భారత్ వృద్ధికి జీఎస్టీ దన్ను: ఐసీఎస్ఐ
హైదరాబాద్: భారత్ వృద్ధి బాటలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ఎంతో కీలకమైనదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ప్రెసిడెంట్ సీఎస్ మమతా బినానీ పేర్కొన్నారు. ఏకీకృత పన్ను వ్యవస్థ వృద్ధికి దోహదపడే అంశమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దేశాన్ని మరింత చేరువ చేస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రాత్మక రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు, 2014 పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ నెల 30వ తేదీన జీఎస్‌టీపై రాష్ట్ర ఆర్థికమంత్రుల సాధికార కమిటీ నిర్వహిస్తున్న చర్చాగోష్టిలో పాల్గొని ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పలు వాణిజ్య, వృత్తి పరమైన సంఘాల అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు. కాగా ఆగస్టు నెలను ‘జీఎస్‌టీ అవేర్‌నెస్ మంత్’గా ఐసీఎస్‌ఐ పాటిస్తున్న సంగతిని ఈ సందర్భంగా మమతా బినానీ గుర్తుచేశారు.