సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలను అందించే మౌలిక రంగం ప్రాజెక్టులపై తదుపరి దఫా ఉద్దీపనా చర్యలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్‌ఐ) నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వివిధ ఆర్థిక వ్యవస్థలు అంచనావేసిన తీవ్ర స్థాయిలో (10 నుంచి 15 శాతం వరకూ క్షీణ అంచనాలు) భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణత ఉండదని భావిస్తున్నాను. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ద్రవ్యపరమైన ప్రత్యక్ష మద్దతు సాధ్యంకాదు. ప్రభుత్వం అందించే పలు ఉద్దీపన చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి సత్వర సాధనకు దోహదపడతాయి.
కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను రక్షించడానికి మార్చిలో కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేపీ) పథకాన్ని ప్రకటించింది. తరువాత మేలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది. వారం క్రితం మూడవ ప్యాకేజీ ప్రకటించింది. దీనిప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజ్ విలువ దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. మరో దఫా ఉద్దీపన ప్యాకేజ్ సంకేతాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇస్తున్నారు. మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ వ్యయాల ద్వారా వృద్ధికి తోడ్పాటును అందించవచ్చని పలు వర్గాలు కేంద్రానికి సలహాలను ఇస్తున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment