మరింత వేగంగా వృద్ధి!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
తగిన వర్షపాతం, జీఎస్‌టీ, భారీ వ్యయ అంశాల ప్రస్తావన
టోక్యో: భారత్ వృద్ధి మరింత పరుగులు పెట్టడం ఖాయమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డా రు. అంతర్జాతీయ అవరోధాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తోందని అన్నారు. అధిక వర్షపాతం అంచనాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు అవకాశాలు, ప్రభుత్వ అధిక వ్యయాలు, గ్రామీణ డిమాండ్ పెరిగేందుకు చర్యలు వంటి అంశాలు రానున్న కాలంలో భారత్ భారీ వృద్ధికి దారితీస్తాయని విశ్లేషించారు. భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా... జపాన్‌లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ... బుధవారం ఒసాకాకు బయలుదేరి వెళ్లారు.
అంతక్రితం విలేకరులతో మాట్లాడుతూ, గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి సాధనకు ప్రభుత్వం చేపట్టిన విధానాలే కారణమని అన్నారు. రానున్న రెండేళ్లలో కూడా భారత్ మంచి ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు,ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అన్నారు. తగిన వర్షపాతం అంచనాలు హర్షణీయమని పేర్కొన్న ఆయన గడచిన 100 సంవత్సరాల చరిత్రలో వరుసగా మూడేళ్లు భారత్‌లో కరువు పరిస్థితులు సంభవించిన పరిస్థితి లేదనీ వివరించారు.