ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక | Complete planning of infra projects Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక

Published Sun, Aug 8 2021 4:45 AM | Last Updated on Sun, Aug 8 2021 4:45 AM

Complete planning of infra projects Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంద్రప్రధేశ్‌లోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పారిశ్రామిక కారిడార్‌ వంటి భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇన్‌క్యాప్‌ రూపొందించిన సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలో విమానాశ్రయ నిర్మాణ దిశగా అడుగులు పడనున్నాయి. అలాగే రాష్ట్రంలో నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ), నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) కింద కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టులకు నోడల్‌ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఇన్‌క్యాప్‌ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

కన్సల్టెన్సీ సేవలకు బిడ్లు..
రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు, వాటి అమలును పర్యవేక్షించడానికి కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ఇన్‌క్యాప్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.పవన మూర్తి సాక్షికి తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఆగస్టు 25లోగా బిడ్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్ట్‌ లీడర్, ఫైనాన్స్, టెక్నికల్‌ అంశాల విషయంలో కన్సల్టెన్సీ సేవలు అందించాలి.

‘పైలెట్‌ శిక్షణ’కూ బిడ్లు
కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో పైలెట్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సాంకేతిక నివేదికను తయారు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి ఇన్‌క్యాప్‌ బిడ్లను ఆహ్వానించింది. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును దృష్టిలో పెట్టుకొని కర్నూలు చుట్టుపక్కల ఏపీఐఐసీ పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో పైలెట్‌ శిక్షణతో పాటు ఇతర అవకాశాలను పరిశీలించి టెక్నో ఫీజబిలిటీ స్టడీ రిపోర్ట్‌ (టీఎఫ్‌ఆర్‌)ను ఇన్‌క్యాప్‌ తయారు చేస్తోంది. దేశీయ విమానయాన రగంలో వస్తున్న మార్పులు, ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు, ఈ శిక్షణ కేంద్రం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలతో నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 18లోగా ఈ మెయిల్‌ ద్వారా బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఇన్‌క్యాప్‌ కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement