న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత ఆర్థిక పరిస్థితులను పోల్చి చూడటం హాస్యాస్పదమేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. అయితే, శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుతగిన పాఠాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 1991లో దేశీయంగా చెల్లింపుల సంక్షోభం తలెత్తినప్పట్నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ స్థూల ఆర్థిక పరిస్థితులు కట్టుతప్పకుండా, దేశాన్ని సంరక్షిస్తున్నాయని పనగారియా చెప్పారు.
మరోవైపు, భారత్ ప్రధాన సమస్య నిరుద్యోగం కాదని .. ఉత్పాదకత, జీతాల స్థాయి తక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన జీతాలు లభించే ఉద్యోగాలను సృష్టించే దిశగా కృషి చేయల్సిన అవసరం ఉందన్నారు. 2017–18లో 6.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు .. కోవిడ్‌పరంగా కష్టకాలం అయినప్పటికీ 2020–21లో 4.2 శాతానికి దిగి వచ్చిందని పనగారియా చెప్పారు.
2017–18లో నిరుద్యోగిత రేటుపై ఆందోళనలు చేసిన వారంతా తాజా గణాంకాల తర్వాత మౌనం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ విషయాలపై భారత అధికారిక డేటాపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందిస్తూ .. దేశ జీడీపీ, కీలక గణాంకాల సేకరణ అంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోందని పనగరియా స్పష్టం చేశారు. సహేతుకమైన కొన్ని విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలను తప్పక ఖండించాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment