విశ్లేషణ
జీడీపీలో భారత్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. 1990ల్లో 17వ స్థానంలో ఉండేది. మూడు దశాబ్దాల క్రితం తలసరి ఆదాయంలో 161వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు కేవలం 159వ స్థానానికి మాత్రమే ఎగబాకింది. తలసరి ఆదాయం పెరగకుండా జీడీపీ పెరగడం దీనికి ఒక కారణం. భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్ పెరగాలంటే, సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువుండాలి. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినా, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ప్రపంచ దేశాలు ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఇదే.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది. 2030 నాటికి మన జీడీపీ మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 1990ల ప్రారంభంలో, జీడీపీ పరంగా భారతదేశం 17వ స్థానంలో ఉండేది. ఈ విషయంలో దాని సాపేక్ష స్థానం గణనీయంగా మెరుగు పడిందనడంలో సందేహం లేదు. అయితే, తలసరి ఆదాయం ప్రాతి పదికన, భారతదేశం 1990ల ప్రారంభంలో 161వ స్థానంలో ఉండగా ఇప్పుడు 159వ స్థానంలో ఉంది. అంటే, తలసరి ఆదాయం పరంగా భారతదేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా 17వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్న కాలంలోనూ పెద్దగా మారలేదు. ఎందుకు?
తలసరి ఆదాయాన్ని పెంచకుండా యాంత్రికంగా జీడీపీని పెంచే జనాభా పెరుగుదలే దీనికి కారణమని అనుకోవచ్చు. కానీ అది కారణం కాదు. వాస్తవానికి, జనాభా పరంగా భారతదేశ సాపేక్ష స్థానం ఈ కాలంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద (చైనా తర్వాత) దేశంగా ఉంది. అంతే కాదు, చర్చిస్తున్న కాలంలో జనాభా పెరుగుదల రేటు విషయంలో భారత్‌కూ, ప్రపంచ సగటుకూ గణనీయంగా తేడా లేదు. పైగా కాలక్రమేణా, దాని జనాభా పెరుగుదల రేటు తగ్గింది.
1991, 2021 మధ్య తలసరి స్థూల దేశీయోత్పత్తి ఏడు రెట్లు ఎక్కువ పెరిగిందనే వాస్తవంలో కొంత సమాధానం ఉంది. ద్రవ్యో ల్బణం ప్రభావాన్ని మినహాయిస్తే, దేశ తలసరి వాస్తవ జీడీపీ దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ, జీడీపీ ర్యాంకింగ్ మెరుగుపడి తలసరి జీడీపీ ఎందుకు స్తబ్ధుగా ఉంది?
ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశ తలసరి జీడీపీ దశాబ్దంలో రెట్టింపు అయిందనుకుందాం. ఆ దేశాలు ఇప్పటికే తలసరి సగటు జీడీపీని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే లేదా అవి కూడా సహేతుకమైన అధిక రేటుతో వృద్ధి చెందుతున్నట్లయితే, ఇతర దేశాలతో పోలిస్తే దాని సాపేక్ష స్థితిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ, ఆ దేశ జనాభా ఎంత పెద్దదైతే, మొత్తం జీడీపీ విలువ ఆ జనాభా దామాషా ప్రకారం అంత ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు, దాని జనాభా రెట్టింపు అయితే, మొత్తం జీడీపీ నాలుగు రెట్లు పెరుగుతుంది. మనం దీనిని జనాభా గుణకం ప్రభావం అని పిలవవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే అధిక జనాభా ఉన్న దేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా పెరిగే అవ కాశం ఉంది. ఈ పెద్ద జనాభా గుణకం కారణంగానే భారతదేశం 1990ల ప్రారంభం నుండి ఇప్పటి వరకు జీడీపీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎదగగలిగింది. కానీ భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్‌ను పెంచడానికి సగటు వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి.
అనేక దశాబ్దాలుగా జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ సాధిస్తున్న మెరుగుదల వెనుక... అధిక జనాభా, తలసరి జీడీపీకి చెందిన అధిక వృద్ధిరేటు కలయిక దాగి ఉంది. చైనాతో పోల్చి చూద్దాం. 1991, 2021 మధ్య, జీడీపీలో చైనా ర్యాంక్ 11 నుండి 2వ స్థానానికి పెరిగింది. అదే సమయంలో సగటు తలసరి ఆదాయంలో దాని స్థానం 158 నుండి 75కి పెరిగింది. ఈ కాలంలో దాని తలసరి జీడీపీ 38 రెట్లు పెరిగింది. అయితే భారతదేశ తలసరి జీడీపీ కేవలం ఏడు రెట్లు మాత్రమే పెరిగింది. చైనాలో ఎక్కువ జనాభా ఉన్నందున, జనాభా గుణకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు సగటు తలసరి ఆదా యాన్ని కూడా అనేక రెట్లు పెంచుకోగలిగారు. కాబట్టి మొత్తం ఆదాయం, తలసరి ఆదాయం రెండింటిలోనూ వారి సాపేక్ష స్థానం మెరుగుపడింది.
ఇప్పుడు, అసమానతల వెలుగులో, జీడీపీ లేదా జాతీయ ఆదాయం అనేది సగటు వ్యక్తి జీవన నాణ్యతకు నమ్మదగిన కొల మానం కాదని అందరికీ తెలుసు. ధనవంతులైన 10 శాతం మంది ఆదాయం 10 శాతం పెరిగి, మిగిలిన వారి ఆదాయం అలాగే ఉంటే, జాతీయ ఆదాయం 10 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. తలసరి జీడీపీ ఈ విషయంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణానికి కొంచెం ఎక్కువ విశ్వసనీయ సూచికగా ఉంటుంది. ఈ ఉదాహరణలో, తల సరి ఆదాయం 1 శాతం మాత్రమే పెరుగుతుంది.
అభివృద్ధి పరంగా నిజమైన ప్రశ్న ఏమిటంటే, మొత్తం లేదా సగటు జాతీయ వృద్ధిరేటు సాధారణ జనాభా జీవన ప్రమాణాల పెరుగుదలను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది అనేది. ఇప్పుడు, అధిక జనాభా కలిగిన దేశం తన తలసరి ఆదాయాన్ని దీర్ఘకాలంపాటు పెంచగలిగితే, పేదల ఉనికి ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంత విశ్వసనీయతకు అర్హమైనది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఏమిటి? ఈ గణాంకాలు మొత్తం చిత్రాన్ని పట్టుకోకపోయినా, ఇంకేదాన్నో సూచిస్తాయి.
మార్కెట్ సైజు, జీడీపీ వృద్ధి లాభాల్లో సింహభాగాన్ని కైవసం చేసుకుంటున్న జనాభాలోని అతి చిన్న భాగపు సౌభాగ్యం ఇందులో ఉంది. అత్యధిక రాబడిని కోరుకునే మార్కెట్లు లేదా సరళ మైన గ్లోబల్ క్యాపిటల్‌పై నిశితమైన దృష్టిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థలు మొత్తం లేదా తలసరి జీడీపీ గురించి పట్టించు కోవు. గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఒక చిన్న భాగం వారికి ముఖ్యం.
గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భారత దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినప్పటికీ, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ఎందుకంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ మొత్తం జనాభా భారతదేశ మొత్తం జనాభాలో 4–5 శాతానికి దగ్గరగా ఉంటుంది. చిన్న దేశాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు లేదా వేగంగా వృద్ధి చెందవచ్చు, కానీ మార్కెట్ పరిమాణం కారణంగా భారతదేశం ముఖ్యమైనది.
కాబట్టి మొత్తం జీడీపీ విలువ లేదా దాని వృద్ధి రేటు అభివృద్ధికి కొలమానంగా బలహీనంగా ఉన్నప్పటికీ లేదా జనాభాలో అధిక భాగం పేదగా ఉన్నప్పటికీ, ఇది బాగా డబ్బున్న, సంపన్న సమూహపు కొనుగోలు శక్తికి సూచిక. ఆర్థిక వ్యవస్థలోని ఈ విభాగం లగ్జరీ కార్లు లేదా ఫ్యాన్సీ స్మార్ట్‌ఫోన్ల మార్కె ట్‌గా పరిమాణ పరంగా చూస్తే అనేక సంపన్న దేశాలతో పోటీపడ గలదు. అదే సమయంలో మెరిసే షాపింగ్ మాల్స్, విలాసవంతమైన వస్తువులు, సేవల వినియోగం పెరగడం వల్ల భారత్ ప్రకాశిస్తున్నట్లు భ్రమ కలగవచ్చు.
మార్కెట్ పరిమాణం ఎందుకు ముఖ్యమైనది? మొదటిది, భారీ స్థాయి తయారీ పరిశ్రమలకు సంభావ్య కొనుగోలుదారుల పరంగా నిర్దిష్ట పరిమాణంలోని మార్కెట్ అవసరం. లేకపోతే, పెట్టుబడి లాభ దాయకం కాదు. రెండవది, తలసరి ఆదాయంతో సంబంధం లేకుండా, ఒక పెద్ద దేశం జనాభాలో కొంత భాగం ఆదాయం నిర్దిష్ట పరిమి తిని మించి ఉంటే, దాని డిమాండ్లు అవసరాల నుండి విలాసాలకు మారుతాయి.
కాబట్టి, జీడీపీ పరంగా భారతదేశ పెరుగుదల పూర్తిగా గణాంక నిర్మాణమేననీ, ఇది సామాన్యుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబించదనీ లేదా సగటు తలసరి ఆదాయం పెరగలేదనీ ఎవరైనా అనుకుంటే... వాళ్లు అసలు కథను విస్మరిస్తున్నట్టు. కొనుగోలు శక్తి జనాభాలోని నిర్దిష్ట విభాగానికి విపరీతంగా పెరిగింది. కాకపోతే సమస్య ఏమిటంటే– సప్లయ్, డిమాండ్ ఆట ఒక చిన్న విభాగానికే పరిమిత మైతే... అది జనాభాలో ఎక్కువ భాగానికి విస్తరించకపోతే ఆర్థిక వృద్ధి స్తబ్ధతకు గురవుతుంది. కోవిడ్ మహమ్మారి ముందు కనిపించిన వృద్ధి క్షీణత సంకేతాలు దానికి ప్రతిబింబం కావచ్చు.
మైత్రీశ్ ఘటక్
వ్యాసకర్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment