జీడీపీకి జీఎస్‌టీ జోష్!
♦ వృద్ధి రేటు పుంజుకుంటుంది...
♦ పన్ను ఆదాయాలు పెరుగుతాయ్...
♦ సార్వభౌమ రేటింగ్‌కు సానుకూలం...
♦ క్రెడిట్ రేటింగ్ దిగ్గజం మూడీస్ అభిప్రాయం
న్యూఢిల్లీ: కొత్తగా అమల్లోకి వచ్చిన అతిపెద్ద పన్నుల సంస్కరణ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)... రానున్న కాలంలో భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్ పెరుగుదలకు సానుకూలమైన అంశమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. జీఎస్‌టీతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పుంజుకుంటుందని... ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు పెరుగుతాయని తెలిపింది. ‘మధ్యకాలానికి చూస్తే... జీఎస్‌టీ వల్ల ఉత్పాదకపరంగా భారీ ప్రయోజనాలు జతవుతాయి. దీనివల్ల వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సాకారం కావడం ద్వారా... అధిక జీడీపీకి దోహదం చేస్తుంది. అంతేకాదు.. ఏకీకృత మార్కెట్‌తో విదేశీ పెట్టుబడులు కూడా జోరందుకుంటాయి.
విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్‌ఉన్న స్థానం మరింత మెరుగవుతుంది’ అని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ పేర్కొన్నారు. పన్నుల వసూలు యంత్రాంగం, వ్యవస్థ మెరుగవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ‘భారత్ సావరీన్ రేటింగ్‌కు ఇప్పటివరకూ పన్నుల ఆదాయ పరిధి తక్కువగా ఉండటమే అడ్డంకిగా ఉంటోంది. జీఎస్‌టీ అమలు కారణంగా రేటింగ్ పెంపునకు సానుకూల పరిస్థితులు నెలకొంటాయి’ అని ఫోస్టర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు ‘బీఏఏ3’(పాజిటివ్ అవుట్‌లుక్– అంటే భవిష్యత్తులో పెంపునకు అవకాశం) రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కు సంబంధించి ఇదే అత్యంత తక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్ స్థాయికి పడిపోయినట్లే.
వ్యయాలు తగ్గుతాయి...
జీఎస్‌టీ వ్యవస్థలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండటం వల్ల మొత్తమీద పన్ను చెల్లింపులు పెరిగే అవకాశం ఉందని మూడీస్ వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉమ్మడి ఐటీ మౌలిక సదుపాయాల వినియోగం పెరగడం, సులభమైన పన్ను రేట్ల కారణంగా నిర్వహణ వ్యయాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను ఇతరత్రా పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
భారత్ పోటీతత్వాన్ని పెంచుతుంది: కార్పొరేట్ ఇండియా
మన పారిశ్రామిక రంగం పోటీతత్వాన్ని మరింత పెంచేందుకు జీఎస్‌టీ దోహదం చేస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అభిప్రాయపడింది. అదేవిధంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభించడంతోపాటు పన్నుల పరిధి కూడా విçస్తృతం కానుందని పేర్కొంది. ‘అత్యంత కీలకమైన, గేమ్ చేంజింగ్ సంస్కరణగా చెబుతున్న జీఎస్‌టీ జమానాలోకి మనం అడుగుపెట్టాం. ఇంతపెద్ద దేశంలో ఇలాంటి గొప్ప సంస్కరణను సాకారం చేయడం ద్వారా ప్రపంచానికి మన సత్తా చూపగలిగాం. రానున్న రోజుల్లో జీఎస్‌టీ వల్ల వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త వ్యాపారాల ఏర్పాటు కూడా పుంజుకుంటుంది.
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పన్ను మీద పన్నుకు అడ్డుకట్ట పడుతుంది. వ్యాపారస్తులంతా తమకు దక్కే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తారని భావిస్తున్నాం. వెరసి ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడంలో జీఎస్‌టీ తోడ్పాటునందిస్తుంది’ అని సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని పేర్కొన్నారు. జీఎస్‌టీని అమలుచేయడంలో పరిశ్రమ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గత నాలుగేళ్లలో రిటైల్ ధరల పెరుగుదల అత్యంత కనిష్టానికి చేరిందని.. ద్రవ్యోల్బణం కోణంలో.. జీఎస్‌టీ అమలుకు ఇది సరైన తరుణమని అసోచామ్ వ్యాఖ్యానించింది. ‘ప్రారంభంలో జీఎస్‌టీ అమల్లో కొన్ని ఇబ్బందులు ఉండటం సహజం. అయితే, స్థూలంగా చూస్తే జీఎస్‌టీకి ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉంది. వినిమయ డిమాండ్ మందకొడిగా ఉన్న నేపథ్యంలో జీఎస్‌టీ ప్రయోజనాలను పరిశ్రమ మొత్తం వినియోగదారులకు బదలాయించాలి. ఉత్పాదకత పెంపు, సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంపై పారిశ్రామిక రంగం దృష్టిపెట్టాలి’ అని అసోచామ్ పేర్కొంది.