భారత వృద్ధి అవకాశాలు పటిష్టం | There's still a lot to go for the Indian economy: Hugh Young, Aberdeen | Sakshi
Sakshi News home page

భారత వృద్ధి అవకాశాలు పటిష్టం

Published Thu, Apr 6 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

భారత వృద్ధి అవకాశాలు పటిష్టం

భారత వృద్ధి అవకాశాలు పటిష్టం

అధిక వ్యాల్యుయేషన్స్‌తో స్వల్పకాలిక ఇన్వెస్టర్లకే సమస్య..
దీర్ఘకాలిక ప్రాతిపదికన అంతగా పట్టించుకోనక్కర్లేదు
అబర్డీన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆసియా ఎండీ హ్యూ యంగ్‌


భారత మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ ఆసియాలోనే అత్యంత ఖరీదైనవిగా ఉండటం స్వల్పకాలిక ఇన్వెస్టర్లకు కాస్త ఆందోళన కలిగించేదే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రాతిపదికన దీన్ని అంతగా పట్టించుకోనక్కర్లేదని అబర్డీన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆసియా ఎండీ హ్యూ యంగ్‌ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం చాలా ఖరీదైన స్టాక్స్‌గా కనిపిస్తున్నవి.. 5–10 ఏళ్ల తర్వాత సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు అనిపించవచ్చని  తెలిపారు. అందుకే తమ సంస్థ వంటి ఫండమెంటల్‌గా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వీటి గురించి పెద్దగా పట్టించుకోకుండా భారత్‌లో పుష్కలంగా ఉన్న మంచి కంపెనీల షేర్లను సాధ్యమైనంత తక్కువ రేటులో దక్కించుకునేందుకు ప్రాధాన్యమిస్తారని ఆయన పేర్కొన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్య వివరాలు....

బలహీనంగా ఐసీఐసీఐ..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్, ఐసీఐసీఐ బ్యాంకు... ఈ మూడూ తమ ఫండ్స్‌ మెచ్చిన షేర్లే అయినప్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల నుంచి కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం జరిగి ఉండొచ్చని యంగ్‌ చెప్పారు. ‘మిగతా రెండింటితో పోలిస్తే ఐసీఐసీఐ కాస్త బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు.  ఇక అమెరికాలో ఇమిగ్రేషన్‌ బిల్లుపరమైన అంశాల కారణంగా భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగ సంస్థలకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని, అయితే దీని గురించి మరీ అంతగా ఆందోళన చెందడం లేదని యంగ్‌ చెప్పారు. అందుకే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ వంటి స్టాక్స్‌లో తమ హోల్డింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవని తెలిపారు. కానీ పరిశ్రమ స్వరూపం మారిపోతుండటం కాస్త ఆందోళనకరంగా ఉంటోందని, పది.. ఇరవై ఏళ్ల క్రితం చూసినట్లుగా భారీ స్థాయి వృద్ధికి రోజులు చెల్లినట్లేనని ఆయన వివరించారు.

టెలికంపై రిలయన్స్‌ జియో ప్రభావాలు..
టెలికం రంగం చాలా శక్తివంతమైనదైనప్పటికీ.. ఇందులో తమ ఇన్వెస్ట్‌మెంట్లు పెద్దగా లేవని యంగ్‌ తెలిపారు.   కొంత మేర భారతీ గ్రూప్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేశామని.. ఏడాది, రెండేళ్ల క్రితం ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాలు కొంత పెంచుకున్నామని వివరించారు. రిలయన్స్‌ జియో నుంచి చార్జీలపరమైన పోటీతో ఈ రంగంలో ఒడిదుడుకులు తప్పేట్లు లేవని యంగ్‌ చెప్పారు. దీనితో టెల్కోల స్వల్ప కాలిక లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. మరోవైపు కన్జూమర్‌ స్టాక్స్‌కి సంబంధించి చాలా మటుకు సంస్థల ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ ఎకాయెకిన ఎగియడం ఇంకా చూడలేదని యంగ్‌ చెప్పారు. యూనిలీవర్, ఐటీసీ వంటి సంస్థల పోర్ట్‌ఫోలియోలు పటిష్టంగానే ఉన్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో వృద్ధి గణాంకాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్నదంతా భవిష్యత్‌ వృద్ధి అవకాశాల కోసమేనని చెప్పిన యంగ్‌... రాబోయే రోజుల్లో ఇది సాధ్యమేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు.

మెటల్స్, చమురుపై అనాసక్తి..
సాధారణంగా పారిశ్రామిక మెటల్స్, చమురు రంగం మొదలైనవి సీజనల్‌ ధోరణులతో కూడుకున్నవి కనుక సాధారణంగా తాము వీటి జోలికి ఎక్కువగా వెళ్లమని యంగ్‌ తెలిపారు. ఈ కోవకి చెందిన వాటిల్లో కేవలం సిమెంట్‌ రంగంలో మాత్రమే కాస్త అధికంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్‌మెంట్స్‌ గణనీయంగా పెరగవచ్చన్న అంచనాలే ఇందుకు కారణమని యంగ్‌ వివరించారు.

జీఎస్‌టీతో ప్రయోజనం
వ్యాపారాల నిర్వహణ సులభతరంగా , సమర్ధవంతంగా ఉండేలా చూసేటువంటి సంస్కరణలకు మించి మరేమీ అవసరం లేదని యంగ్‌ వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ అమల్లోకి రానుండటం ఆ దిశగా పురోగమన చర్యేనన్న యంగ్‌.. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement