ఈ ఏడాది భారత్ వృద్ధి 7.4 శాతం!
యొకోహమా (జపాన్): భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ –2018 మార్చి) 7.4 శాతం వృద్ధి చెందుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) బుధవారం పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు 7.6 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాలా పన్ను దేశంలో వ్యాపార సానుకూల వాతావరణ సృష్టికి దోహదపడతాయని విశ్లేషించింది.
ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరవుతున్న ఏడీబీ 50వ వార్షిక సమావేశం (మే 4 నుంచి 7వ తేదీ వరకూ) నేపథ్యంలో– సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సావదా మాట్లాడుతూ, భారత్‌లో సంస్కరణల అమలు తీరును ప్రశంసించారు.
యసుయుకి అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే...
నా వంటి ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను పరిశీలనలోకి తీసుకుంటే భారత్ 7%పైగా వృద్ధి సాధిస్తోంది. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగే వీలుంది. భారత్ వాణిజ్యం మెరుగుపడ్డం ఇక్కడ మరో ముఖ్యాంశం.
డీమోనిటైజేషన్ కారణంగా నగదు ఆధారిత లావాదేవీలు, వినియోగదారుని సెంటిమెంట్ దెబ్బతింది. అయితే అటు తర్వాత ఇప్పటివరకూ పరిస్థితిని గమనిస్తే, డీమోనిటైజేషన్ ప్రతికూలత స్వల్పకాలికమేనని తేలిపోయింది. అయితే నల్లధనంపై డీమోనిటైజేషన్ ప్రభావం ఎంతుందన్నది మాత్రం అధ్యయనం చేయలేదు.
డాలర్ మారకంలో రూపాయి బలోపేతం కావడం వల్ల– వాణిజ్య సంబంధ అంశాల్లో భారత్ అంతర్జాతీయంగా పోటీ తత్వాన్ని కోల్పోతుందని మీరు భావిస్తున్నారు. కేవలం రూపాయి బలోపేతమే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపదు. ఎగుమతి ధర, ఇతర దేశాలకు సంబంధించి ఆ ధరలో సామీప్యత వంటి ఎన్నో అంశాలు ఇక్కడ ఇమిడి ఉంటాయి. భారత్ ఎగుమతులు ఇప్పుడు సానుకూల ఫలితాలనే నమోదుచేస్తుండడం గమనార్హం (అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ జనవరి నుంచి 5 శాతం ఎగబాకింది).
ఏడీబీ సమావేశాలకు జైట్లీ పర్యటన రద్దు!
ఇదిలావుండగా, ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకూ ఇక్కడ జరుగనున్న ఏడీబీ వార్షిక సమావేశాలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హాజరుకావడం లేదు. జైట్లీ బదులుగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ హాజరుకానున్నారు. రక్షణ మంత్రిత్వశాఖకు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ పర్యటన రద్దయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందుకు కారణాలను మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదు. భారత్–పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే తాజా పరిణామానికి కారణమన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. కాగా జపాన్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ వారాంతంలో జరగనున్న జైట్లీ టోక్యో పర్యటన షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులేదు. మే 6న ఆయన టోక్యోకు విచ్చేస్తారు. జపాన్ నాయకులతోపాటు ఆ దేశ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు.