ప్రైవేట్ పెట్టుబడులపై దృష్టి
♦ వృద్ధి చోదకాలపై కసరత్త్తు
♦ డబ్ల్యూఈఎఫ్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
♦ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
దావోస్: అధిక వృద్ధి సాధించే దిశగా ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణపై భారత్ దృష్టి పెట్టిందని, వృద్ధి సాధనకు తోడ్పడే బహుళ చోదకాలపై కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాజ్యసభలో గణాంకాలు త్వరలో మారగలవని, చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) వంటి సంస్కరణలు అమల్లోకి రాగలవని ఆయన తెలిపారు. అనేకానేక భిన్నాభిప్రాయాలుండే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్కరణ బిల్లు కూడా ఇంతకాలం ఆగిపోలేదని, జీఎస్‌టీ మొదలైనవి త్వరలో పార్లమెంటు ఆమోదం పొందగలవని ఆయన చెప్పారు.
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ‘ప్రపంచ వృద్ధికి తదుపరి చోదక శక్తిగా భారత్’ అనే అంశంపై పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ బీసీజీ నిర్వహించిన అల్పాహార విందు సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు వివరించారు. ఎకానమీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. దేశ వృద్ధి సాధనకు మరిన్ని చోదక శక్తులు అవసరమని గుర్తించి.. ఇన్‌ఫ్రా తదితర రంగాలపై దృష్టి పెడుతున్నామని, దేశ చరిత్రలోనే తొలిసారిగా సబ్సిడీలను క్రమబద్ధీకరించామని ఆయన వివరించారు. భార త మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.
మరింత వృద్ధి సత్తా ఉంది ..
ప్రస్తుతం 7-7.5 శాతం వృద్ధి రేటు కన్నా అదనంగా 1-1.5 శాతం వృద్ధి సాధించగలిగే సామర్థ్యం భారత్‌కి ఉందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. దీన్ని సాధించే దిశగా రైల్వే ఇన్‌ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతించామని, అటు డిఫెన్స్ రంగంలోనూ విదేశీ పెట్టుబడులకు ఆస్కారం కల్పించామని ఆయన చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసేలా దేశీ సంస్థలను ప్రోత్సహించేలా భారత్ ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోందని జైట్లీ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సరళతరం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల సమస్య పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
పన్నుల విధానాలు సరళం చేస్తున్నాం..
పన్నుల విధానాలు అర్ధంతరంగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా చూసేందుకు పలు సంస్కరణలను ప్రవేశపెట్టామని ట్యాక్సేషన్ చట్టాలపై సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకి పంపిన వీడియో సందేశంలో జైట్లీ చెప్పారు. దీంతో వీటిపరమైన వివాదాలేమీ ప్రస్తుతం లేవని పేర్కొన్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్ సభ్యదేశాలుగా ఏషియన్ బిజినెస్ లా ఇనిస్టిట్యూట్ (ఏబీఎల్‌ఐ) ఏర్పాటు కావడాన్ని ఆయన స్వాగతించారు.
మొబైల్ బ్యాంకింగ్ హవా: కొచర్
కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్న అతి తక్కువ రంగాల్లో ఆర్థిక రంగం కూడా ఒకటని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తెలిపారు. తమ బ్యాంకు విషయానికొస్తే.. ఈసారి శాఖల్లో జరిగిన లావాదేవీలకన్నా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిగినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా రూ. 80,000 కోట్లు విలువ చేసే లావాదేవీల నిర్వహణను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి చూస్తే మొబైల్ బ్యాంకింగ్ విభాగంలో 29 శాతం వాటాతో తమ బ్యాంకు ముందు వరుసలో ఉందని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొచర్ తెలిపారు.
మరోవైపు తయారీ రంగం, నవకల్పనలు, నైపుణ్యాల అభివృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరగగలదని దక్షిణాసియా రూపాంతరం అంశంపై జరిగిన సదస్సులో కొచర్ చెప్పారు. దాదాపు 70 శాతం జనాభా 30 ఏళ్ల లోపు ఉన్న తమ దేశంలోనూ నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. అటు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా తమ దేశంలో ఉద్యోగాల కల్పనకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.