భారత్ వృద్ధి రేటు వెనక్కే!
♦ హెచ్‌ఎస్‌బీసీ నివేదిక రెండేళ్లలో 7.6 శాతం నుంచి
♦ 7.2 శాతానికి పడిపోతుందని అంచనా
♦ గణాంకాల మదింపుపై అస్పష్టతపైనా అస్త్రాలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు మందగమనంలోనే ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ఇది 7.4 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందనీ తన నివేదికలో అంచనావేసింది. 2017-18లో ఇది మరింత తగ్గి 7.2 శాతానికి దిగుతుందనీ విశ్లేషించింది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ప్రతికూల పరిణామాలు తన అంచనాకు కారణమని పేర్కొంది. భారత జీడీపీ గణాంకాల మదింపు సందేహాలు అలానే కొనసాగుతుండడం మరో ముఖ్యాంశంగా హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇒ అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య, ప్రైవేటు పెట్టుబడులకు ఊపందుకోకపోవడం, చమురు ధరలు క్రమంగా పెరుగుతున్న ధోరణి వంటి సవాళ్లు భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు.
⇒ వృద్ధి రేటు వెనకడుగు వేసినా... ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశమే కొనసాగుతుంది.
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2016-17 ఏప్రిల్, జూన్) భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతం నమోదుకావడానికి పట్టణ వినియోగ డిమాండ్ పెరగడమే కారణం.
⇒ జీడీపీ గణాంకాల మదింపుపై ఆందోళనలు ఉన్న విషయం గమనార్హం. ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు జరిగితే వాస్తవ వృద్ధి అధికారిక అంచనాలకన్నా దాదాపు 150 బేసిస్ పాయింట్లు తక్కువగా (1.5 శాతం) 6 నుంచి 6.5 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది. వృద్ధికి సంబంధించి అధికంగా అంచనావేసిన గణాంకాల విషయమై రానున్న ఆరు త్రైమాసికాల్లో 80 బేసిస్ పాయింట్లు తగ్గే వీలుంది.
⇒ ప్రభుత్వ వేతన పెంపు, దీనితో పట్టణ వినియోగ డిమాండ్‌లో వృద్ధి, సాధారణ వర్షపాతం అవకాశాలు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత పాలసీ రేట్ల కోత ప్రయోజనం కస్టమర్‌కు బదలాయింపు, దీనితో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెరుగుదల, ప్రభుత్వ సంస్కరణల అమలు వంటి అంశాలు భారత్ వృద్ధికి సానుకూల అంశాలు.
⇒ అంచనాలకు అనుగుణంగా తగిన వర్షపాతం నమోదై, వినియోగ ద్రవ్యోల్బణం తగ్గితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో(ప్రస్తుతం 6.5 శాతం) పావుశాతం తగ్గే అవకాశం ఉంది.