భారత్ వృద్ధి అంచనాలను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
7.9% నుంచి అంచనాలు సవరించిన మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించినట్లు కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. పలు విదేశీ అంశాల కారణంగా రికవరీ అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. గడిచిన రెండేళ్లుగా దేశీయంగా పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాల వల్ల వృద్ధి రికవరీ వేగం ఆశించిన దానికన్నా నెమ్మదిగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి, 2017లో 8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఒక నివేదికలో వివరించింది. అంచనాలను తగ్గించినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో వినియోగం, ప్రభుత్వం చేసే వ్యయాలు మెరుగుపడటంతో పాటు విదేశీ నిధుల రాక మొదలైనవి వృద్ధి రికవరీకి తోడ్పడగలవని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపింది.