న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) సానుకూల పనితీరు చూపించనుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్‌ను నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా విడుదల చేశాయి.
ఏప్రిల్–జూన్ క్వార్టర్‌కు సెంటిమెంట్ స్కోరు 65గా ఉంటే, జూలై–సెప్టెంబర్‌లో 64కు తగ్గింది. అయితే భవిష్యత్ సెంటిమెంట్ స్కోర్ మాత్రం 65 నుంచి 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో రియల్టీ పరిశ్రమ వృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్, నరెడ్కో నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి సరఫరా వైపు భాగస్వాములు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అంచనాలు, ఆర్థిక వాతావరణం, నిధుల లభ్యతను ఈ సూచీ తెలియజేస్తుంది.
స్కోర్ 50గా ఉంటే తటస్థంగా, 50కి పైన సానుకూలంగా, 50కి దిగువన ప్రతికూల ధోరణిని ప్రతిఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సెంటిమెంట్ రెండూ సానుకూల శ్రేణిలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని, పరిశ్రమ దీర్ఘకాల సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది.
ఇళ్ల మార్కెట్లోనూ సానుకూలత: ఇళ్ల మార్కెట్‌లో భవిష్యత్ సెంటిమెంట్ సానుకూలంగా నమోదైంది. ధరలు పెరుగుతాయని 62 శాతం మంది అంచనా వేస్తుంటే, అమ్మకాలు పెరుగుతాయని 40 శాతం మంది భాగస్వాములు అంచనా వేస్తున్నారు. 38 శాతం మంది మార్కెట్ స్థిరంగా ఉంటుందని భాస్తున్నారు. ఆఫీస్ మార్కెట్‌లో లీజింగ్, సరఫరా, అద్దెల పరంగా బలమైన సానుకూలత కనిపించింది. రానున్న నెలల్లో ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరు చూపిస్తుందన్న అంచనాలున్నట్టు నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలంగా ఉండడడాన్ని సెంటిమెంట్ సూచీ తెలియజేస్తోందని నరెడ్కో ప్రెసిడెంట్ హరిబాబు పేర్కొన్నారు. ‘‘2024–25 సంవత్సరానికి జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ చెబుతోంది. స్థిరమైన వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత బలపడుతుంది. స్థిరమైన వృద్ధికి గాను ఈ రంగం సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలి’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment