న్యూఢిల్లీ: భారత్‌లో ఉపాధి కల్పనతోపాటు, పర్యావరణ అనుకూల వృద్ధికి ప్రోత్సాహం, సామాజిక, ఆర్థిక సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది. 2023–27 కాలానికి తన ప్రణాళికలను సంస్థ ప్రకటించింది. భారత్ కోసం నూతన భాగస్వామ్య విధానాన్ని ప్రారంభించింది. భారత్‌తో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో సమ్మిళిత, బలమైన సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వనున్నట్టు తెలిపింది.
కరోనా మహమ్మారి ప్రభావం నుంచి భారత్ త్వరగా పుంజుకుందని తెలిపింది. 2023–24 సంవత్సరానికి భారత్ 6.4 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, మానవాభివృద్ధి, ఆదాయం, ప్రాంతీయ అసమానతలు, వాతావరణం పరంగా సున్నితత్వం, ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడే సుస్థిర, సమగ్రాభివృద్ధి భారత్‌కు అవసరమని అభిప్రాయపడింది. పారిశ్రామిక కారిడార్లు, మల్టిమోడల్ లాజిస్టిక్స్, పట్టణ మౌలిక వసతులు, నైపుణ్యాల అభివృద్ధి, చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలవనున్నట్టు ఏడీబీ తెలిపింది.
దీనివల్ల పట్టణ ప్రాంతాలు మరింతగా వృద్ధి చెందుతాయని, పారిశ్రామిక పోటీతత్వం పెరుగుతుందని, సంఘటిత తయారీ రంగం, సేవల రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. ‘‘ఏడీబీ ఒకే సారి విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు మద్దతునిస్తుంది. మెరుగైన పట్టణ జీవనం, గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇస్తూ లింగ సమానత్వం, పర్యావరణ సుస్థిరతతకు ప్రోత్సాహాన్నిస్తుంది’’అని ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి తెలిపారు.
భారత వాతావరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం తమ నూతన అజెండాలో భాగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాల ద్వారా ఈ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ఏడీబీలో భారత్ నాలుగో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2022 డిసెంబర్ చివరికి 605 ప్రభుత్వరంగ రుణాలకు సంబంధించి 52.6 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే 8 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులనూ అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment