న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది.
కోత రెండవసారి..
ఏడీబీ ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది.
నివేదికలో మరికొన్ని అంశాలు...
► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది.
► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్‌లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి.
► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్‌డౌన్‌లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి.
► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు.
► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు.
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
Published Thu, Sep 22 2022 6:35 AM | Last Updated on Thu, Sep 22 2022 8:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment