2016... 2017ల్లో వృద్ధి 7.5 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016, 2017 సంవత్సరాల్లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది. పపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడీస్ గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. ‘‘బ్యాంకుల మొండిబకాయిలు, కార్పొరేట్ రుణ భారాలు పెరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని ద్రవ్యోల్బణం సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసరవచ్చు. అయితే వినియోగ వ్యయాలు పటిష్టంగా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం. ప్రభుత్వ ఆదాయా-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును వచ్చే ఏడాది జీడీపీలో 3.5 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం తన వ్యయాల్ని తగ్గించుకునే అవకాశముంది’’ అని సంస్థ విశ్లేషించింది.
ద్రవ్యలోటు సవాలే...గోల్డ్‌మన్,హెచ్‌ఎస్‌బీసీ
ద్రవ్యలోటు లక్ష్య సాధన అనుమానమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. 2016-17లో ఈ లక్ష్యాన్ని 3.9 శాతానికి పెంచే వీలుందని వివరించింది. జీడీపీ వృద్ధి గాను గ్రామీణ డిమాండ్‌ను మెరుగుపరచడం, ఉద్యోగుల వేతన బిల్లు పెంపు వంటి అంశాలు తన అంచనాలకు కారణంగా చూపింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.5 శాతం నుంచి 3.8 శాతానికి పెంచే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. వేతన బిల్లు అమలు వంటి విషయాల్లో ప్రభుత్వంపై వ్యయాల ఒత్తిళ్లు దీనికి కారణమని వివరించింది.
వృద్ధి 7.4 శాతం: ఓఈసీడీ
2016-17లో భారత్ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అంచనావేసింది. మూడు నెలల క్రితం అంచనా 7.3 శాతం కాగా దీనిని తాజాగా సంస్థ సవరించి పెంచింది. సంవత్సరాల పరంగా చూస్తే 2016లో 7.4 శాతం, 2017లో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. చైనా వృద్ధి రేట్లను ఈ రెండేళ్లలో వరుసగా 6.5 శాతం, 6.2 శాతంగా పేర్కొంది.