అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్‌కూ వర్తిస్తుంది.
ఎలాగైతే వాతావరణ మార్పుల మీద
ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగుతున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది.
అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు.
నిఘా నామమాత్రం
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెన్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది.
ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్ లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది.
శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి.
బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట.
చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియన్్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు?
2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.
ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు.
ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరుణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లు ఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం.
అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్‌డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం.
చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి
ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు.
ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని.
సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి.
అజయ్ ఛిబ్బర్
వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్
(‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment