సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. 142 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో దేశంలోనే 46.8 శాతం పట్టణీకరణతో మూడోస్థానంలో ఉన్న తెలంగాణ మరో మూడేళ్లలో మొదటిస్థానానికి ఎగబాకబోతోందని ఇటీవల నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ‘తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు వరద కాలువల అభివృద్ధి, మురుగునీటి శుద్ధికేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టిపెట్టింది.
రాష్ట్రంలో ఎంపిక చేసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.3,809 కోట్లతో టీయూఎఫ్‌ఐడీసీ రూపొందించిన ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఇప్పటివరకు 117 పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,219 కోట్లు కేటాయించింది. అందులో రూ.72.68 కోట్లతో చేపట్టిన సిద్దిపేట భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.75.76 కోట్ల సిరిసిల్ల తాగునీటి సరఫరా ప్రాజెక్టు, రూ.160.05 కోట్ల నిజామాబాద్ మురుగునీటి సరఫరా పనులు, రూ.81.41 కోట్లతో చేపట్టిన సూర్యాపేట డ్రైనేజ్ పథకం పనులు 71 శాతం పూర్తయ్యాయి.
12 నగరాల్లో రూ.1,616 కోట్ల ప్రణాళికలు
జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్ రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, సిద్దిపేటలో 2015 నుంచి 2020 వరకు రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికల అమలుకు రూ.1,616 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటిలో నీటి సరఫరాకు సంబంధించి రూ.1,441 కోట్లతో 27 పనులు, రూ.40 కోట్లతో 35 పార్కు పనులు, 2 పట్టణాల్లో మురుగునీటి పారుదలకు సంబంధించి రూ.184 కోట్లతో 4 పనులు చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment