం మారిపోతుండటం కాస్త ఆందోళనకరంగా ఉంటోందని, పది.. ఇరవై ఏళ్ల క్రితం చూసినట్లుగా భారీ స్థాయి వృద్ధికి రోజులు చెల్లినట్లేనని ఆయన వివరించారు. టెలికంపై రిలయన్స్ జియో ప్రభావాలు.. టెలికం రంగం చాలా శక్తివంతమైనదైనప్పటికీ.. ఇందులో తమ ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా లేవని యంగ్ తెలిపారు. కొంత మేర భారతీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేశామని.. ఏడాది, రెండేళ్ల క్రితం ఇన్ఫ్రాటెల్లో వాటాలు కొంత పెంచుకున్నామని వివరించారు. రిలయన్స్ జియో నుంచి చార్జీలపరమైన పోటీతో ఈ రంగంలో ఒడిదుడుకులు తప్పేట్లు లేవని యంగ్ చెప్పారు. దీనితో టెల్కోల స్వల్ప కాలిక లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. మరోవైపు కన్జూమర్ స్టాక్స్‌కి సంబంధించి చాలా మటుకు సంస్థల ఎర్నింగ్స్ పర్ షేర్ ఎకాయెకిన ఎగియడం ఇంకా చూడలేదని యంగ్ చెప్పారు. యూనిలీవర్, ఐటీసీ వంటి సంస్థల పోర్ట్‌ఫోలియోలు పటిష్టంగానే ఉన్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో వృద్ధి గణాంకాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్నదంతా భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసమేనని చెప్పిన యంగ్... రాబోయే రోజుల్లో ఇది సాధ్యమేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు. మెటల్స్, చమురుపై అనాసక్తి.. సాధారణంగా పారిశ్రామిక మెటల్స్, చమురు రంగం మొదలైనవి సీజనల్ ధోరణులతో కూడుకున్నవి కనుక సాధారణంగా తాము వీటి జోలికి ఎక్కువగా వెళ్లమని యంగ్ తెలిపారు. ఈ కోవకి చెందిన వాటిల్లో కేవలం సిమెంట్ రంగంలో మాత్రమే కాస్త అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరగవచ్చన్న అంచనాలే ఇందుకు కారణమని యంగ్ వివరించారు. జీఎస్టీతో ప్రయోజనం వ్యాపారాల నిర్వహణ సులభతరంగా , సమర్ధవంతంగా ఉండేలా చూసేటువంటి సంస్కరణలకు మించి మరేమీ అవసరం లేదని యంగ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి రానుండటం ఆ దిశగా పురోగమన చర్యేనన్న యంగ్.. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. -
ఏప్రిల్ నుంచి భారత్ వృద్ధి రికవరీ!
మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ: భారత్ వృద్ధి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రికవరీ బాట పడుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఇందుకు వినియోగం, ఎగుమతులు దోహదపడతాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రస్తుత ప్రతికూల ప్రభావం స్వల్పకాలమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలోని ముఖ్యాంశాలు... ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో కనిపిస్తుంది. వృద్ధిపై దాదాపు 50 నుంచి 70 బేసిస్ పారుుంట్ల మేర (100 బేసిస్ పారుుంట్లు ఒక శాతం) ఈ ప్రభావం ఉంటుంది. ⇔ అరుుతే విసృ్తత ప్రాతిపదికన భారత్ వృద్ధికి ఢోకా లేదు. భారత్‌కు వృద్ధికి సంబంధించి మొత్తంమీద నిర్మాణాత్మక అవుట్‌లుక్‌ను మేము కొనసాగిస్తున్నాము. ⇔ స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే దాదాపు 60 శాతంగా ఉన్న వినియోగ రంగం వచ్చే ఏడాది జూన్ త్రైమాసికం నుంచీ బలపడే వీలుంది. దీనికితోడు పెరిగే ప్రభుత్వ వ్యయాలు, ఎఫ్‌డీఐల ప్రభావం ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే వీలుంది. -
భారత్ వృద్ధి బాట పటిష్టమే: ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు పటిష్టంగానే ఉన్నట్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్‌టుక్ (ఏడీఓ) 2016 నివేదిక పేర్కొంది. తగిన డిమాండ్, సంస్కరణలే భారత్ వృద్ధికి కీలకమని అధ్యయన నివేదిక వివరించింది. 2016లో దేశం 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. వ్యవస్థాగత సంస్కరణలు, పటిష్టంగా ఉన్న వినియోగ డిమాండ్, తగిన వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయ గణాంకాల వృద్ధికి అవకాశాలు వంటివి భారత్ పటిష్ట వృద్ధి బాట అంచనాలకు కారణంగా వివరించింది. -
భారత్ వృద్ధికి జీఎస్టీ దన్ను: ఐసీఎస్ఐ
హైదరాబాద్: భారత్ వృద్ధి బాటలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు ఎంతో కీలకమైనదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ సీఎస్ మమతా బినానీ పేర్కొన్నారు. ఏకీకృత పన్ను వ్యవస్థ వృద్ధికి దోహదపడే అంశమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దేశాన్ని మరింత చేరువ చేస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రాత్మక రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు, 2014 పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ నెల 30వ తేదీన జీఎస్టీపై రాష్ట్ర ఆర్థికమంత్రుల సాధికార కమిటీ నిర్వహిస్తున్న చర్చాగోష్టిలో పాల్గొని ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పలు వాణిజ్య, వృత్తి పరమైన సంఘాల అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు. కాగా ఆగస్టు నెలను ‘జీఎస్టీ అవేర్నెస్ మంత్’గా ఐసీఎస్ఐ పాటిస్తున్న సంగతిని ఈ సందర్భంగా మమతా బినానీ గుర్తుచేశారు. -
బలంగా భారత వృద్ధి అవకాశాలు
♦ వచ్చే రెండేళ్లపాటు వృద్ధి 7.5% ♦ భారత్ సౌర్వభౌమ రేటింగ్ బీఏఏ3గా కొనసాగింపు న్యూఢిల్లీ: సంస్కరణల కొనసాగింపుతో భారత వృద్ధి అవకాశాలు స్వల్పకాలానికి బలంగానే ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కానీ, కొండలా పేరుకుపోతున్న మొండి బకాయిలే సమస్యాత్మకమని పేర్కొంది. వచ్చే రెండేళ్లపాటు వృద్ధి రేటు 7.5% స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 గానే కొనసాగించింది. ఈ రేటు అధిక స్థాయిలో ఉంటే రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థం. దీంతో ఆ దేశం పెట్టుబడులకు అనుకూలమనే సందేశం వెళుతుంది. రుణాల ఎగవేతను అరికట్టేందుకు దివాళా చట్టాన్ని తీసుకురావడం, జీఎస్టీ అమలు చివరి దశలో ఉండడం సానుకూలాంశాలుగా మూడీస్ తెలిపింది. బ్యాంకులు మొండి బకాయిలను గుర్తిస్తూ ఉండడంతో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ఇక ముందూ పెరుగుతాయని, ఈ పరిస్థితులు ముఖ్యం గా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మందగమనంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.70వేల కోట్ల మూల దనం కంటే అధికంగానే నిధులు అవసరం అవుతాయని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ తన నివేదికలో వెల్లడించింది. నివేదికలోని అంశాలు... ⇒ సంస్కరణలను కొనసాగించడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో కొనసాగడం వల్ల భారత్ బలమైన వృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది. కానీ, బ్యాంకింగ్ రంగంలో సవాళ్లు పెరగడం భారత పరపతి నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక, సంస్థాగత సంస్కరణల దిశగా విధాన నిర్ణేతల చర్యలు సత్ఫలితాలు ఇస్తే రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం. ⇒ బ్యాంకింగ్ రంగానికి మొండి బకాయిల సమస్య ఏర్పడడానికి వృద్ధి మందగించడం, ప్రాజెక్టుల అమలు నిదానించడం, ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయడమే కారణాలు. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగి 2015 జూన్ నుంచి 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ⇒ మొండి బకాయిల గుర్తింపు, దివాళా చట్టంపై దృష్టి పెట్టడం భారత సార్వభౌమ రుణ అర్హతను పెంచుతుంది. -
భారత్ వృద్ధి రేటు వెనక్కే!
♦ హెచ్ఎస్బీసీ నివేదిక రెండేళ్లలో 7.6 శాతం నుంచి ♦ 7.2 శాతానికి పడిపోతుందని అంచనా ♦ గణాంకాల మదింపుపై అస్పష్టతపైనా అస్త్రాలు న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు మందగమనంలోనే ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ఇది 7.4 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందనీ తన నివేదికలో అంచనావేసింది. 2017-18లో ఇది మరింత తగ్గి 7.2 శాతానికి దిగుతుందనీ విశ్లేషించింది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ప్రతికూల పరిణామాలు తన అంచనాకు కారణమని పేర్కొంది. భారత జీడీపీ గణాంకాల మదింపు సందేహాలు అలానే కొనసాగుతుండడం మరో ముఖ్యాంశంగా హెచ్ఎస్బీసీ పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇒ అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య, ప్రైవేటు పెట్టుబడులకు ఊపందుకోకపోవడం, చమురు ధరలు క్రమంగా పెరుగుతున్న ధోరణి వంటి సవాళ్లు భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు. ⇒ వృద్ధి రేటు వెనకడుగు వేసినా... ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశమే కొనసాగుతుంది. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2016-17 ఏప్రిల్, జూన్) భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతం నమోదుకావడానికి పట్టణ వినియోగ డిమాండ్ పెరగడమే కారణం. ⇒ జీడీపీ గణాంకాల మదింపుపై ఆందోళనలు ఉన్న విషయం గమనార్హం. ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు జరిగితే వాస్తవ వృద్ధి అధికారిక అంచనాలకన్నా దాదాపు 150 బేసిస్ పాయింట్లు తక్కువగా (1.5 శాతం) 6 నుంచి 6.5 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది. వృద్ధికి సంబంధించి అధికంగా అంచనావేసిన గణాంకాల విషయమై రానున్న ఆరు త్రైమాసికాల్లో 80 బేసిస్ పాయింట్లు తగ్గే వీలుంది. ⇒ ప్రభుత్వ వేతన పెంపు, దీనితో పట్టణ వినియోగ డిమాండ్‌లో వృద్ధి, సాధారణ వర్షపాతం అవకాశాలు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత పాలసీ రేట్ల కోత ప్రయోజనం కస్టమర్‌కు బదలాయింపు, దీనితో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెరుగుదల, ప్రభుత్వ సంస్కరణల అమలు వంటి అంశాలు భారత్ వృద్ధికి సానుకూల అంశాలు. ⇒ అంచనాలకు అనుగుణంగా తగిన వర్షపాతం నమోదై, వినియోగ ద్రవ్యోల్బణం తగ్గితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో(ప్రస్తుతం 6.5 శాతం) పావుశాతం తగ్గే అవకాశం ఉంది. -
మరింత వేగంగా వృద్ధి!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తగిన వర్షపాతం, జీఎస్టీ, భారీ వ్యయ అంశాల ప్రస్తావన టోక్యో: భారత్ వృద్ధి మరింత పరుగులు పెట్టడం ఖాయమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డా రు. అంతర్జాతీయ అవరోధాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తోందని అన్నారు. అధిక వర్షపాతం అంచనాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు అవకాశాలు, ప్రభుత్వ అధిక వ్యయాలు, గ్రామీణ డిమాండ్ పెరిగేందుకు చర్యలు వంటి అంశాలు రానున్న కాలంలో భారత్ భారీ వృద్ధికి దారితీస్తాయని విశ్లేషించారు. భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా... జపాన్‌లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ... బుధవారం ఒసాకాకు బయలుదేరి వెళ్లారు. అంతక్రితం విలేకరులతో మాట్లాడుతూ, గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి సాధనకు ప్రభుత్వం చేపట్టిన విధానాలే కారణమని అన్నారు. రానున్న రెండేళ్లలో కూడా భారత్ మంచి ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు,ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అన్నారు. తగిన వర్షపాతం అంచనాలు హర్షణీయమని పేర్కొన్న ఆయన గడచిన 100 సంవత్సరాల చరిత్రలో వరుసగా మూడేళ్లు భారత్‌లో కరువు పరిస్థితులు సంభవించిన పరిస్థితి లేదనీ వివరించారు. -
భారత్ వృద్ధి పటిష్టం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: సమీప కాలానికి భారత్ వృద్ధి తీరు మెరుగుపడుతోందని బ్యాంకింగ్ సేవల దిగ్గజం హెచ్ఎస్బీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తు సేవల పన్ను బిల్లు ఈ ఏడాది చివర్లో ఆమోదం పొందే వీలుందని, ఆ తర్వాత వృద్ధికి సంబంధించిన అంశాలు మరింత పటిష్టమయ్యే వీలుందని అంచనావేసింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన దివాలాబిల్లుసహా ఆధార్ బిల్లు, మానిటరీ పాలసీ కమిటీ బిల్లు, జీఎస్టీ బిల్లు వృద్ధి బాటలో కీలకమని విశ్లేషించింది. బీజేపీకి ప్రజాదరణ తగ్గలేదని తాజా ఎన్నికలు పేర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వానికి కీలక బిల్లుల విషయంలో పెద్దల సభలో ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనావేసింది. -
భారత్ వృద్ధిపై అత్యుత్సాహం తగదు..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ తలసరి ఆదాయంలో బ్రిక్స్ దేశాలకన్నా ♦ వెనుకబడి ఉన్నామని వ్యాఖ్య ♦ తగిన వృద్ధి ఫలాలు అందేవరకూ ♦ జాగ్రత్త అవసరమని సూచన పుణే: భారత్ వృద్ధి తీరుపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం’ భావనపై అధిక ఉత్సాహం అక్కర్లేదని అన్నారు. భారత్ మరెంతో సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించే ఒక సెంట్రల్ బ్యాంకర్‌గా... ‘వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ అన్న’ వాక్యంపై తనకేమీ వ్యామోహం లేదన్నారు. ఆర్బీఐ నియంత్రణలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలకన్నా భారత్ తలసరి ఆదాయం తక్కువగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. భారత్ పౌరుడి అత్యున్నత జీవన ప్రమాణాల సాధనకు ప్రస్తుత తరహా వృద్ధి రేటు ఇంకా 20 సంవత్సరాలు కొనసాగాల్సి ఉంటుందని వివరించారు. దేశంలో పలు వ్యవస్థాగత సంస్కరణల అమలు జరగాల్సి ఉందన్నారు ‘మనం తరచూ చైనాతో పోల్చుకుంటుంటాం. 1960ల్లో మనకన్నా చిన్నస్థాయిలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనతో పోల్చుకుంటే... ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. సగటు భారతీయుని సంపదకన్నా... చైనా సగటు పౌరుని సంపద ఐదు రెట్లు అధికం’ అని రాజన్ అన్నారు. అయితే ఇక్కడ తాను చులకన భావంతో మాట్లాడుతున్నానని భావించవద్దని కోరారు. ‘ పటిష్ట, సుస్థిర వృద్ధికి కేంద్రాలు, రాష్ట్రాలు తగిన వేదికను సృష్టిస్తున్నాయి. వాటి ఫలితాలు అందడానికి సిద్ధంగా ఉన్నాయన్న విశ్వాసమూ నాకుంది. అయితే ఇదే దారిలో మనం కొంత సమయం ఉండాలి. ఈ అంశంపై సదా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యపై భూతద్దం వద్దు: రాయ్ కాగా మొండిబకాయిల సమస్యను ప్రతి సందర్భంలోనూ తీవ్ర ఆందోళనకర అంశంగా చూపించడం తగదని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో(బీబీబీ) చైర్మన్ వినోద్ రాయ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. తాజా రుణాలపై, రుణ బకాయిలు తీర్చడంపై ఈ తరహా ధోరణి ప్రతికూలత చూపుతుందని అన్నారు. బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌ల విధాన నిర్ణయ సామర్థ్యాలపై సైతం అపోహల వ్యాప్తి సరికాదని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తగిన ఆర్థిక పరిస్థితులు లేనందున ఇబ్బందులు నెలకొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను అత్యంత ఆందోళనకరమైన అంశాలుగా చూపించడం తగదని వ్యాఖ్యానించారు. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వాస్తవమైనా.. ప్రస్తుతం పటిష్టంగా మారిందని రాయ్ అన్నారు. రుణ బకాయిదారులందరూ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కాబోరని పేర్కొన్నారు. రుణ లావాదేవీలన్నీ నేరపూరితమైనవి కాదనీ అన్నారు. ఒకరిద్దరు కార్పొరేట్లు చేసిన పనికి అందరినీ ఒకేగాటన కట్టడం సరికాదన్నారు. దురదృష్టవశాత్తూ మొండిబకాయిలకు సంబంధించి సమస్య సత్వర పరిష్కారంలో న్యాయ పరమైన అడ్డంకులూ ఎదరవుతున్నాయని చెప్పారు. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై ఎప్పటికైనా కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. పదాలపైకాదు... పరమార్థంపై చర్చ జరగాలి కాగా భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డివాళ్ల లోకంలో ఒంటి కన్నురాజులా ఉందన్న తన వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంపై రాజన్ స్నాతకోత్సవంలో స్పందించారు. ఈ పదాలపై చర్చ సరికాదని, ఇందులో ప్రధాన భావనపై చర్చ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అహ్మదాబాద్ అంధుల సంఘం ఒక లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. తన పదాలకు ఆయన క్షమాపణ చెబుతూ... ఉద్దేశం భిన్నమైనదే అయినప్పటికీ, అందుకు వినియోగించిన పదాలు ఇతరులను ఎంత స్థాయిలో ఇబ్బంది పెడితే అంత స్థాయిలో తగిన క్షమాపణలను కోరతానన్నారు. ‘మాట్లాడేటప్పుడు వక్తలు జాగ్రత్తగా వ్యవహరించాలనడంలో సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో భావం తప్ప, అవమానించారని భావించడం తగదని’ కూడా అన్నారు. ఇటీవల రాజన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సహా పలువురి నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కంటికి కన్ను భావన ప్రపంచం మొత్తాన్ని చీకటి చేస్తుంది’ అన్న మహాత్ముని అహింసా సిద్ధాంతం చాలా అత్యున్నతమైనది తప్ప, దీనిని ఒక అంగవైకల్యానికి సంబంధించిన అంశంగా చూడలేముకదా అని సైతం ఆయన పేర్కొన్నారు. తాను వినియోగించిన ‘నానుడి’ కొత్తది కూడా కాదని పేర్కొన్న ఆయన, డచ్ ఫిలాసఫర్ ‘ఎరాస్ముస్’ దీనిని తొలిసారి వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. -
వృద్ధి ఇంకా మెరుగుపడుతుంది: జైట్లీ
కాన్బెర్రా: భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.6 శాతంగా నమోదవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్‌కు చక్కటి ఆర్థిక వృద్ధి సామర్థ్యం ఉందని, ప్రస్తుతం సామర్థ్యంకన్నా తక్కువ వృద్ధిరేటే నమోదవుతోందని చెప్పారాయన. ఇక్కడి ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో గురువారం కేఆర్ నారాయణన్ స్మారక ఉపన్యాసం చేశారు. ‘భారత్‌లో కొత్త ఆర్థిక వ్యవస్థ, అందరికీ భాగస్వామ్యం’ అన్న అంశంపై మాట్లాడారు. పన్ను సంస్కరణలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. -
ప్రైవేటు పెట్టుబడులు... గ్రామీణ డిమాండ్ కీలకం
భారత్ వృద్ధిపై ఏడీబీ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కీలక అంశాలని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడిబీ) విశ్లేషించింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో వృద్ధికి ఈ అంశాలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై ఈ మేరకు మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు... ♦ వృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు, పట్టణ వినియోగం (డిమాండ్) కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి పటిష్టతకు ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కూడా పటిష్ట పడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో- దేశీయ డిమాండ్ అన్ని స్థాయిల్లో పటిష్ట పడాలి. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధిరేటు అంచనా 7.4 శాతం. బలహీన గ్లోబల్ డిమాండ్, ఎగుమతులు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గడానికి కారణం. ♦ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెరుగుదల వల్ల పట్టణ వినియోగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో గ్రామీణ వినియోగ డిమాండ్ పటిష్టతపై సందేహాలు నెలకొన్నాయి. -
భారత్ వృద్ధి అంచనాలను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
7.9% నుంచి అంచనాలు సవరించిన మోర్గాన్ స్టాన్లీ న్యూఢిల్లీ: ఈ సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించినట్లు కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. పలు విదేశీ అంశాల కారణంగా రికవరీ అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. గడిచిన రెండేళ్లుగా దేశీయంగా పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాల వల్ల వృద్ధి రికవరీ వేగం ఆశించిన దానికన్నా నెమ్మదిగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి, 2017లో 8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఒక నివేదికలో వివరించింది. అంచనాలను తగ్గించినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో వినియోగం, ప్రభుత్వం చేసే వ్యయాలు మెరుగుపడటంతో పాటు విదేశీ నిధుల రాక మొదలైనవి వృద్ధి రికవరీకి తోడ్పడగలవని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపింది. -
స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ
లండన్: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో పలు అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ధోరణి మిశ్రమంగా కనిపిస్తోందని తెలిపింది. భారత్ వృద్ధి క్రియాశీలతకు సంబంధించి అక్టోబర్‌లో కాంపోసిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) 100.2 పాయింట్ల వద్ద ఉంది. అయితే నవంబర్‌లో ఈ పాయింట్లు 100.4 పాయింట్లకు పెరిగింది. చైనా, బ్రెజిల్‌కు సంబంధించి తాత్కాలిక వృద్ధి ధోరణి కనిపిస్తుండగా.. రష్యా మాత్రం మందగమనంలోకి జారుతోంది. యూరో ప్రాంతంలో స్థిర వృద్ధి ధోరణి కనబడుతున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి జర్మనీ, ఇటలీ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెనడా, జపాన్, ఫ్రాన్స్‌ల విషయంలోనూ స్థిర వృద్ధి సానుకూలతలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్లు గరిష్ట స్థాయి సీఎల్ఐ నుంచి స్వల్పంగా జారాయి. -
భారత్‌కు మొండిబకాయిల సమస్య: ఓఈసీడీ
కౌలాలంపూర్: వర్థమాన ఆసియా దేశాల్లో భారత్ వృద్ధి స్థాయిలు బాగున్నాయని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని, 2016-17లో ఈ రేటు 7.3 శాతానికి మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. 2016-20 మధ్య భారత్‌లో సగటు వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేస్తోంది. కాగా భారత్ వృద్ధి బాటలో బ్యాంకింగ్ మొండిబకాయిల అంశం ఒక సవాలని తన తాజా విశ్లేషణా పత్రం ప్రకారం. 2015లో వర్థమాన ఆసియా దేశాల వృద్ధి రేటు 6.5 శాతం. 2016 నుంచి 20 వరకూ ఈ రేటు సగటున 6.2%గా ఉంటుంది. భారత్ వృద్ధి ధోరణి కొనసాగుతుంటే... చైనా నెమ్మదిస్తుంది. ఆసియాన్ ప్రాంతం 2015లో 4.6% వృద్ధి రేటు సాధిస్తుంది. -
భారత్-అమెరికా వ్యాపార బంధం కొత్త శిఖరాలకు..
కార్పొరేట్ దిగ్గజాలకు ఇరు దేశాధినేతల భరోసా... ⇒ భారత్ వృద్ధికి సంపూర్ణ సహకారం: అమెరికా అధ్యక్షుడు ఒబామా ⇒ 4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు, రుణాలు ఇస్తామని వెల్లడి ⇒ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, అమెరికా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు భరోసా కల్పించారు. భారత్ వృద్ధికి తోడ్పాటు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. ఇరు దేశాల వ్యాపారవర్గాలతో సోమవారం భేటీ సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే దిశగా రెండు దేశాలూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు. భారత్‌లో నియంత్రణ విధానాలు సరళతరం కావాలన్నారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండాలని, మేథోహక్కులపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్‌లో రహదారులు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు తోడ్పాటు అందిస్తామని ఒబామా చెప్పారు. ‘అమెరికా కంపెనీలు భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన నియంత్రణ వ్యవస్థ, పన్నుల విధానాలను కోరుకుంటున్నాయి. అదే జరిగితే ఇక్కడ వ్యాపారాల నిర్వహణకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. వ్యాపారాలను అణగదొక్కకుండా వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో మేథోహక్కుల పరిరక్షణకు సమర్ధమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఇందుకు సంబంధించిన వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో మేథోహక్కుల పరిరక్షణ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించే దిశగా వ్యాపారాల అభివృద్ధికి, మరిన్ని పెట్టుబడుల రాకకు అనుకూల పరిస్థితులు కల్పించేలా మోదీ చర్యలు తీసుకుంటున్నారని ఒబామా కితాబిచ్చారు. 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..: భారత్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్న ఒబామా ఇక్కడ దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తోడ్పడేలా అమెరికా నుంచి ఇక్కడికి జరిగే ఎగుమతులకు 1 బిలియన్ డాలర్ల మేర ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఫెనాన్సింగ్ చేస్తుందన్నారు. అలాగే, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా 1 బిలియన్ డాలర్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు 2 బిలియన్ డాలర్లు ఇస్తామన్నారు. భారత్‌లో రైల్వే, రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు అవసరమైన కొంగొత్త టెక్నాలజీలను ఇరు దేశాలు కలిసి అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 560 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత్- అమెరికా మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని భారీ స్థాయిలో పెంచుకునేందుకు అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఒబామా చెప్పారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వృద్ధి ఫలాలు అందరికీ అందాలని, స్థూల దేశీయోత్పత్తి వంటి గణాంకాలకే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా కంపెనీలు భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన నియంత్రణ వ్యవస్థ, పన్ను విధానాలను కోరుకుంటున్నాయి. - ఒబామా మోదీ ఏం చెప్పారంటే.. ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా గతంలో జరిగిన కొన్ని తప్పిదాలను సరిచేశామని మోదీ చెప్పారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. పెట్టుబడులను స్వాగతించే, ప్రోత్సహించే పరిస్థితులను కల్పిస్తామని అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) సమావేశంలో మోదీ చెప్పారు. ప్రభుత్వాలు నిలకడైన విధానాలను అమలు చేస్తేనే పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 50% మేర పెరిగాయని ప్రధాని వివరించారు. ‘మీ ప్రాజెక్టులు సత్వరం అమలయ్యేలా అడుగడుగునా మీకు కావాల్సిన సహకారం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణాన్ని మీరు చూడగలరు. నవకల్పనలను ప్రోత్సహించడంతో పాటు మీ మేథోహక్కులను కూడా పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం’ అని ఇన్వెస్టర్లకు ఆయన భరోసానిచ్చారు. అలాగే భారీ ప్రాజెక్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని అంతకు ముందు జరిగిన భారత్-అమెరికా సీఈవోల సదస్సులో మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ వ్యవసాయానికి సంబంధించి ‘ప్రతి చుక్క నీటి బొట్టుతో మరింత దిగుబడి సాధించే’ విధానంపై దృష్టి సారిస్తే పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చని ప్రధాని చెప్పారు. టాప్ 50 లక్ష్యం.. వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో అట్టడుగున ఉన్న భారత్‌ను టాప్ 50కి తీసుకురావాలనేది తమ లక్ష్యమని మోదీ చెప్పారు. మౌలిక సదుపాయాలు.. వనరుల కొరత, నైపుణ్యాల లేమి వంటివేవీ కూడా వృద్ధికి ఆటంకాలు కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసియా మార్కెట్లన్నింటితో పోలిస్తే భారత్‌లో ప్రస్తుతం వ్యాపారాలకు సంబంధించి అత్యంత ఆశావహ ధోర ణి నెలకొందన్నారు. మౌలిక రంగాల వృద్ధి మెరుగుపడటం తో పాటు ద్రవ్యోల్బణం అయిదేళ్ల కనిష్టానికి తగ్గిందని, గత 4 నెలల్లో 11 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచామని తెలిపారు. ప్రాజెక్టులు సత్వరం అమలయ్యేలా అడుగడుగునా సహకారం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణాన్ని మీరు చూస్తారు. - మోదీ ఒబామాతో మన సీఈవోలు ఏమన్నారంటే... ఒబామాతో భేటీలో భారత సీఈవోలు మాట్లాడేందుకు మొత్తం 18 నిమిషాలే కేటాయించారు. దీంతో పారిశ్రామిక దిగ్గజాలు అందరూ అన్నింటిపైనా మాట్లాడేయకుండా ఒక్కొక్కరూ ఒక్కొక్క అంశాన్ని ఎంచుకున్నారు. అయిదుగురు సీఈవోలు తలో రెండు నిమిషాలు చొప్పున వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత మిగతా సీఈవోలతో చర్చాగోష్టి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు, అక్కడ ఇన్వెస్ట్ చేసే భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవి ఇందులో చర్చకు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యవసాయం, నవకల్పనలు, నైపుణ్యాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా.. ఫార్మా రంగ సమస్యలపైనా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు.. వీసాలపై, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లు.. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై మాట్లాడారు. ఇక ఓఎన్జీసీ సీఎండీ దినేశ్ కె సరాఫ్ ద్రవీకృత సహజ వాయువు దిగుమతులకు సంబంధించి ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆవశ్యకత గురించి వివరించారు. టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, బీహెచ్ఈఎల్ చైర్మన్ బి. ప్రసాద్ రావు సహా 17 మంది దిగ్గజాలు భారత బృందంలో ఉన్నారు. అమెరికా నుంచి పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్ చైర్మన్ హెరోల్డ్ మెక్‌గ్రా, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.6%
సిటీ గ్రూప్ అంచనా పుంజుకున్న తీరు ఆశ్చర్యకరమని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతోందని.. ఈ ఏడాది ఆశ్చర్యకరమైనరీతిలో పుంజుకున్నట్లు ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీ గ్రూప్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. 2015-16లో 6.5 శాతం, 2016-17 సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అందుకునే అవకాశాలున్నాయని కూడా అభిప్రాయపడింది. గడిచిన రెండేళ్లలో(2012-14) వృద్ధి రేటు 5% దిగువకు పడిపోవడం తెలిసిందే. కాగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదైంది. పెట్టుబడులు, వినియోగం పుంజుకోవడం వల్లే వృద్ధి కూడా జోరందుకుంటోందని.. అదేవిధంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కూడా పారిశ్రామిక రంగానికి బూస్ట్ ఇస్తోందని సిటీ గ్రూప్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ఇతరత్రా కమోడిటీల ధరలు భారీగా దిగిరావడం కూడా భారత్‌కు కలిసొస్తున్న అంశాలని తెలిపింది. ఇవన్నీ దేశీ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబి స్తున్నాయని.. విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగడంతో సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటిదాకా 35 శాతం పైగా ఎగబాకిందని పేర్కొంది. కరెన్సీ(రూపాయి) కూడా 59-63 శ్రేణిలో స్థిరపడేందుకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 1.7 శాతానికి దిగిరావడం(2013లో 4.7 శాతం), ద్రవ్యోల్బణం 11 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గడం కూడా వృద్ధికి ఊతమిచ్చే అంశాలని... వచ్చే ఏడాది వడ్డీరేట్లు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. కాగా, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్య, సరైన ఉద్యోగకల్పనలేని వృద్ధి, రాజ్య సభలో మోదీ సర్కారుకు మెజారిటీ లేకపోవడం... ఈ మూడూ భారత్‌కు అంతర్గత రిస్కులని సిటీ అభిప్రాయపడింది.