
ముంబై: దేశానికి ‘సమ సమాజ’ వృద్ధి చాలా అవసరమని, అసమానతలు పెంచే వృద్ధి రేటు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వృద్ధి ఫలాలు సమాజంలో కొందరికే లభించి, మెజారిటీ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమయ్యే ధోరణియే ‘కే’ (K) తరహా వృద్ధి మనకు వద్దన్నారు. గతంలో తరహాలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ‘కే’ (K) తరహా వృద్ధిని అనుమతించబోదని అన్నారు. బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
- భారతదేశంలో పెరుగుతున్న అసమానతలు మన సమాజంలో ఉద్రిక్తతలు, సమస్యలను సృష్టిస్తుంది. వాటిని మనం భరించలేము. మన వృద్ధిని మరింత విస్తృతపరిచి అందరికీ ఫలాలు లభించేలా సమానమైనదిగా చేయడానికి మనం ఇప్పుడు మార్గాలను కనుగొనాలి.
- సమానమైన వృద్ధి అనేది ప్రజలను శక్తివంతం చేస్తుంది. వారు రాణించడానికి సరైన అవకాశాన్ని కల్పిస్తుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22)ఆర్థిక వ్యవస్థ 9.2 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 8.5 లేదా 8.7 శాతం, 2023–24 ఆర్థిక సంవత్సరం 7.5 శాతం వృద్ధిని భారత్ నమోదుచేసే అవకాశం ఉంది. తద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది.
- అయితే మన యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ స్థాయి వృద్ధి రేట్లు సరిపోతాయా అన్నది మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. అందుకు ఈ స్థాయి వృద్ధి రేటు సరిపోదన్నది సుస్పష్టం. భారీ వృద్ధి దిశలో ఉన్న అడ్డంకులను మనం తక్షణం తొలగించాల్సి ఉంది. ఇది అంత తేలికకాదు. అయితే అసాధ్యమే కాదు.
- రాబోయే రెండు లేదా మూడు దశాబ్దాల పాటు మనం స్థిరమైన, వేగవంతమైన, రెండంకెల వృద్ధిని సాధించాలి. ఈ స్థాయి వృద్ధి రేటు వల్ల యువత సామర్థ్యం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉండదు.
- కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనడానికి రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధన దోహదపడుతుంది. అయితే, దేశం సాధించాలనుకునే అభివృద్ధి పర్యావరణాన్ని పణంగా పెట్టకూడదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మన వృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతర్జాతీయ నియమ నిబంధనలు, ప్రమాణాలను పరిరక్షించడానికి కూడా ఇది ఎంతో అవసరం.
- ఇక దేశంలో ప్రైవేటు రంగం పెట్టుబడులు ఎంతో కీలకం. ప్రైవేటు రంగ పెట్టుబడులు భవిష్యత్తులో దేశంలో వృద్ధికి చోదకశక్తిని అందిస్తాయి.