బీపీఎల్ భూములు వెనక్కి! | BPL lands back! | Sakshi
Sakshi News home page

బీపీఎల్ భూములు వెనక్కి!

Published Mon, Nov 10 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

BPL lands back!

రామగుండం : సుమారు 14 ఏళ్ల క్రితం బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీ (బీపీఎల్) విద్యుత్ కేంద్రం స్థాపనకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లేఖ నంబర్ బీ/233/2014, 09/09/2014 పేరిట పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం నుంచి బీపీఎల్ యాజమాన్యానికి శుక్రవారం ఉత్తర్వులు చేరాయి. బీపీఎల్‌కు కేటాయించిన మొత్తం భూమి 1,817.03 ఎకరాలు.

ఇందులో ప్రైవేటు భూములు 1,271.38 ఎకరాలు, మిగిలిన 543.05 ఎకరాలు ప్రభుత్వ భూమి. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో ఈ స్థలాన్ని ఎన్టీపీసీకి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దీనిని గుర్తించిన బీపీఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్థలాలపై స్టేటస్-కో పొందింది.

అయితే కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ భూములకు వర్తించవని, సదరు స్థలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవద్దో తెలపాలని రెవెన్యూ అధికారులు మూడుసార్లు సంజాయిషీ నోటీసులు జారీచేశారు. దీనిపై యాజమాన్యం తమ సంజాయిషీని జిల్లా కలెక్టర్‌కు నివేదించినప్పటికీ మొదటిసారి పంపిన లేఖనే మళ్లీ శుక్రవారం సాయంత్రం పంపించి.. శనివారం సంబంధిత భూమలు రికార్డులను స్వాధీనం చేసుకుంది.
 
బీపీఎల్‌ను వదిలించుకునేందుకేనా..?


విద్యుత్ ఉత్పత్తి విషయంలో బీపీఎల్, ప్రభుత్వం మధ్య పొసగకపోవడంతోనే భూములు స్వాధీనంచేసుకునేందుకు కుట్ర పన్నిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తే 28 నెలల్లోపు ఉత్పత్తి చేసి ఇస్తామని చెప్పినా.. ఇదే విషయాన్ని పలుమార్లు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించినా.. తీరా సమయానికి ఉన్న భూములు లాక్కుందని మండిపడుతున్నారు.

బీపీఎల్‌కు కేటాయించిన భూములన్నీ ఒకేచోట లేవని, ఆ స్థలాలను స్వాధీనం చేసుకున్నంతమాత్రాన ప్రయోజనం ఉండదని, అదే తమ సంస్థకే విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తే స్థలాలను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తి చేసేవారమని పేర్కొంటున్నారు. భూముల స్వాధీనంపై ప్రభుత్వ వైఖరి అంతుచిక్కడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచా రం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేర కు భూములను స్వాధీనం చేసుకున్నామని తహశీల్దార్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు.
 
ప్రభుత్వం స్వాధీనంచేసుకున్న భూములు
      
 రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న బీపీఎల్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు..
      
 మల్యాలపల్లి శివారు పరిధిలో 87.08 ఎకరాలు
      
 కుందనపల్లి శివారులో 4.23 ఎకరాలు
      
 రామగుండం శివారులో (విడివిడిగా) 128.11 ఎకరాలు, 5.21 ఎకరాలు, 45.15 ఎకరాలు, 2.32 ఎకరాలు
      
 రాయదండిలో 227.10 , 0.36 ఎకరాలు
 
 బ్రాహ్మణపల్లిలో 33.35 ఎకరాలు
      
 ఎల్లంపల్లిలో 4.01 ఎకరాలు
      
 గోలివాడలో 5.13 ఎకరాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement