2017లో వృద్ధి 7.2 శాతమే!
♦ అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్
♦ ఇంతక్రితం 7.6 శాతం
♦ డీమోనిటైజేషన్ కారణమని ప్రకటన
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తగ్గించింది. ఇంతక్రితం 7.6 శాతంగా ఉన్న అంచనాలను 7.2 శాతానికి కుదించింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులు ఇందుకు కారణమని వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగ విభాగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. పలు రంగాల విషయంలో నగదు కొరత, మార్పిడి విషయాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని తన తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక విశ్లేషణ (డబ్ల్యఈఓ)లో పేర్కొంది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక వేసవికాల సమావేశం ప్రారంభానికి ముందు ఈ ఔట్‌లుక్ విడుదలైంది. విశ్లేషణా అంశాలను మరిన్ని చూస్తే...
మధ్యంతర కాలానికి సంబంధించి చూస్తే– వృద్ధి అంచనాలు బాగున్నాయి. వృద్ధి ఎనిమిది శాతానికి పెరగవచ్చు. కీలక సంస్కరణల అమలు, సరఫరాల వైపు సమస్యల పరిష్కారం, తగిన ద్రవ్య, పరపతి విధానాలు దీనికి దోహదం చేసే అంశాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18 ఏప్రిల్–మార్చి) దేశ జీడీపీ వృద్ధి రేటును కేంద్రం 7.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే.
పలు సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి పటిష్ట స్థితిలో ఉండడానికి కారణాలు చూస్తే– కీలక వ్యవస్థాగత సంస్కరణల అమలు, అంతర్జాతీయ వాణిజ్య సానుకూలత, విదేశీ మారక ద్రవ్య అంశాలకు సంబంధించి తక్కువస్థాయిలోనే ఒడిదుడుకులు కొనసాగుతుండడం కీలకమైనవి.
డీమోనిటైజేషన్ వల్ల ఎదురయిన సమస్యలు సర్దుమణగిన అనంతరం తక్షణం భారత్ ఆర్థిక వ్యవస్థ దృష్టి సారించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. కార్మిక చట్టాల సంస్కరణలు, తయారీ బేస్ విస్తరణ, వ్యాపారానికి సానుకూల అవకాశాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, వ్యవసాయ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఇందులో ఉన్నాయి.
బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం, వాటికి తగిన మూలధన కల్పన, సబ్సిడీల హేతుబద్ధీకరణ, పన్ను సంస్కరణలు, జీఎస్‌టీ అమలు వంటివి వృద్ధికి బాటలువేస్తాయి.
ప్రపంచ వృద్ధి రేటు 3.5%
ఇదిలావుండగా, 2016లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2017లో 3.5 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2018లో 3.6 శాతానికి చేరుతుందనీ అంచనావేసింది. ఇక చైనా వృద్ధి రేటు 2017లో 6.6 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్, ఇది 2018లో 6.2 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు, సరఫరాలపై ఒపెక్ దేశాల అంగీకృత నియంత్రణలు వెరసి చమురు ధరలు 2016 మొదట్లోకన్నా ప్రస్తుతం మెరుగుపడ్డానికి కారణాలని ఐఎంఎఫ్ వివరించింది. ఇక అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ– వేగవంతంగా వడ్డీరేటు పెంచితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కఠినమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఆర్థికవృద్ధి పుంజుకుంటోందని, భవిష్యత్ డిమాండ్‌పై విశ్వాసం మరింత పెంపొందుతోందని నివేదిక తెలిపింది. బ్రిటన్‌లోనే దాదాపు ఇదే సానుకూలత ఉందని పేర్కొంది.