న్యూఢిల్లీ: భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కోత పెట్టింది. ఏప్రిల్‌నాటి 11 శాతం వృద్ధి పరుగు అంచనాను తాజాగా 10 శాతానికి కుదించింది. కోవిడ్–10 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన ఆసియా డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)లో పేర్కొంది. 46 సభ్య దేశాలతో కూడిన ఏడీబీ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది.
► కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
► 2020–21తో పోలి్చతే 2021–22లో వినియోగం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశాలివి.
► మూడవ వేవ్ సవాళ్లు లేకపోతే 2021–22 చివరి మూడు త్రైమాసికాల్లో (2021జూలై–మార్చి 2022 )ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, మౌలిక రంగం పురోగతి, ఆరోగ్య సంబంధ సేవల పటిష్టత వంటి అంశాలు వృద్ధి రికరవీ వేగవంతానికి దోహదపడతాయి.
► 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది.
► చైనా విషయంలో 2021 వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం. కాగా ఉపాధి కల్పనా మార్కెట్, వినియోగ విశ్వాసం పటిష్టంగా ఉన్నాయి.
► దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది.
► వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది.
► కాగా అమెరికా, యూరో ప్రాంతం, జపాన్‌లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
► ఆసియా ఎకానమీల్లో ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇంధన, ఆహార ధరలు పెరుగుదలతోపాటు, కరెన్సీ విలువలు తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే సెంట్రల్ బ్యాంకులకు నిర్దేశిత స్థాయిలకన్నా భారీగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు.
► ప్రభుత్వాల ద్రవ్య, పరపతి విధానాలు సరళతరంగా కొనసాగుతాయని భావిస్తున్నాం.
భారీ వృద్ధి అంచనాకు సెకండ్‌వేవ్ దెబ్బ
కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (2021 ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి.
7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్‌బీఐ, ఐఎంఎఫ్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది.
కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. అయితే జూలైలో 5.59 శాతం దిగువకు చేరింది. ఆగస్టులో 5.3 శాతానికి దిగివచి్చంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్‌బీఐ ప్రస్తుతం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment