ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2023–24) స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా క్రితం 6.2 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. కమోడిటీల ద్రవ్యోల్బణం ‘మైనస్’లో ఉండడం, ఏప్రిల్–సెపె్టంబర్ ఆరు నెలల జీడీపీ గణాంకాల్లో చక్కటి పురోగతి, అక్టోబర్–డిసెంబర్ మధ్య కూడా సానుకూల వృద్ధి గణాంకాలు వెలువడే అవకాశాలు తమ అంచనాల తాజా పెంపునకు కారణమని ఇక్రా పేర్కొంది.
‘‘2023 అక్టోబర్–నవంబర్ ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ 11.3 శాతం పెరిగింది. జూలై, ఆగస్టు, సెపె్టంబర్ (క్యూ2)లో నమోదయిన 9.5 శాతం కన్నా ఇది అధికం. పండుగల నేపథ్యంలో అధిక ఫ్రీక్వెన్సీ నాన్–అగ్రి ఇండికేటర్‌లలో నమోదయిన ఈ పెరుగుదల పూర్తి సానుకూలమైంది. ఈ నేపథ్యంలో క్యూ3తో కూడా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నాం’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
సానుకూల పరిస్థితులు...
చైనాకు సంబంధించి డిమాండ్ తగ్గే అవకాశాలు, ముడి చమురు వంటి కీలక కమోడిటీల తగినంత సరఫరాలు, సాధారణ సరఫరా చైన్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండడానికి దోహదపడే అంశంగా ఇక్రా పేర్కొంది. భారత్ ఎకానమీకి సంబంధించి అక్టోబర్, నవంబర్‌లలో అధిక క్రియాశీలత కనిపించినప్పటికీ, డిసెంబరులో ప్రారంభంలో మిశ్రమ పోకడలు కనిపించాయని ఇక్రా పేర్కొంది.
విద్యుత్ డిమాండ్ పెరుగుదల నెమ్మదించిందని, డీజిల్ డిమాండ్ క్షీణతలోకి జారిందని పేర్కొన్న ఇక్రా, రోజువారీ వాహనాల రిజి్రస్టేషన్‌లు మ్రాతం పెరిగినట్లు తెలిపింది. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది.
దీనితో ఆర్‌బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment