భారత్-అమెరికా వ్యాపార బంధం కొత్త శిఖరాలకు..
కార్పొరేట్ దిగ్గజాలకు ఇరు దేశాధినేతల భరోసా...
⇒ భారత్ వృద్ధికి సంపూర్ణ సహకారం: అమెరికా అధ్యక్షుడు ఒబామా
⇒ 4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు, రుణాలు ఇస్తామని వెల్లడి
⇒ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, అమెరికా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు భరోసా కల్పించారు. భారత్ వృద్ధికి తోడ్పాటు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. ఇరు దేశాల వ్యాపారవర్గాలతో సోమవారం భేటీ సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.
ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే దిశగా రెండు దేశాలూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు. భారత్‌లో నియంత్రణ విధానాలు సరళతరం కావాలన్నారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండాలని, మేథోహక్కులపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్‌లో రహదారులు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు తోడ్పాటు అందిస్తామని ఒబామా చెప్పారు. ‘అమెరికా కంపెనీలు భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన నియంత్రణ వ్యవస్థ, పన్నుల విధానాలను కోరుకుంటున్నాయి.
అదే జరిగితే ఇక్కడ వ్యాపారాల నిర్వహణకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. వ్యాపారాలను అణగదొక్కకుండా వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో మేథోహక్కుల పరిరక్షణకు సమర్ధమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఇందుకు సంబంధించిన వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో మేథోహక్కుల పరిరక్షణ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించే దిశగా వ్యాపారాల అభివృద్ధికి, మరిన్ని పెట్టుబడుల రాకకు అనుకూల పరిస్థితులు కల్పించేలా మోదీ చర్యలు తీసుకుంటున్నారని ఒబామా కితాబిచ్చారు.
4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..: భారత్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్న ఒబామా ఇక్కడ దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తోడ్పడేలా అమెరికా నుంచి ఇక్కడికి జరిగే ఎగుమతులకు 1 బిలియన్ డాలర్ల మేర ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఫెనాన్సింగ్ చేస్తుందన్నారు.
అలాగే, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా 1 బిలియన్ డాలర్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు 2 బిలియన్ డాలర్లు ఇస్తామన్నారు. భారత్‌లో రైల్వే, రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు అవసరమైన కొంగొత్త టెక్నాలజీలను ఇరు దేశాలు కలిసి అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 560 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత్- అమెరికా మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉందన్నారు.
ఈ నేపథ్యంలో దీన్ని భారీ స్థాయిలో పెంచుకునేందుకు అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఒబామా చెప్పారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వృద్ధి ఫలాలు అందరికీ అందాలని, స్థూల దేశీయోత్పత్తి వంటి గణాంకాలకే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా కంపెనీలు భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన నియంత్రణ వ్యవస్థ, పన్ను విధానాలను కోరుకుంటున్నాయి.
- ఒబామా
మోదీ ఏం చెప్పారంటే..
ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా గతంలో జరిగిన కొన్ని తప్పిదాలను సరిచేశామని మోదీ చెప్పారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. పెట్టుబడులను స్వాగతించే, ప్రోత్సహించే పరిస్థితులను కల్పిస్తామని అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ) సమావేశంలో మోదీ చెప్పారు.
ప్రభుత్వాలు నిలకడైన విధానాలను అమలు చేస్తేనే పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 50% మేర పెరిగాయని ప్రధాని వివరించారు. ‘మీ ప్రాజెక్టులు సత్వరం అమలయ్యేలా అడుగడుగునా మీకు కావాల్సిన సహకారం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణాన్ని మీరు చూడగలరు. నవకల్పనలను ప్రోత్సహించడంతో పాటు మీ మేథోహక్కులను కూడా పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం’ అని ఇన్వెస్టర్లకు ఆయన భరోసానిచ్చారు. అలాగే భారీ ప్రాజెక్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని అంతకు ముందు జరిగిన భారత్-అమెరికా సీఈవోల సదస్సులో మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ వ్యవసాయానికి సంబంధించి ‘ప్రతి చుక్క నీటి బొట్టుతో మరింత దిగుబడి సాధించే’ విధానంపై దృష్టి సారిస్తే పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చని ప్రధాని చెప్పారు.
టాప్ 50 లక్ష్యం..
వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో అట్టడుగున ఉన్న భారత్‌ను టాప్ 50కి తీసుకురావాలనేది తమ లక్ష్యమని మోదీ చెప్పారు. మౌలిక సదుపాయాలు.. వనరుల కొరత, నైపుణ్యాల లేమి వంటివేవీ కూడా వృద్ధికి ఆటంకాలు కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసియా మార్కెట్లన్నింటితో పోలిస్తే భారత్‌లో ప్రస్తుతం వ్యాపారాలకు సంబంధించి అత్యంత ఆశావహ ధోర ణి నెలకొందన్నారు. మౌలిక రంగాల వృద్ధి మెరుగుపడటం తో పాటు ద్రవ్యోల్బణం అయిదేళ్ల కనిష్టానికి తగ్గిందని, గత 4 నెలల్లో 11 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచామని తెలిపారు.
ప్రాజెక్టులు సత్వరం అమలయ్యేలా అడుగడుగునా సహకారం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణాన్ని మీరు చూస్తారు.
- మోదీ
ఒబామాతో మన సీఈవోలు ఏమన్నారంటే...
ఒబామాతో భేటీలో భారత సీఈవోలు మాట్లాడేందుకు మొత్తం 18 నిమిషాలే కేటాయించారు. దీంతో పారిశ్రామిక దిగ్గజాలు అందరూ అన్నింటిపైనా మాట్లాడేయకుండా ఒక్కొక్కరూ ఒక్కొక్క అంశాన్ని ఎంచుకున్నారు. అయిదుగురు సీఈవోలు తలో రెండు నిమిషాలు చొప్పున వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత మిగతా సీఈవోలతో చర్చాగోష్టి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు, అక్కడ ఇన్వెస్ట్ చేసే భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవి ఇందులో చర్చకు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యవసాయం, నవకల్పనలు, నైపుణ్యాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా.. ఫార్మా రంగ సమస్యలపైనా, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు.. వీసాలపై, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లు.. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై మాట్లాడారు.
ఇక ఓఎన్‌జీసీ సీఎండీ దినేశ్ కె సరాఫ్ ద్రవీకృత సహజ వాయువు దిగుమతులకు సంబంధించి ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆవశ్యకత గురించి వివరించారు. టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, బీహెచ్‌ఈఎల్ చైర్మన్ బి. ప్రసాద్ రావు సహా 17 మంది దిగ్గజాలు భారత బృందంలో ఉన్నారు. అమెరికా నుంచి పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్ చైర్మన్ హెరోల్డ్ మెక్‌గ్రా, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు.