ఈ ఏడాది భారత్ వృద్ధి 5.6%
సిటీ గ్రూప్ అంచనా
పుంజుకున్న తీరు ఆశ్చర్యకరమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతోందని.. ఈ ఏడాది ఆశ్చర్యకరమైనరీతిలో పుంజుకున్నట్లు ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీ గ్రూప్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. 2015-16లో 6.5 శాతం, 2016-17 సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అందుకునే అవకాశాలున్నాయని కూడా అభిప్రాయపడింది. గడిచిన రెండేళ్లలో(2012-14) వృద్ధి రేటు 5% దిగువకు పడిపోవడం తెలిసిందే. కాగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదైంది.
పెట్టుబడులు, వినియోగం పుంజుకోవడం వల్లే వృద్ధి కూడా జోరందుకుంటోందని.. అదేవిధంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కూడా పారిశ్రామిక రంగానికి బూస్ట్ ఇస్తోందని సిటీ గ్రూప్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ఇతరత్రా కమోడిటీల ధరలు భారీగా దిగిరావడం కూడా భారత్‌కు కలిసొస్తున్న అంశాలని తెలిపింది. ఇవన్నీ దేశీ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబి స్తున్నాయని.. విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగడంతో సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటిదాకా 35 శాతం పైగా ఎగబాకిందని పేర్కొంది. కరెన్సీ(రూపాయి) కూడా 59-63 శ్రేణిలో స్థిరపడేందుకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.
ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 1.7 శాతానికి దిగిరావడం(2013లో 4.7 శాతం), ద్రవ్యోల్బణం 11 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గడం కూడా వృద్ధికి ఊతమిచ్చే అంశాలని... వచ్చే ఏడాది వడ్డీరేట్లు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. కాగా, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్య, సరైన ఉద్యోగకల్పనలేని వృద్ధి, రాజ్య సభలో మోదీ సర్కారుకు మెజారిటీ లేకపోవడం... ఈ మూడూ భారత్‌కు అంతర్గత రిస్కులని సిటీ అభిప్రాయపడింది.