సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేట్ పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన నివాస కార్యాలయ కృష్ణాలో మంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్, వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశం జరిపారు. మహారాష్ట్ర, కేరళ సరిహద్దు జిల్లాలో ప్రస్తుతమున్న నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేయాలని నిర్ణయించారు.
అదే విధంగా రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటలనుంచి కాకుండా 9 గంటల నుంచే అమలు చేయనున్నారు. 9, 10, 11, 12వ తరగతులను ఈనెల 23 నుంచి రోజు విడిచి రోజు బ్యాచ్‌ల ప్రకారం నిర్వహించేందుకు అనుమతించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రారంభంపై నెలాఖరులో నిపుణుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. మంత్రులు డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ, డాక్టర్ కే.సుధాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, వైద్య నిపుణులు డాక్టర్ సీ.మంజునాథ్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ దేవిప్రసాద శెట్టి పాల్గొన్నారు.
1,805 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో 1,62,338 కరోనా పరీక్షలను నిర్వహిస్తే 1,805 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. 1854మంది కోలుకున్నారు. 36 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 29,15,317 మందికి కోవిడ్ సోకగా, 28,54,222 మంది డిశ్చార్జి అయ్యారు. 36,741 మంది కరోనాకు బలయ్యారు. 24,328 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతం, మరణాల రేటు 1.99 శాతంగా నమోదైంది. బెంగళూరులో 441 మందికి కరోనా సోకగా, 7 మంది మరణించారు. 434 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
బెంగళూరులో 80 అపార్టుమెంట్లు సీల్‌డౌన్
రాజధాని బెంగళూరుకు మూడో ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో బాగా తగ్గిన మైక్రో కంటైన్మెంట్ జోన్లు కరోనా ఉధృతితో ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బీబీఎంపీ 80 అపార్ట్‌మెంట్లను సీజ్ చేయడంతోపాటు 777 మైక్రో కంటైన్మెంట్ జోన్లను గుర్తించింది. వీటిలో 157 ప్రాంతాల్లో ఇంకా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహదేవపురంలో 162 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉండగా, 42 జోన్లలో మరింత ఎక్కువ కేసులు ఉన్నాయి. బొమ్మనహళ్లి విభాగంలో 31, బెంగళూరు దక్షిణంలో 16, యలహంకలో 17, ఆర్.ఆర్.నగర విభాగంలో 10, బెంగళూరు పశి్చమలో 5, దాసరహళ్లి పరిధిలో 2 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. బొమ్మనహళ్లిలో డెల్టా వైరస్ వేరియంట్‌ను గుర్తించినట్లు బీబీఎంపీ అధికారికంగా ధ్రువీకరించింది.
29 ఏళ్ల యువకుడికి జూలై 14న కరోనా వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడు అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ అని వస్తుండగా చిరునామా కూడా తప్పుగా ఉంది. దీంతో సదరు వ్యక్తిని పట్టుకోవడం ఎంతో కష్టంగా మారింది. కొత్త కేసులు సంఖ్య పెరుగుతుండడంతో బీబీఎంపీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అపార్టుమెంట్ల వద్ద గుంపులుగా ఉండకుండా అపార్టుమెంట్ సంఘాలు నిఘా పెట్టాలని సూచించింది. పార్టుమెంట్ల వద్ద కలసికట్టుగా ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో మొత్తం 1736 స్వాబ్ టెస్టులను నిర్వహించారు. మెజిస్టిక్, యశవంతపుర, కంటోన్మెంట్, కేఆర్ పురం బస్టాండ్లలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment