
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్‌ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు.
అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్‌ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.
మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్‌వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్‌ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది.
రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్‌సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్‌సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment