న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది.
మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది.
2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment