
యశవంతపుర: కరోనా సోకిన బాధితుడు తుమ్మడం, దగ్గడం వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని ఇప్పటిదాకా తెలుసు. కానీ, మురుగునీటి వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని కర్ణాటకలోని ప్రముఖ పర్యావరణవేత్త యల్లప్పరెడ్డి చెప్పారు. బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్తలు నిర్మలగౌడ, డాక్టర్ నిధి పలివాల్ తదితరులతో కలిసి ఆయన నగరంలో పరిశోధనలు చేశారు. మురుగునీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోని మురుగునీరు వృషభారతి, అర్కావతి నదుల్లో కలుస్తోంది. పాదరాయనపుర, బాపూజీనగర వార్డులో ఎక్కువ మంది కరోనా రోగులున్నారు. ఇక్కడి డ్రైనేజీ నీరు నేరుగా వృషభావతి నదిలోకి వెళ్తోంది. కరోనా బాధితుల నుంచి వైరస్ తొలుత మురుగు నీటి, అక్కడి నుంచి నదిలో చేరుతోందని యల్లప్పరెడ్డి పేర్కొన్నారు.