బలంగా భారత వృద్ధి అవకాశాలు
♦ వచ్చే రెండేళ్లపాటు వృద్ధి 7.5%
♦ భారత్ సౌర్వభౌమ రేటింగ్ బీఏఏ3గా కొనసాగింపు
న్యూఢిల్లీ: సంస్కరణల కొనసాగింపుతో భారత వృద్ధి అవకాశాలు స్వల్పకాలానికి బలంగానే ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కానీ, కొండలా పేరుకుపోతున్న మొండి బకాయిలే సమస్యాత్మకమని పేర్కొంది. వచ్చే రెండేళ్లపాటు వృద్ధి రేటు 7.5% స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 గానే కొనసాగించింది. ఈ రేటు అధిక స్థాయిలో ఉంటే రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థం. దీంతో ఆ దేశం పెట్టుబడులకు అనుకూలమనే సందేశం వెళుతుంది.
రుణాల ఎగవేతను అరికట్టేందుకు దివాళా చట్టాన్ని తీసుకురావడం, జీఎస్‌టీ అమలు చివరి దశలో ఉండడం సానుకూలాంశాలుగా మూడీస్ తెలిపింది. బ్యాంకులు మొండి బకాయిలను గుర్తిస్తూ ఉండడంతో నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) ఇక ముందూ పెరుగుతాయని, ఈ పరిస్థితులు ముఖ్యం గా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మందగమనంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.70వేల కోట్ల మూల దనం కంటే అధికంగానే నిధులు అవసరం అవుతాయని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ తన నివేదికలో వెల్లడించింది.
నివేదికలోని అంశాలు...
⇒ సంస్కరణలను కొనసాగించడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో కొనసాగడం వల్ల భారత్ బలమైన వృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది. కానీ, బ్యాంకింగ్ రంగంలో సవాళ్లు పెరగడం భారత పరపతి నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక, సంస్థాగత సంస్కరణల దిశగా విధాన నిర్ణేతల చర్యలు సత్ఫలితాలు ఇస్తే రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం.
⇒ బ్యాంకింగ్ రంగానికి మొండి బకాయిల సమస్య ఏర్పడడానికి వృద్ధి మందగించడం, ప్రాజెక్టుల అమలు నిదానించడం, ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయడమే కారణాలు. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 96% పెరిగి 2015 జూన్ నుంచి 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి.
⇒ మొండి బకాయిల గుర్తింపు, దివాళా చట్టంపై దృష్టి పెట్టడం భారత సార్వభౌమ రుణ అర్హతను పెంచుతుంది.