భారత్ వృద్ధిపై అత్యుత్సాహం తగదు..
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
♦ తలసరి ఆదాయంలో బ్రిక్స్ దేశాలకన్నా
♦ వెనుకబడి ఉన్నామని వ్యాఖ్య
♦ తగిన వృద్ధి ఫలాలు అందేవరకూ
♦ జాగ్రత్త అవసరమని సూచన
పుణే: భారత్ వృద్ధి తీరుపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం’ భావనపై అధిక ఉత్సాహం అక్కర్లేదని అన్నారు. భారత్ మరెంతో సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించే ఒక సెంట్రల్ బ్యాంకర్‌గా... ‘వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ అన్న’ వాక్యంపై తనకేమీ వ్యామోహం లేదన్నారు. ఆర్‌బీఐ నియంత్రణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలకన్నా భారత్ తలసరి ఆదాయం తక్కువగా ఉందని ఈ సందర్భంగా అన్నారు.
భారత్ పౌరుడి అత్యున్నత జీవన ప్రమాణాల సాధనకు ప్రస్తుత తరహా వృద్ధి రేటు ఇంకా 20 సంవత్సరాలు కొనసాగాల్సి ఉంటుందని వివరించారు. దేశంలో పలు వ్యవస్థాగత సంస్కరణల అమలు జరగాల్సి ఉందన్నారు ‘మనం తరచూ చైనాతో పోల్చుకుంటుంటాం. 1960ల్లో మనకన్నా చిన్నస్థాయిలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనతో పోల్చుకుంటే... ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. సగటు భారతీయుని సంపదకన్నా... చైనా సగటు పౌరుని సంపద ఐదు రెట్లు అధికం’ అని రాజన్ అన్నారు. అయితే ఇక్కడ తాను చులకన భావంతో మాట్లాడుతున్నానని భావించవద్దని కోరారు. ‘ పటిష్ట, సుస్థిర వృద్ధికి కేంద్రాలు, రాష్ట్రాలు తగిన వేదికను సృష్టిస్తున్నాయి. వాటి ఫలితాలు అందడానికి సిద్ధంగా ఉన్నాయన్న విశ్వాసమూ నాకుంది. అయితే ఇదే దారిలో మనం కొంత సమయం ఉండాలి. ఈ అంశంపై సదా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ఈ సందర్భంగా అన్నారు.
ఎన్‌పీఏల సమస్యపై భూతద్దం వద్దు: రాయ్
కాగా మొండిబకాయిల సమస్యను ప్రతి సందర్భంలోనూ తీవ్ర ఆందోళనకర అంశంగా చూపించడం తగదని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో(బీబీబీ) చైర్మన్ వినోద్ రాయ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. తాజా రుణాలపై, రుణ బకాయిలు తీర్చడంపై ఈ తరహా ధోరణి ప్రతికూలత చూపుతుందని అన్నారు. బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌ల విధాన నిర్ణయ సామర్థ్యాలపై సైతం అపోహల వ్యాప్తి సరికాదని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తగిన ఆర్థిక పరిస్థితులు లేనందున ఇబ్బందులు నెలకొంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమస్యలను అత్యంత ఆందోళనకరమైన అంశాలుగా చూపించడం తగదని వ్యాఖ్యానించారు. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వాస్తవమైనా.. ప్రస్తుతం పటిష్టంగా మారిందని రాయ్ అన్నారు. రుణ బకాయిదారులందరూ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కాబోరని పేర్కొన్నారు. రుణ లావాదేవీలన్నీ నేరపూరితమైనవి కాదనీ అన్నారు. ఒకరిద్దరు కార్పొరేట్లు చేసిన పనికి అందరినీ ఒకేగాటన కట్టడం సరికాదన్నారు. దురదృష్టవశాత్తూ మొండిబకాయిలకు సంబంధించి సమస్య సత్వర పరిష్కారంలో న్యాయ పరమైన అడ్డంకులూ ఎదరవుతున్నాయని చెప్పారు. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై ఎప్పటికైనా కఠిన చర్యలు ఉంటాయని వివరించారు.
పదాలపైకాదు... పరమార్థంపై చర్చ జరగాలి
కాగా భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డివాళ్ల లోకంలో ఒంటి కన్నురాజులా ఉందన్న తన వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంపై రాజన్ స్నాతకోత్సవంలో స్పందించారు. ఈ పదాలపై చర్చ సరికాదని, ఇందులో ప్రధాన భావనపై చర్చ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అహ్మదాబాద్ అంధుల సంఘం ఒక లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. తన పదాలకు ఆయన క్షమాపణ చెబుతూ... ఉద్దేశం భిన్నమైనదే అయినప్పటికీ, అందుకు వినియోగించిన పదాలు ఇతరులను ఎంత స్థాయిలో ఇబ్బంది పెడితే అంత స్థాయిలో తగిన క్షమాపణలను కోరతానన్నారు.
‘మాట్లాడేటప్పుడు వక్తలు జాగ్రత్తగా వ్యవహరించాలనడంలో సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో భావం తప్ప, అవమానించారని భావించడం తగదని’ కూడా అన్నారు. ఇటీవల రాజన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సహా పలువురి నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కంటికి కన్ను భావన ప్రపంచం మొత్తాన్ని చీకటి చేస్తుంది’ అన్న మహాత్ముని అహింసా సిద్ధాంతం చాలా అత్యున్నతమైనది తప్ప, దీనిని ఒక అంగవైకల్యానికి సంబంధించిన అంశంగా చూడలేముకదా అని సైతం ఆయన పేర్కొన్నారు. తాను వినియోగించిన ‘నానుడి’ కొత్తది కూడా కాదని పేర్కొన్న ఆయన, డచ్ ఫిలాసఫర్ ‘ఎరాస్‌ముస్’ దీనిని తొలిసారి వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు.